Ads
సాధారణంగా ఏదైనా విషయం నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తాం. అది మామూలే. కానీ కాలం మారినా కూడా అమ్మాయిలు నచ్చని విషయాలకి, లేదు, వద్దు అని చెప్పడానికి భయపడుతున్నారు. ఇది నిజం. నచ్చని విషయాలు చాలా ఉంటాయి. ఇంట్లో కానీ, స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ, పని చేస్తున్న చోట కానీ, ఇలా ఎక్కడైనా సరే, ఏదైనా విషయం వారికి నచ్చకపోతే, నో చెప్పడానికి ఆలోచిస్తారట. కాలం మారింది. కాలంతో పాటు మనుషులు కూడా మారారు. కానీ ఆడవారు మాత్రం ఈ విషయంలో ఇంకా అక్కడే ఆగిపోయినట్టు పరిశోధనలు చెప్తున్నాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి.
ఒక అబ్బాయి ఏదైనా విషయం నచ్చక నో అని చెప్తే సమాజం అంగీకరిస్తుంది. అందుకు ఉదాహరణ సాధారణంగా ఇంట్లో జరిగే విషయాలు. ఇంట్లో ఒకవేళ అబ్బాయికి ఏదైనా నియమం పెడితే, అది ఆ అబ్బాయి అనుసరించలేక, “నాకు ఇష్టం లేదు” అని చెప్తే, ముందు కాస్త బాధపడినా కూడా, తర్వాత అబ్బాయిని అర్థం చేసుకుంటారు. కానీ అమ్మాయి విషయంలో ఇలా ఉండదు. ఒకవేళ అమ్మాయి ఏదైనా నచ్చక నో అని చెప్తే, తర్వాత దాని గురించి చర్చలు జరుగుతాయి. “మా మాట ఎప్పుడు జవదాటని అమ్మాయి, ఇవాళ ఒక విషయానికి అంగీకరించలేదు” అంటూ చిన్న దాన్ని పెద్దది చేస్తారు.
Ads
అమ్మాయి అభిప్రాయాన్ని గౌరవించరు. అమ్మాయి ఏదైనా విషయానికి నో చెప్తే కూడా, “తెలిసి తెలియక చెప్పింది” అని అంటారు. అదే ఒకవేళ ఒక అబ్బాయి ఏదైనా విషయానికి నో చెప్తే, “ఏదో ఆలోచించి నో చెప్పాడు” అని అనుకుంటారు. ఇది ఇంట్లో నుండే మొదలు అవుతుంది. ఇదే విషయం అమ్మాయిల మెదడులో పడిపోతుంది. ఇంట్లో, వాళ్ళు నో చెప్తే చిన్న విషయానికి పెద్ద గొడవలు అవుతున్నాయి. అలాంటిది బయట కూడా వాళ్ళు ఏదైనా విషయానికి నో చెప్తే అలాగే గొడవలు అవుతాయి అని అమ్మాయిలు నో అనే పదాన్ని తక్కువగా వాడతారట. యువతీ యువకులు ఏదైనా విషయానికి నో చెప్తే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఒకే వయసుకు చెందినవారు కాబట్టి.
కానీ ఒకవేళ తమ కంటే వయసులో పెద్దవారు అయితే, వారికి ఏదైనా విషయం మీద నో చెప్పాల్సి వస్తే మాత్రం అమ్మాయిలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మారాల్సింది ప్రపంచం కాదు. ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళు అమ్మాయి అభిప్రాయాన్ని అంగీకరించడం మొదలుపెడితే, అమ్మాయికి కూడా ఏదైనా విషయం నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే ధైర్యం వస్తుంది. ఏదైనా ఇంట్లో నుండి మొదలు అవుతుంది అని అంటూ ఉంటారు. ఈ విషయం కూడా ఇంట్లో నుండి మొదలు పెట్టాలి. ఒకవేళ అమ్మాయి అడ్జస్ట్ అయ్యి, ఆ తర్వాత ఇబ్బంది పడితే, అప్పుడు ఇంట్లో వారు, “నచ్చకపోతే ముందు చెప్పాలి కదా? ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటి?” అని అంటారు.
చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఒకవేళ ఇవన్నీ కూడా వదిలేసి అమ్మాయి ఏదైనా విషయానికి నో చెప్పాలి అని అనుకున్నా కూడా దాని కోసం చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎంతో కష్టపడి వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దాని కోసం వారిలో వారు ఒక యుద్ధం చేస్తారు. ఈ కాలంలో కూడా ఏం మారలేదు. ఇలాగే చేస్తున్నారు. కానీ చుట్టూ ఉన్న పరిసరాలు మారాలి. ముఖ్యంగా ఇంట్లో వాళ్ల నుండి ఈ ధైర్యం రావాలి. అప్పుడే అమ్మాయిలు కూడా తమ అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేస్తూ ఉంటారు.