Ads
ఒక మనిషికి ఏది మంచి ఏది చెడు అంటే కొన్ని విషయాల్లో మాత్రమే ఒక అభిప్రాయం ఉంటుంది. మిగిలిన అన్ని విషయాల్లో కూడా వారి జీవన విధానం అంతా వారి తల్లిదండ్రులని చూసే ఉంటుంది. తల్లి తన తండ్రితో ఎలా ప్రవర్తిస్తుంది, తండ్రి తన తల్లితో ఎలా ప్రవర్తిస్తాడు అనేది పిల్లల మీద గట్టి ప్రభావం పడుతుంది. వాళ్లు పెద్దయ్యాక తన తల్లిదండ్రులు చేసిన తప్పులు తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అంతవరకు కూడా తన తల్లిదండ్రులు చేసినది కరెక్ట్ అనుకొని తన భాగస్వామితో కూడా అలాగే ప్రవర్తిస్తారు. అలా సమాజంలో సాధారణం అనుకున్న ఎన్నో విషయాలు సరైనవి కావు.
హాస్యం పేరుతో ఇంకొకళ్ళని తిట్టడం అస్సలు కరెక్ట్ కాదు. కొన్ని మన వరకు అనుభవం వచ్చే వరకు అందులో ఎంత తప్పు ఉంది అనే విషయం మనకు తెలియదు. నా పరిస్థితి కూడా అలాగే జరిగింది. నా పేరు దేవి. చదువుకొని ఉద్యోగం చేస్తున్నాను. పెళ్లయ్యాక కూడా ఉద్యోగం మానకూడదు అని నిర్ణయించుకున్నాను. ఒక వయసు వచ్చాక, పెళ్లి అయ్యాక, నా జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో అని కలలు కనడం మొదలు పెట్టాను. అమ్మానాన్నలు కూడా ఒక సంబంధం తీసుకొచ్చారు.
అబ్బాయి నచ్చాడు. నా అభిప్రాయాలని గౌరవిస్తాను అని చెప్పాడు. నేను అనుకున్నట్టే ఉన్నాడు అనుకొని ఆనందపడ్డాను. మా అత్తమామలు కూడా మంచివారు. నాతో చాలా స్నేహంగా మాట్లాడుతారు. కొంత కాలం ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకున్న తర్వాత మాకు పెళ్లి జరిగింది. కన్నీళ్ళతో తల్లిదండ్రులకు వీడ్కోలు పలికి, మరొక పక్క కొత్త జీవితానికి ఆనందంగా స్వాగతం పలికాను. పెళ్ళైన మరుసటి రోజు నా అత్తమామలకి, నా భర్తకి నా చేతులతో నేనే స్వయంగా వండి పెట్టాను.
నా వంట తిని వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. జీవితాంతం వారిని ఇంతే ఆనందంగా చూసుకుంటే చాలు అని అనుకున్నాను. సమయం గడుస్తున్న కొద్ది మనిషిలోని కొత్త కోణాలు బయటికి వస్తాయి అంటారు. మెల్లగా వీళ్లలో కూడా మార్పు మొదలైంది. ముందు నేను పని సరిగ్గా చేయట్లేదు అన్నారు. ఉద్యోగం దృష్టిలో పడి పనిని నిర్లక్ష్యం చేస్తున్నాను అన్నారు. నాకు ఇది బ్యాలెన్స్ చేసుకోవడం కొత్త కాబట్టి పొరపాట్లు జరుగుతున్నాయి ఏమో అనుకున్నాను. కానీ మెల్లగా రెండు చేయడానికి ప్రయత్నించాను.
ఒకపక్క ఉద్యోగం చేస్తూనే, మరొక పక్క ఇంటి బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్నాను. కొంత కాలం తర్వాత మా అత్తగారు ఒకరోజు వచ్చి ఉద్యోగం మానేయమని చెప్పారు. ఇంక ఉద్యోగం చేసింది చాలు అని, ఇంటి పనులు చూసుకోమని, పిల్లల విషయం కూడా ఆలోచించమని చెప్పారు. నేను, నా భర్త పెళ్లికి ముందే అనుకున్నాం. పెళ్లయ్యాక కెరీర్ లో ఒక స్థాయికి వెళ్ళాక మాత్రమే పిల్లల గురించి ఆలోచించాలి అని మేమిద్దరం నిర్ణయం తీసుకున్నాం. మధ్యలో ఇరువైపుల నుండి తల్లిదండ్రులు ఇలా ఒత్తిడి తెస్తున్నా కూడా పెద్దగా పట్టించుకోవద్దు అనుకున్నాం.
