Ads
సినిమా ఇండస్ట్రీలో కానీ, మరి ఎక్కడైనా కానీ ఒక మనిషి ఎదిగాలి అంటే తన కష్టం ఎంత ఉంటుందో, ఎదుర్కొన్న అవమానాలు కూడా అన్నే ఉంటాయి. అసలు అవమానాలు ఎదుర్కోకుండా ఏ వ్యక్తి అయినా సరే ఉన్నత స్థాయికి ఎదగడు.
ఒకవేళ అలా ఎదిగాడు అంటే తన జీవితంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటనని ఎదుర్కొని, దాని వల్ల అంత పెద్ద స్థాయికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని ఉంటాడు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. “నువ్వు హీరో ఏంటి?”, “నువ్వు హీరోయిన్ ఏంటి?” ఇలాంటి మాటలు విన్న నటులు ఎంతో మంది ఉండి ఉంటారు.
ఇవన్నీ తట్టుకొని ధైర్యంగా నిలబడి తమని తాము నిరూపించుకొని హీరో, హీరోయిన్స్ గా ఎదుగుతారు. గొప్ప నటులు కూడా అవుతారు. అలా ఒక డాన్స్ రియాల్టీ షోలో పాల్గొని, యాంకర్ గా చేసి, సైడ్ పాత్రలు చేసి, ఇప్పుడు స్టార్ హీరో అయిన నటుడు శివకార్తికేయన్. శివకార్తికేయన్ తమిళ నటుడు అయినా కూడా, ఆయన సినిమాలు అన్ని తెలుగులో విడుదల అవుతాయి. శివకార్తికేయన్ ప్రస్తుతం అమరన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని కమల్ హాసన్ గారు నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇందులో తన పాత్ర కోసం శివకార్తికేయన్ తనని తాను చాలా మార్చుకున్నారు. ఆ వీడియోని కూడా ఇటీవల విడుదల చేశారు. ఇవాళ శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా నిన్న సినిమా బృందం టీజర్ విడుదల చేసింది. ఇందులో శివకార్తికేయన్ ఒక మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఒక నిజ జీవిత వ్యక్తికి జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన కథ. ఇందులో శివకార్తికేయన్ పేరు ముకుంద్. టీజర్ లో బ్యాడ్జ్ మీద ముకుంద్ వి అని కనిపిస్తుంది. అంటే ముకుంద్ వరదరాజన్. ఏప్రిల్ 12వ తేదీ 1983లో పుట్టిన ముకుంద్ వరదరాజన్ తాంబరంకి చెందినవారు.
Ads
మేజర్ ముకుంద్ వరదరాజన్ అశోక చక్ర గ్రహీత. జమ్మూ అండ్ కాశ్మీర్ లోని 44 వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు డిప్యుటేషన్‌లో ఉన్నప్పుడు, భారత సైన్యం యొక్క రాజ్‌పుత్ రెజిమెంట్‌లో కమీషన్డ్ ఆఫీసర్ గా ముకుంద్ పని చేశారు. మార్చ్ 18, 2006 లో రాజ్‌పుత్ రెజిమెంట్ (22 రాజ్‌పుత్) లో లెఫ్టినెంట్‌గా షార్ట్-సర్వీస్ కమీషన్‌ను అందుకున్నారు. ముందు సాధారణ కమిషన్ తో లెఫ్టినెంట్ హోదాతో ఉన్న ముకుంద్, తర్వాత అక్టోబర్ 18వ తేదీ 2008 లో కెప్టెన్‌గా నియమించబడ్డారు. మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లోని ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో పని చేశారు. లెబనాన్‌లోని యునైటెడ్ నేషన్స్ మిషన్‌లో భాగంగా ఉన్నారు.
ఆ తర్వాత అక్టోబర్ 18వ తేదీ 2012 లో మేజర్‌గా పదోన్నతి పొందారు ముకుంద్. అదే సంవత్సరం ఆ డిసెంబర్‌లో జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని షుపియాన్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యొక్క 44వ బెటాలియన్‌కు నియమితులు అయ్యారు. ఏప్రిల్ 25వ తేదీ 2014 లో దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామాన్ని ఉగ్రవాదుల బారి నుండి కాపాడే క్రమంలో మిలిటెంట్ షాట్లు తగిలి ముకుంద్ తుది శ్వాస విడిచారు. బుల్లెట్లు తగిలినా కూడా, రక్తం కారుతున్నా కూడా అది లెక్క చేయకుండా, దేశం కోసం పోరాడి వీరమరణం పొందారు. ముకుంద్ సాహసానికి దేశ ప్రభుత్వం అశోక చక్రని ప్రకటించింది.
ముకుంద్ చనిపోయాక ఆయన భార్య ఇందు రెబెక్కా వర్గీస్ అశోక చక్ర ని అందుకున్నారు. జూన్ 1వ తేదీ 2015 లో ముకుంద్ వరదరాజన్ త్యాగానికి గౌరవ సూచకంగా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముకుంద్ కి శ్వేతా, నిత్యా అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఆగస్టు 28వ తేదీ 2009 లో ఎన్నో ఏళ్లుగా తను ప్రేమించిన ఇందు రెబెక్కా వర్గీస్ ని ముకుంద్ పెళ్లి చేసుకున్నారు. ముకుంద్ కుటుంబ సభ్యులు, తాతగారు కూడా ఆర్మీలో చేశారు.
వాళ్లని చూసి స్ఫూర్తి చెంది ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈయన మీద సినిమా తీస్తున్నారు. ఇందులో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ నటిస్తున్నారు. ఇందు పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తమిళ్ తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. సోనీ పిక్చర్స్ కూడా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.