Ads
చెన్నైలో ఎంతో ఉత్కంఠగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. కోల్కతా నైట్రైడర్స్ విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన వారు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అయితే, కెప్టెన్ వ్యూహానికి తమ తోడ్పాటుని ఇచ్చిన వారు ప్లేయర్స్. వీరందరితో పాటు మరొక వ్యక్తి కూడా జట్టు విజయానికి కారణం అయ్యారు. ఆయనే మెంటార్ గౌతమ్ గంభీర్.
మ్యాచ్ అయిపోయిన తర్వాత కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఓనర్ షారుఖ్ ఖాన్, గౌతమ్ గంభీర్ ని పొగడ్తలతో ముంచెత్తారు. గౌతమ్ గంభీర్ మెంటార్ గా వచ్చిన తర్వాత మాత్రమే కోల్కతా నైట్రైడర్స్ జట్టు బ్యాటింగ్ లైనప్ తో పాటు, బౌలింగ్ లో కూడా మెరుగుపడ్డారు. ఇక్కడ గౌతమ్ గంభీర్, సునీల్ నరైన్ ని ఓపెనర్ గా పంపించాలి అనుకున్నారు. ఈ నిర్ణయం జట్టు గెలవడానికి సహాయపడింది. గంభీర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు 2012, 2014 సంవత్సరాల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు ట్రోఫీ సాధించింది. ఆ తర్వాత మళ్లీ గంభీర్ కొన్నాళ్ళు జట్టుకు దూరం అయ్యారు. ఇప్పుడు మళ్లీ మెంటార్ గా ఉన్నప్పుడు ట్రోఫీ గెలిచారు.
Ads
అయితే, ఇప్పుడు ఐపీఎల్ అయిపోయిన వెంటనే గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్రైడర్స్ జట్టు మెంటార్ పదవి నుండి బయటికి వచ్చినట్టు ఒక వార్త వచ్చింది. అందుకు కారణం, గౌతమ్ గంభీర్ కి బీసీసీఐ వాళ్ళు ఒక భారీ ఆఫర్ ఇచ్చారు. గౌతమ్ గంభీర్ కి టీం ఇండియా కోచ్ గా నియమించాలి అని బీసీసీఐ కోరారు. అయితే ఈ వార్త షారుఖ్ ఖాన్ వరకు చేరడంతో, షారుఖ్ ఖాన్, గౌతమ్ గంభీర్ కి మరొక ఆఫర్ ఇచ్చారు. షారుఖ్ ఖాన్, గౌతమ్ గంభీర్ కి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు సమాచారం. వచ్చే పది సంవత్సరాల పాటు కూడా కోల్కతా నైట్రైడర్స్ జట్టుకి కేవలం గౌతమ్ గంభీర్ మాత్రమే హెడ్ గా ఉండాలి అని షారుఖ్ ఖాన్ కోరినట్టు సమాచారం.
గౌతమ్ గంభీర్ నిర్దేశకత్వం టీంకి కావాలి అని జట్టు సభ్యులు అందరిని ఒప్పించారట. అయితే ఇక్కడ గౌతమ్ గంభీర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గౌతమ్ గంభీర్ షారుఖ్ ఖాన్ ఇచ్చిన ఆఫర్ ని అంగీకరిస్తారా, లేకపోతే టీం ఇండియా కోచ్ గా చేరుతారా అనేది తెలియదు. ఒకవేళ ఐపీఎల్ లో కొనసాగితే మాత్రం టీం ఇండియా కోచ్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే, టీం ఇండియా కోచ్, ఎలాంటి ఫ్రాంచైజ్ లీగ్ లో కోచ్ పదవిలో కానీ, లేదా ఇతర పదవిలో కానీ ఉండకూడదు అనే ఒక నియమం ఉంది. మరి ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఏం చేస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.