Ads
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇవాళ ఉదయం కారు ప్రమాదంలో మరణించారు. కారు వేగం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయాలు అవ్వడంతో ఘటనాస్థలిలోనే లాస్య నందిత మరణించారు. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున జరిగింది.
అయితే, అంత పొద్దున లాస్య నందిత ఎక్కడికి వెళ్లారు అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కొంత మంది బాసర వెళ్లారు అని అంటే, మరి కొంత మంది సదాశివపేట వెళ్లారు అని అంటున్నారు. సమయం కథనం ప్రకారం, లాస్య నందిత సదాశివపేట దర్గాకి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.
Ads
సంగారెడ్డి జిల్లాలో ఉన్న సదాశివపేట మండలంలోని ఆరూర్ నుంచి కోనాపూర్ వెళ్లే మార్గంలో ఉన్న మీస్కిన్ బాబా దర్గాకి లాస్య నందిత వెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల సమయంలో ఆమె అక్కడికి వెళ్లారు అని దర్గా నిర్వాహకులు చెప్తున్నారు. మొక్కులు తీర్చుకొని ఉదయం 3 నుండి 4 గంటల సమయంలో దర్గా నుండి బయలుదేరారు అని అన్నారు.
దర్గా నిర్వాహకురాలు మీడియాతో మాట్లాడుతూ, “ముందు రాత్రి వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారు. తర్వాత మేడం దర్గాకి వచ్చారు. కొబ్బరికాయలు కొట్టి, దర్గా దగ్గర ప్రార్థన చేసి, తర్వాత కొద్దిసేపు ఇక్కడే కూర్చుని వెళ్లిపోయారు. వాళ్లంతా ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారు” అని చెప్పారు. లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. లాస్య నందిత వయసు 36 సంవత్సరాలు. గత సంవత్సరం లాస్య నందిత తండ్రి చనిపోవడంతో తన పదవిని కూతురికి, అంటే లాస్య నందితకి ఇచ్చారు.