Ads
అయోధ్యలో బాల రాముని మందిర ప్రారంభోత్సవం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత దేశ నలుమూలల నుండి ప్రతిరోజు అయోధ్యకి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది.
అయితే ఇదే అదునుగా తీసుకుని అక్కడ ఒక సరికొత్త దోపిడీకి తెరతీశారు అక్కడి హోటల్స్ వారు. ఎక్కువగా భక్తులు రావడంతో అక్కడి వస్తువులను అధిక ధరలకు విక్రయించడం మొదలుపెట్టారు.
నాణ్యమైన వస్తువులు సేవలు అందించాల్సిన హోటల్స్ కస్టమర్లను ముంచేసే చెత్త సర్వీసులతో నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయోధ్యలో రామమందిరం ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు పోటెత్తుతున్న తరుణంలో ఇదే అదునుగా రెస్టారెంట్లు రేట్లను భారీగా పెంచేశాయి. ఒక రెస్టారెంట్ చేసిన నిర్వాకం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.
Ads
అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత శబరి రసోయి అనే ఒక రెస్టారెంట్ ప్రారంభించారు. భక్తులు ఎక్కువగా రావడంతో ఈ రెస్టారెంట్ వ్యాపారం బాగా జరుగుతుంది. దీంతో కక్కుర్తి పడిన రెస్టారెంట్ యాజమాన్యం అమాంతం రేట్లును పెంచేసింది. 10 రూపాయలు ఉండే టీ ని 55 రూపాయలు చేసింది. ఒక సింగిల్ టోస్ట్ ధరను 65 రూపాయలుగా పెంచేసింది.ఒక కస్టమర్ ఆ రెస్టారెంట్‌కి వెళ్లి రెండు టీలు, రెండు టోస్టులు ఆర్డర్ చేయగా, జీఎస్టీతో కలిపి మొత్తం రూ.252 వసూలు చేసింది. దీంతో ఖంగుతిన్న ఆ కస్టమర్ ఇదేంటి అని హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఇక్కడ ఇంతే అంటూ సమాధానం చెప్పారు.
వెంటనే ఆ కస్టమర్ ఆ హోటల్ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త వైరల్ గా మారి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీకి చేరింది. దీంతో అధికారులు ఆ హోటల్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం దీనిపై అక్కడ రాద్ధాంతం జరుగుతుంది.