Ads
బర్రెలక్క.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. నిరుద్యోగుల గళం వినిపిస్తానంటూ స్వతంత్య్ర అభ్యర్థిలోకి దిగి ప్రచారంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఎవరి నోట విన్నా కూడా ఈమె పేరే వినిపిస్తోంది. ఇన్‌స్టా, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఆమె వీడియోలే కనిపిస్తున్నాయి. ఈమెకు పెద్దపెద్ద వాళ్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అయితే ఇంతకీ ఎవరు ఈ బర్రెలక్క? ఆమెకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆమె మేనిఫెస్టో ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. కాగా బర్రెలక్క.. అసలు పేరు శిరీష. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం ఆమె స్థలం. శిరీష్ తండ్రి చాలా రోజుల క్రితం కుటంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు.
చదువుకుంటూనే తల్లికి చేదోడు వాదోడుగా ఉంటోంది శిరీష. ఆమె డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీకాం పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సిద్ధమవుతోంది. కానీ నోటిఫికేషన్లు ఆలస్యమవడం వచ్చినా కోర్టు కేసుల వల్ల వాయిదా పడుతుండడంతో ఆమె అసంతృప్తితో ఉన్నారు.
అయితే శిరీష ఆ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోని పెట్టింది. హాయ్ ఫ్రెండ్స్ ఉన్నత చదువులు చదివితే డిగ్రీలు వస్తున్నాయే తప్ప ఉద్యోగం రావడం లేదని అందుకే తన తల్లి కొనిచ్చిన బర్రెలను తోలుకుంటున్నారంటూ వీడియో పోస్ట్ చేశారు. శిరీష్ పెట్టిన ఆ వీడియో బాగా వైరల్ అయింది. అప్పటి నుంచీ ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది.
ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో చిన్న వీడియోలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఊహించని విధంగా తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ వేడయంతో మరోసారి ఆమె పేరు మార్మోగిపోయింది. నిరుద్యోగుల గళం వినిపించేందుకే తాను నామినేషన్ వేశానని చెబుతున్నారు శిరీష. గెలిపిస్తే అసెంబ్లీలో అడుగుపెట్టి నిరుద్యోగుల సమస్యలపై కొట్లాడతానని చెబుతున్నారు. తన చేతిలో రూ. 5,000, బ్యాంకు ఖాతాలో రూ.1500 ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొంది. శిరీషకు ఇన్‌స్టాగ్రాంలో 5.73 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 1.07 లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 1.61 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
అంతే కాకుండా బర్రెలక్క మేనిఫెస్టో కూడా ప్రకటించారు. అందులో ఏముంది అంటే..
#1. ఎమ్మెల్యే గెలిస్తే నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా మాట్లాడుతాను.
#2. పేదలకు ఇళ్లు కట్టించేందుకు కృషి చేస్తామన్నారు
#3. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు ప్రయోజనం
#4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు.
#5. ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడుతా
#6. నిరుద్యోగుల కోసం ప్రత్యేక కోర్సు, ఉచిత కోచింగ్
#7. యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్.