Ads
హైదరాబాదులో జూబ్లీహిల్స్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నియోజకవర్గం పై పట్టు సాధించడం కోసం ప్రధాన పార్టీలు అయిన బిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. కాగా ఈ ఎన్నికలలో ప్రతి ఒక్క ఓటు కీలకం కావడంతో సీనియర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి ఓటు బ్యాంకులను కొల్లగొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రెహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్‌రెడ్డి బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరడం, అలాగే గత ఎన్నికల్లో ప్రభావం చూపించిన స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ బరిలో నుంచి తప్పుకోవడం వంటి అంశాలు ఎవరికి మేలు చేస్తాయనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లోటు పాట్లను ఎలా అధిగమించాలనే అంశాలపై చర్చించుకుంటున్నారు.
అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 38 మంది నామినేషన్‌లు వేయగా, 18 తిరస్కరణకు గురయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో 19 మంది నిలిచారు. బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి మహ్మద్ అజారుద్దీన్, బీజేపీ నుంచి లంకెల దీపక్‌రెడ్డి, ఎంఐఎం నుంచి మహ్మద్ రషీద్, బీఎస్సీ నుంచి కోనేటి సుజాత, ఇండియా ప్రజా కాంగ్రెస్ నుంచి జి.చెన్నారెడ్డి, పాట పార్టీ నుంచి వెంకట్‌రెడ్డి, సమైఖ్యాంధ్ర సమితి నుంచి జి.శ్రీకాంత్, స్వతంత్రులుగా సూదిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సురభీసింగ్, ఇస్మాయిల్ ఖాన్, సిద్దార్థ చక్రవర్తి, రాంబాబు వనపర్తి, మహ్మద్ అక్బరుద్దీన్, ఆనంద్, షేక్ షరీఫ్, షేక్ కరీంలు బరిలో ఉన్నారు.
Ads
తాజా ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ శిబిరంలోని రెహ్మత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయనచేరికతో డివిజన్‌లో తమ బలం పెరిగిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. బీఆర్‌ఎస్ మాత్రం అలాంటిది ఏం లేదని 69 బూత్‌లకు చెందిన వారంతా తమ శిబిరంలోనే ఉన్నారని చెబుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపొందగా కాంగ్రెస్ రెండో స్థానం, స్వతంత్ర అభ్యర్థి నవీన్‌యాదవ్ మూడో స్థానం, బీజేపీ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
కాంగ్రెస్ అభ్యర్థి పి.విష్ణు వర్ధన్ రెడ్డి కి సంప్రదాయ ఓటు బ్యాంక్‌తో పాటు పీజేఆర్ వర్గం ఓట్లు కూడా తోడయ్యాయి. టీడీపీ మద్దతు ఇచ్చింది. ఇలా అందరి సహకారంతో విష్ణు వర్ధన్ రెడ్డి కి 52,880 ఓట్లు వచ్చాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు 18 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరూ బరిలో లేరు. కాంగ్రెస్ తరఫున క్రికెటర్ అజా రుద్దీన్‌కు టికెట్ రావడంతో విష్ణు బీఆర్ఎస్లో చేరారు. నవీన్ యాదవ్ ప్రస్తుత ఎన్నికల్లో నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకొని కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో విష్ణు, నవీన్ కు పోలైన ఓట్లు ఈసారి ఎవరికి పడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.