Ads
ప్రియమైన పవన్ కళ్యాణ్ అన్నకి,
నేను నీ అభిమానిని. అభిమాని అంటే మామూలు అభిమాని కాదు. నిన్ను నా సొంత అన్నలాగా భావిస్తాను. నువ్వు బాధపడుతూ ఉంటే నా సొంత వారు బాధపడుతున్నంత భారంగా అనిపిస్తుంది. నీ సినిమాలు హిట్ అయితే నాకు సంతోషంగా అనిపిస్తుంది. సరిగ్గా ఆడకపోతే నేను బాధ పడతాను. నిన్ను ఒక్కసారి అయినా కలిసి, నాలాంటి వాళ్ళు ఇంకా నీ కోసం చాలా మంది ఉన్నారు అని చాలా సార్లు చెప్పాలి అనిపించింది. నీ సినిమాలని చూస్తూ సంతోషపడుతున్న సమయంలో నువ్వు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు చెప్పావు. ముందు భయమేసింది. ఎందుకంటే రాజకీయాల్లో నిలబడడం అనేది చిన్న విషయం కాదు.
ఏదేమైనా సరే. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటావు. నీ అభిమానులుగా నీ నిర్ణయాన్ని గౌరవించి నీకు సపోర్ట్ చేయడం మా బాధ్యత. అదే చేయాలి అనుకున్నా. తర్వాత అజ్ఞాతవాసి సినిమా చేశావు. ఇద్దరు హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి బాగుంటుంది అనే అనుకున్నా. కానీ ఆ సినిమా తర్వాత అసలు సినిమాలు చేయను అని చెప్పావు. ఆరోజు నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే, నువ్వు మాకు దగ్గర అయ్యిందే సినిమాల వల్ల. అలాంటి సినిమాలకి నువ్వు దూరం అవుతాను అంటే తట్టుకోలేకపోయాను.
Ads
సరే రాజకీయ సభల్లో అయినా నిన్ను చూసే అవకాశం ఉంది అని అనుకున్నాను. తర్వాత మళ్లీ సినిమాలు చేస్తున్నట్టు చెప్పావు. ఆరోజు నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. రాజకీయాల్లోకి వెళ్లాక విమర్శలు ఇంకా ఎక్కువ అయ్యాయి. అవన్నీ చూసి నేను తట్టుకోలేకపోయాను. నా వల్ల కాలేదు. నీ సినిమాలు హిట్ అవుతూ వస్తుంటే మళ్ళీ మా పవర్ స్టార్ అన్న మా కోసం సినిమాలు చేస్తున్నాడు అని అనుకున్నాను. గత మూడు నెలల్లో నీ గురించి నేను వినని మాట లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేయాలి అంటే భయమేసింది. ఎక్కడ చూసినా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా నువ్వు చెప్పే మాటల మీద కామెంట్స్ చేస్తున్నారు. అవన్నీ విని విని చాలా మంది నమ్మకాన్ని కోల్పోయారు.
ఒక సమయంలో అసలు రాజకీయాల్లో నిలబడడం కష్టం ఏమో అని నాకే అనిపించింది. కానీ ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలకి, నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం లభిస్తూ ఉంటే కన్నీళ్లు ఆగట్లేదు. నాలాగా భయపడిన వారందరికీ నీ గెలుపుతో ధైర్యం చెప్పావ్. ట్రోల్ చేసిన వాళ్లందరి నోటితోనే ఇప్పుడు శభాష్ అనిపించుకుంటున్నావ్. నమ్మని వాళ్ళందరికీ ఎన్నికల ఫలితాలతో నమ్మకం కలిగేలా చేశావు. అసలైన నాయకుడివి అంటే నువ్వే. ఇంక నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, భవిష్యత్తులో ఏం చేసినా కూడా నేను, నాలాంటి ఎందరో అభిమానులు నీతోనే ఉంటారు.
ఇట్లు,
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.