Ads
నా పేరు రవి. నా వయసు 41 సంవత్సరాలు. నా భార్య పేరు సంధ్య. మాకు పెళ్లి జరిగి ఆరు సంవత్సరాలు దాటింది. నేను హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాను. సంధ్య మా కంపెనీలోనే పనిచేసేది. అలాగే చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా మా పెళ్ళికి అడ్డు చెప్పలేదు. మా అమ్మ వాళ్లు ఊర్లో ఉంటారు. సంధ్యకి వారితో పెద్దగా పరిచయం లేదు. పెళ్లి జరిగే ముందు సంధ్యని మా అమ్మానాన్నలతో మాట్లాడించాను. మా అమ్మ ప్రవర్తన సంధ్యకి నచ్చలేదు.
తనకు చెప్పకుండా పెళ్లి కోసం అమ్మాయిని వెతుక్కున్నాను అనే కోపం అమ్మ సంధ్య మీద చూపించింది. నాతో చాలా బాగా మాట్లాడింది. ఈ విషయం సంధ్యకి నచ్చలేదు. కానీ పెద్దవారు కదా ఇలాంటి విషయంలో కోపం రావడం తెలిసిన విషయమే అని సంధ్య అడ్జస్ట్ అయిపోయింది. పెళ్లయ్యాక సంధ్య ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అందరి విషయంలో బాగుండేది. కానీ మా అమ్మ విషయానికి వచ్చేటప్పటికి ఇష్టం లేనట్టు ప్రవర్తించేది. మా అమ్మని సరిగ్గా పట్టించుకునేది కాదు. అప్పుడప్పుడు మా అమ్మ మా ఇంటికి వచ్చేది.
Ads
అప్పుడు కూడా సరిగ్గా మాట్లాడేది కాదు సంధ్య. “అయిపోయిందేదో అయిపోయింది. ఇక మీదట అవన్నీ వదిలేసి హాయిగా ఉందాం” అని సంధ్యకి చాలా సార్లు చెప్పడానికి ప్రయత్నించాను. కానీ అసలు వినట్లేదు. మా అమ్మ ఏమో, “ఆ అమ్మాయికి అంత ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు ఎగబడి మాట్లాడాలి” అని అంటుంది. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. మాకు ఇంకా పిల్లలు లేరు. ఈ విషయం మీద కూడా అమ్మ నాతో ఏం మాట్లాడదు. సంధ్య కూర్చుని ఉంటే సంధ్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. మొన్న ఒకసారి అలాగే మాట్లాడడానికి ప్రయత్నిస్తే సంధ్య చాలా పెద్ద గొడవ చేసింది.
పెద్దవాళ్లు అన్నాక ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. ఈ వయసులో వాళ్ళకి నేను ఇది తప్పు. ఇది తప్పు కాదు అని చెప్పి మార్చలేను. మారాల్సింది మేము. వాళ్ళు ఏదైనా అన్నా కూడా మేము అందుకు రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. సంధ్యకి కూడా ఇదే చెప్పాను. “అమ్మ ఈ వయసులో మారదు. తను మాట్లాడేది విను. కానీ పట్టించుకోకుండా వదిలేసేయ్. ఎక్కువ రియాక్ట్ అవ్వకు. దాని వల్ల గొడవలు తప్ప ఏమీ అవ్వవు” అని చెప్పాను.
ఇన్ని సంవత్సరాలు అయితే ఇద్దరూ మంచి స్నేహితులు అవుతారు అనుకున్నాను కానీ కమ్యూనికేషన్ గ్యాప్ ఇంకా పెరుగుతూ పోతోంది. అలా అని సంధ్య ఏమైనా మంచిది కాదా అంటే కాదు. సంధ్య చాలా మంచిది. అందరినీ బాగా అర్థం చేసుకుంటుంది. కానీ మా అమ్మ విషయంలో మాత్రమే ఇలా ప్రవర్తిస్తోంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య మాత్రం నాకు మనశ్శాంతి లేదు.