Ads
సీనియర్ నటి రజిత తెలుగు ఆడియెన్స్ బాగా సుపరిచితం. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా అమ్మ, అత్త, అక్క, వదిన లాంటి ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. రజిత తెలుగులోనే కాకుండా ఒరియా, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో 300 పైగా చిత్రాలలో నటించింది.
1998 లో పెళ్ళికానుక చిత్రంలో ఉత్తమ హాస్యనటిగా రజిత నంది అవార్డ్ అందుకుంది. ఆమె వయసు 50 సంవత్సరాలు అయినప్పటికీ, రజిత ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటో ఒక షోలో చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. రజిత స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా. ఆమె తండ్రి పేరు మల్లెల రామారావు, తల్లి విజయలక్ష్మి. తండ్రి ఆమె పుట్టక ముందే చనిపోయారు. రజితకు ఇద్దరు అక్కలు, వీరిని ఆమె తల్లే పెంచి, పెద్ద చేసింది. ఆమె 9వ తరగతిలో ఉన్నప్పుడు చెన్నైలో ఉన్న నటి కృష్ణవేణి దగ్గరకు వెళ్ళింది. కృష్ణవేణి రజితకు పిన్ని, ఆ సమయంలో కృష్ణవేణి అగ్నిపుత్రుడు మూవీలో నటిస్తోంది. ఆమెతో పాటు షూటింగ్ వెళ్ళిన రజితను చూసిన పరుచూరి గోపాలకృష్ణ, ఆమెను దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం చేశాడు.
ఆ మూవీలో నాగేశ్వరరావు కుమార్తె పాత్రకు ఆమెను తీసుకున్నారు. అలా ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ మూవీ తరువాత రజితకు వరుసగా అవకాశాలు రావడంతో చదువుకుంటూనే సినిమాలలో నటించింది. ఒరియా, కన్నడ, తమిళ సినిమాలలో రజిత హీరోయిన్ గా నటించింది. ఎక్కువగా తెలుగులో కామెడీ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ, 300 పైగా సినిమాలలో నటించారు. ఇప్పటికీ సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. అయితే ఆమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఇదే విషయాన్ని ఆలీతో సరదాగా షోలో అడుగగా,
రజిత ” నాన్న నేను కడుపులో ఉన్నప్పుడే చనిపోయారు. ఇద్దరు అక్కలు, అమ్మ మా ముగ్గురిని కష్టపడి పెంచింది. ఇంట్లో నలుగురం ఆడవాళ్ళమే, అన్నింటికీ తామే బయటికి వెళ్లాల్సి వచ్చేది. 8వ తరగతికి వచ్చేటప్పటికి అక్కలిద్దరికి పెళ్లి అయ్యి, వెళ్ళిపోయారు. అప్పుడు ఇంట్లో ఇద్దరమే ఉండేవాళ్లం. దాంతో ఇంట్లో మగవారి తోడు అవసరం అని అనిపించేది కాదు. అమ్మ సింగిల్ గానే ముగ్గురిని పెంచి, పెద్ద చేసింది. తనలాగే నేనుండలేనా అని అనిపించేది. ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేదు. అమ్మను బాగా చూసుకోవాలనే కోరిక మాత్రమే ఉండేది” అని చెప్పుకొచ్చారు.
Ads