Ads
ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి ఫోకస్. తెలంగాణలో అధికారంకు దగ్గరయ్యామనే నమ్మకం కాంగ్రెస్ లో వచ్చింది. ఇటు బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ హైజాక్ చేసింది. పూర్వ వైభవం దిశగా సాగిపోతోంది. బీజేపీలో నేతల మధ్య దూరం పెరిగింది. కాంగ్రెస్ లో ఐక్యత పెరుగుతోంది. ఖమ్మం సభతో తెలంగాణలో అధికారం వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ లో ఖమ్మం సభ వలన ప్రకంపనలు మొదలయ్యాయి.
సీఎల్పీనేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం భట్టి యాత్ర ముగింపు వేళ బహిరంగ సభకు సర్వం సిద్ధమవుతోంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా పార్టీ బలోపేతంకై కృషి చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ ఘనంగా సత్కరించనున్నారు. లక్షలాది మంది సమక్షంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతను కాంగ్రెస్ అగ్ర నేతే సత్కరించటం అనేది అరుదైన సందర్భం. ఇప్పుడు భట్టికి ఈ అపూర్వ అవకాశం దక్కింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా భట్టి పీపుల్స్ మార్చ్ యాత్ర మొదలైంది. నేతలను ఏకం చేసింది. పార్టీకి వచ్చిన ఆదరణ, కార్యకర్తల్లో కొత్త జోష్, కేడర్ లో వచ్చిన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. భట్టి యాత్ర పైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరించిన రాహుల్ గాంధీ ఖచ్చితంగా భట్టికి తగిన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.
Ads
దీంతో, భట్టి పాదయాత్ర ముగింపు సభగా, పొంగులేటితో సహా ఇతర ముఖ్య నేతల చేరిక సభగా ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన నిర్వహణకు సిద్ధమైంది. ఖమ్మంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సందడి చేస్తున్నారు. ఖమ్మం సభ వేళ తెలంగాణ కాంగ్రెస్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఖమ్మం చేరుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. పార్టీ నేతలతో కలిసి వైరా రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో వంద ఎకరాల స్థలంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జనగర్జన సభకు ముందు రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకునే సమయంలో యువజన కాంగ్రెస్ నేతలు భారీ బైకు ర్యాలీకి ప్లాన్ చేసారు. ఆ ర్యాలీలో రాహుల్ గాంధీ పొల్గొంటారు. అంచనాలకు మించి జనం హాజరయ్యే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు.
అటు బీజేపీలో గందరగోళం కొనసాగుతోంది. పార్టీలో నుంచి నేతలు వీడుతారనే భయం వెంటాడుతోంది. పార్టీ నాయకత్వం మార్పు పైన డైలమాలో నేతలు ఉన్నారు. రాహుల్ వస్తుండటంతో బీజేపీ అగ్ర నాయకత్వం చూపు ఇప్పుడు ఖమ్మం వైపు ఉంది. అనూహ్యంగా కాంగ్రెస్ తెలంగాణలో పంజుకోవటం, బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఈ సమయంలోనే ఖమ్మం సభకు అధికార బీఆర్ఎస్ అవాంతరాలు కలిగించే ప్రయత్నం చేస్తోంది. సభకు ముందు బస్సులు ఇవ్వటానికి అంగీకరించిన ఆర్టీసీ..ఆ తరువాత నో చెబుతోంది. మంత్రుల ఒత్తిడితో నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో లేని చెక్ పోస్టులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సభ – భట్టి విక్రమార్క యాత్ర – రాహుల్ రాక – నేతల చేరికలు పైన ప్రగతి భవన్ లో చర్చలు సాగుతున్నాయి. నిఘా నివేదికల పైన తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఖమ్మం సభ చుట్టూ తెలంగాణ రాజకీయం కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.