Ads
కొంత మంది నటులు చేసిన కొన్ని సినిమాలతోనే చాలా ఫేమస్ అయిపోతారు. వారు సినిమాలో చెప్పే ఒక్క డైలాగ్ కూడా వారిని చాలా పాపులర్ చేస్తుంది. తర్వాత ఆ నటుల గురించి ఎక్కడైనా చెప్పాల్సి వస్తే, వారి పేరు కంటే ముందు వారు చెప్పిన ఆ డైలాగ్ వస్తుంది. అలా ఇటీవల ఒక నటుడు చాలా ఫేమస్ అయ్యారు. “ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ లా ఉన్నావు?” అనే డైలాగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినిపిస్తోంది. ఈ డైలాగ్ విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో డైలాగ్. సినిమా డబ్బింగ్ సినిమా అయినా కూడా ఈ డైలాగ్ మాత్రం చాలా పాపులర్ అయ్యింది.
ఈ డైలాగ్ చెప్పిన నటుడు పేరు గణేష్. ఆయన తమిళ్ లో వీటీవీ గణేష్ పేరుతో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. గణేష్ రెడ్ అనే ఒక తమిళ్ సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన వెట్టియాడు విలైయాడు సినిమాలో నటించారు. ఆ సినిమా తెలుగులో రాఘవన్ పేరుతో డబ్ అయ్యింది. ఆ తర్వాత సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించారు. ఏ మాయ చేసావే తమిళ్ వర్షన్ అయిన విన్నై తాండి వరువాయా సినిమాలో గణేష్ నటించారు.
Ads
తెలుగులో కృష్ణుడు పోషించిన పాత్రని తమిళ్ లో గణేష్ పోషించారు. ఈ సినిమాతో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా పేరు షార్ట్ ఫామ్ అయిన VTV తో ఆయన వీటీవీ (VTV) గణేష్ గా ఫేమస్ అయ్యారు. ఈ సినిమాకి నిర్మాతగా కూడా గణేష్ వ్యవహరించారు. అంతే కాకుండా తెలుగులో కూడా ఏ మాయ చేసావే సినిమాలో హీరో డైరెక్టర్ గా మారిన తర్వాత షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ బృందంలో ఒకరిగా కనిపిస్తారు. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. గణేష్ నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు.
కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడారు. బీస్ట్ సినిమాలో గణేష్ తెలుగు వర్షన్ కి కూడా తన సొంత గొంతునే చెప్పుకున్నారు. దాంతో ఆయన వాయిస్, ఆ వాయిస్ తో ఆయన చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత గణేష్ చాలా డబ్బింగ్ సినిమాల్లో కనిపించారు. బీస్ట్ తర్వాత తెలుగులో డబ్ అవుతున్న ఆయన సినిమాల్లో దాదాపు ఆయన గొంతుతోనే తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో కూడా గణేష్ నటించారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలా సినిమాల్లో గణేష్ నటిస్తున్నారు.