Ads
మాధవన్. ఈ పేరు వింటే సఖి, చెలి ఇలాంటి సినిమాలు గుర్తొస్తాయి. లవర్ బాయ్ అనే ఒక పేరుకి అర్థం తెలిపేలా మాధవన్ సినిమాలు ఉండేవి. మాధవన్ అన్ని రకాల సినిమాలు చేసేవారు. కానీ ఎక్కువ ప్రేమ కథలు మాధవన్ కి పేరు తీసుకొచ్చాయి. మాధవన్ కి చాలా మంది మహిళా అభిమానులు ఉన్నారు. యువ వంటి సినిమాల్లో మాధవన్ తన ఇమేజ్ కి భిన్నంగా ఉండే పాత్రలు కూడా చేశారు. అయినా కూడా మాధవన్ అంటే కేవలం ప్రేమ కథలు మాత్రమే అందరికీ గుర్తొస్తాయి.
అలాంటి మాధవన్ విలన్ పాత్ర చేస్తే? ఊహించుకోడానికే కష్టంగా ఉంది కదా? నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాలో మాధవన్ విలన్ పాత్ర చేసినా కూడా గెటప్ అంతా మామూలుగానే ఉంటుంది. కానీ, పూర్తిగా గెటప్ మార్చేసి, చూస్తేనే కోపం వచ్చేంత క్రూరత్వం ఉన్న పాత్రలో మాధవన్ నటిస్తారు అని ఎవరు అనుకొని ఉండరు. అలాంటి పాత్రలో మాధవన్ నటించారు. అది కూడా ఒక బాలీవుడ్ సినిమాలో. ఆ సినిమా ఇటీవల విడుదల అయ్యి చాలా మంచి స్పందన తెచ్చుకుంది. ఆ సినిమా పేరు షైతాన్. అజయ్ దేవగన్, జ్యోతిక కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.
Ads
మార్చ్ 8వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. కేవలం హిందీ భాషలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, కబీర్ (అజయ్ దేవగన్), ఆయన భార్య జ్యోతి (జ్యోతిక), వాళ్ల పిల్లలు జాన్వీ (జాంకీ బోడివాలా), ధృవ్ (అంగద్ రాజ్). వీళ్ళకి ఒక రోజు వనరాజ్ (మాధవన్) కలుస్తాడు. తర్వాత అతను వాళ్ళ ఫామ్ హౌస్ కి వస్తాడు. అక్కడ జాన్వీని హిప్నోటైజ్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సినిమా కథ అంతా దాదాపు ఒకే ఇంట్లో జరుగుతుంది. ఈ సినిమా గుజరాతిలో వచ్చిన వష్ అనే సినిమాకి రీమేక్.
సినిమాలో నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు. మొదటి నుండి చివరి వరకు ఏం అవుతుంది అనే ఆసక్తితో సినిమా నడుస్తుంది. ఇలాంటి పాత్రలో మాధవన్ ని చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. తన పాత్రలో చాలా బాగా నటించారు. కూతురి పాత్ర పోషించిన జాంకీ బోడివాలా కూడా చాలా బాగా నటించారు. సినిమా మొత్తం కూడా ఆ అమ్మాయి పాత్ర చుట్టూ తిరుగుతుంది. అలాంటి పాత్రలో తన పాత్రకి న్యాయం చేశారు. ఒరిజినల్ గుజరాతిలో కూడా తన పాత్రలో తనే నటించారు.
ఈ సినిమాకి వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. అమిత్ త్రివేది సంగీత దర్శకత్వం వహించారు. వికాస్ బహల్, జ్యోతి దేశ్‌పాండే, అజయ్ దేవగన్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ ఈ సినిమాని నిర్మించారు. నటీనటుల పర్ఫార్మెన్స్ కి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. ఈ సినిమా విమర్శకులు ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాకుండా, చాలా మంది ప్రేక్షకుల అభినందనలు కూడా అందుకుంది.