Ads
ఇదంతా ముందే అనుకున్నాం కాబట్టి వీళ్ళ మాటలు పెద్దగా కొత్తగా ఏమీ అనిపించలేదు. కానీ ఒకరోజు జరిగిన ఒక సంఘటన నాకు చాలా బాధ కలిగించింది. మా అత్తగారి తరపు బంధువు ఒకరోజు మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో పని చేసే వ్యక్తి ఆయనకి మంచినీళ్లు అందించింది. ఆయన మా అత్తగారితో, “పనిమనిషిని ఎందుకు పెట్టుకున్నావు? ఇంట్లో కోడలు ఉంది కదా?” అని అన్నారు. నాకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అయ్యింది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది.
అందుకు మా అత్తగారు, “ఏం చేస్తాం చెప్పు? నా కోడలు చాలా సున్నితమైన మనిషి. ఇవన్నీ చేయడం చేతకాదు” అని చెప్పారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇదంతా పక్కనే కూర్చుని నా భర్త చూస్తూనే ఉన్నాడు. ఆవిడ మాట్లాడిన మాటలకు నవ్వుతున్నాడు కానీ, తన భార్యని అవమానిస్తున్నారు అని ఒక్క మాట కూడా నాకు మద్దతుగా మాట్లాడలేదు. కాళ్ళ కింద భూమి కనిపించినట్టు అయ్యింది. ఎలాంటి బంధంలో అయినా గౌరవం అనేది చాలా ముఖ్యమైన విషయం. తల్లిదండ్రులకి అయినా సరే. తన పిల్లలని ఒక పాయింట్ వరకు మాత్రమే తిట్టే అధికారం ఉంటుంది.
ఆ తర్వాత పిల్లల ఇష్టాలని కానీ, నిర్ణయాలను కానీ వారు గౌరవించాలి. తమ పిల్లలు సరైన మార్గంలో నడవట్లేదు అని అనిపిస్తే వాళ్ళని తిట్టి అవమానించడం కాకుండా, వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ఆలోచించే నేను, నేను పెళ్లి చేసుకొని వెళ్లిన వాళ్ళు అలా మాట్లాడేటప్పటికి తట్టుకోలేక పోయాను. ఇంత బాధలో నా తల్లిదండ్రులకి ఫోన్ చేద్దామా అంటే అది కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే, ఒక సమయం తర్వాత మన పరిస్థితులని మనమే పరిష్కరించుకోవాల్సి వస్తుంది.
మన తల్లిదండ్రులకు కూడా మనకి ఇబ్బంది అయిన ప్రతిసారి చెప్పలేము. ఒకవేళ చెప్పినా కూడా సర్దుకుపోమని వాళ్ళు చెప్తారు. ఏ సమస్య అయినా సరే మనమే పరిష్కరించుకోవాలి. మనకు సహాయం చేయడానికి ఎవరూ రారు. అందుకే ఈ సమస్యని కూడా వారికి చెప్పొద్దు అనుకున్నాను. పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి తెచ్చుకున్న అమ్మాయిని పనిమనిషితో పోల్చడం ఏంటి అనిపించింది. పనిమనిషి అనే వ్యక్తి డబ్బులు తీసుకొని తన పని చేస్తుంది. ఆ వృత్తిలో ఒక గౌరవం ఉంది. కానీ నేను అలా కాదు. వీళ్ళింటికి పెళ్లి చేసుకొని వీళ్ళ అబ్బాయితో జీవించడానికి వచ్చాను.
కానీ నేను వాళ్ళింట్లో పని చేయడానికి వచ్చాను అన్నట్టు మాట్లాడారు. ఇది వినడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇదే పని నేను చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ అబ్బాయిని నేను కేవలం డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాను అని కానీ, లేదా ఇంట్లో పనులు చేయించడానికి వాడుకుంటున్నాను అని కానీ మాట్లాడితే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ జోక్ లాగా అనిపించినా కూడా, కొన్ని మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి. తమలో ఒక మనిషిగా వాళ్ళు నన్ను కలుపుకుంటే చాలు అనుకున్నాను.
కానీ ఇలా మాట్లాడేటప్పటికి చాలా బాధగా అనిపించింది. ఇది మాత్రమే కాదు. ఇలాంటి చాలా మాటలు నేను విన్నాను. ఇది నా ఒక్కదాని సమస్య మాత్రమే కాదు. సమాజంలో ఎంతో మంది ఆడవాళ్లు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరదాగా మాట్లాడే మాటలు అనే పేరు పెట్టి ఇలాంటి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్లకి చిన్న విషయాల లాగానే అనిపిస్తాయి. కానీ ఆ మాటలు విన్నవారికి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారికి ఇవి చాలా ఇబ్బందికరంగానే అనిపిస్తాయి.