Ads
తమిళనాడును అతలాకుతలం చేస్తున్న మిచౌంగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపుగా దూసుకొస్తోంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో సౌత్ కోస్తాంధ్రకు కదులుతుండడంతో తీరం వైపు ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు ఎడతెరపిలేకుండా కురుస్తున్నాయి.
Ads
నేడు మిచౌంగ్ తుఫాన్ నెల్లూరు, మచిలీపట్నంల మధ్య బాపట్లకు దగ్గరలో తీరం దాటుతుందని చెబుతున్నారు. తుఫాన్ వల్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తీరం వెంబడి ఉన్న ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ వైపుకు దూసుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్ నెల్లూరు, మచిలీపట్నంల మధ్య తీరాన్ని దాటనుంది. అయితే తీరం దాటే సమయంలో 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు బలంగా వీస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం సాయంత్రానికి తీరాన్ని దాటే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకు 14 కి.మీ. వేగంతో కదిలిన తుఫాన్ ప్రస్తుతం 12 కి.మీ.కు తగ్గిందని ఐఎండీ వెల్లడించింది.
తుఫాన్ తీరం దాటాక కోస్తా జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్లలో అతి తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం నుండి ఒంగోలు వరకు తీరానికి దగ్గర ఉన్న లోతట్టు ప్రాంతాల మీద తుఫాను ఎఫెక్ట్ అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ తుఫాన్ కారణంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి.
రహదారుల పైన నీరు నిలవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు నేలకూలాయి, కరెంట్ సరఫరా ఆగిపోయింది. సోమవారం రాత్రి నుండి వర్షం, ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ తుఫాన్ నేపథ్యంలో మొత్తం ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ రెడ్ అలర్ట్ ప్రకటించిన లిస్ట్ లో ఉన్నాయి. ప్రభుత్వం ఎనిమిది జిల్లాల్లో మొత్తం 300 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. తీరప్రాంత జిల్లాల్లో ఉన్న స్కూల్స్ కు నేడు సెలవులు కూడా ప్రకటించారు.
Also Read: విశాఖపట్నంలో బెస్ట్ ప్లేస్ అంటే ఇదే..! కానీ దీని పరిస్థితి ఇలా అయిపోయిందేంటి..?