Ads
గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో తన రాజీనామా లేఖని రామకృష్ణారెడ్డి ఇచ్చారు. అంతే కాకుండా, పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
స్పీకర్ కి పంపిన లేఖలో రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడానికి గల కారణాలని చెప్పలేదు. కేవలం పదవికి రాజీనామా చేసినట్టు మాత్రమే ఇందులో రాశారు. అయితే పార్టీకి రాజీనామా చేయడానికి కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి అని సమాచారం.
సమయం కథనం ప్రకారం, గత కొంతకాలంగా పార్టీ వైఖరి మీద రామకృష్ణారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఆ కారణాలతోనే రాజీనామా చేశాను అని ఆయన చెప్పి, అలాగే అన్ని కారణాలని త్వరలోనే వెల్లడిస్తాను అని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 1995 నుండి కాంగ్రెస్ పార్టీలో పని చేశాను అని, 2004 లో సత్తెనపల్లి టికెట్లు ఆశించి భంగపడ్డాను అని అన్నారు. 2009 లో పెదకూరపాడు టికెట్ ఆశించాను అని రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైయస్ జగన్, వైఎస్ఆర్సిపి పార్టీ ఏర్పాటు చేశారని, ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను అని, ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను అని, తొందరలోనే ఆ కారణాలు కూడా చెప్తాను అని రామకృష్ణారెడ్డి వెల్లడించినట్టు సమాచారం. అయితే, మంగళగిరి నియోజకవర్గంలో కొంత కాలం నుండి వైఎస్ఆర్సిపి నేతల మధ్య విభేదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పోటీగా కార్యాలయాలు కూడా ప్రారంభించారు.
Ads
తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన గంజి చిరంజీవి టికెట్ ఆశిస్తున్నారు. అంతే కాకుండా, కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగు హనుమంతరావు పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. వీరు మాత్రమే కాకుండా, దొంతి వేమారెడ్డి కూడా నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా తాడేపల్లి నగర అధ్యక్షుడు అయిన దొంతి వేమారెడ్డి పార్టీ పేరుతో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మంగళగిరిలో ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉంది.
కానీ అక్కడ ఇప్పుడు వేమారెడ్డి మరొక పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం అనేది చర్చల్లో నిలిచిన విషయంగా మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని పరిష్కరించలేదు అని, అలా విభేదాలు పెరిగి రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు అని సమాచారం. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో గంజి చిరంజీవికి సీటు వచ్చే అవకాశం ఉంది అనే చర్చ జరగడంతో, ఈ వార్త కూడా రామకృష్ణారెడ్డిని బాధ పెట్టిందట. కానీ ఏదేమైనా రామకృష్ణారెడ్డి తన వ్యక్తిగత కారణాలని బయటికి చెప్పేంత వరకు వీటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో తెలియదు.
ALSO READ : అసలు ఎవరు ఈ శ్రీధర్ బాబు..? తెలంగాణ కొత్త IT మినిస్టర్ రాజకీయ ప్రస్థానం ఇదే..!