Ads
ప్రస్తుత రోజుల్లో సినిమా ప్రేమికులు ఎంతమంది ఉన్నారో క్రికెట్ ప్రేమికులు అంతకు రెండింతలు ఉన్నారని చెప్పవచ్చు. క్రికెట్ అంటే పిచ్చి ప్రాణం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇకపోతే 1983 తర్వాత భారత క్రీడారంగంలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకీ ఆ మార్పులు ఏంటి అన్న విషయానికి వస్తే.. 1975 లో మొదటిసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది.
ఇంగ్లండ్ వేదికగా 60 ఓవర్ల ఫార్మాట్‌తో వరల్డ్ కప్‌ను నిర్వహించింది. అయితే అప్పటికే ఐసీసీలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న భారత్ ఆ మెగాటోర్నీలో పాల్గొన్నప్పటికీ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. మరో నాలుగేళ్ల తర్వాత 1979 లో కూడా ఇంగ్లాండ్ వేదికగానే రెండో వరల్డ్ కప్ జరిగింది. ఈ రెండు టోర్నీల్లో కలిపి టీమ్ ఇండియా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే నెగ్గింది.
దీంతో 1983లో ఇంగ్లండ్, వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా టీమ్ ఇండియా బరిలోకి దిగింది. జట్టు లోని చాలా మంది ఆటగాళ్లు కూడా ఇంగ్లండ్ పర్యటనను ఒక ట్రిప్ లాగానే భావించారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో అడపాదడపా విజయాలు సాధించినా ఒక మెగాటోర్నీలో నిలకడగా ఆడి విజయం సాధించగల సత్తా కపిల్‌దేవ్ సారథ్యంలోని టీమ్ ఇండియాకు లేదని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా దుమ్మురేపిన కపిల్ డెవిల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ అద్వితీయ ఆటతీరుతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు.
కపిల్ దేవ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపించగా అమర్ నాథ్, గవాస్కర్, రోజర్ బిన్నీ, సయ్యద్ కిర్మాణీ, రవిశాస్త్రి, ప్రభాకర్ ఇలా ప్రతి ఒక్కరు తమవంతు పాత్ర పోషించారు. దాంతో అప్పటికే ప్రపంచ క్రికెట్‌ను ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న వెస్టిండీస్‌కు చుక్కలు చూపారు.
ఇదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే అసాధారణ ప్రదర్శనతో ఇంగ్లండ్ వేదికగా భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన టీమ్ఇండియాకు నగదు ప్రోత్సాహకం అందించాలని బీసీసీఐ భావించింది. అయితే అప్పటికే మన బోర్డు పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. అప్పుడంటే ప్రసార హక్కులు, స్పాన్సర్లు, ఎండర్స్మెంట్లు, సోషల్ మీడియా అంటూ వివిధ రూపాల్లో డబ్బు వచ్చి పడే పరిస్థితి కాకపోవడంతో ఏం చేయాలో తెలియక బీసీసీఐ తెగ ఇబ్బంది పడింది.
Ads
చక్కటి ప్రదర్శన చేసిన ప్లేయర్లకు ఏదో ఒకటి చేస్తేనే దేశంలో మరింత మంది యువ క్రీడాకారులు ఆటలను కెరీర్‌గా ఎంపిక చేసుకుంటారని భావించిన బోర్డు ఒక సంగీత విభావరి నిర్వహించింది. భారత క్రికెట్ జట్టు అభిమాన గణంలో అతి ముఖ్యమైన వ్యక్తి అయిన ప్రఖ్యాత గాయిని లతా మంగేష్కర్ ముందు ఈ ప్రస్తావన వచ్చింది.
దీంతో తానెంతో ఇష్టపడే క్రికెటర్ల కోసం ప్రత్యేక కచేరీ నిర్వహించేందుకు లతా దీదీ ఒప్పుకుంది. ఇంకేముందు తక్షణమే ఏర్పాట్లు జరిగిపోయాయి. ముంబై వేదికగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును కలిపి ప్లేయర్లకు నగదు బహుమతిగా అందించారు. లతా దీదీకి క్రికెట్‌పై ఉన్న అభిమానానికి ఇది మచ్చుతునక కాగా ఆమె గౌరవార్థం అప్పటి నుంచే భారతదేశంలో టీమ్ఇండియా ఎక్కడ మ్యాచ్ ఆడినా రెండు వీఐపీ సీట్లను లతా దీదీ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేసి ఉంచడం బీసీసీఐ ఆనవాయితీగా వస్తుంది.
ఆ తరువాత భారతీయ యువతను 1983 ప్రపంచకప్పు క్రికెట్ వైపు మళ్లించింది. అక్కడి నుంచే దేశ వ్యాప్తంగా గల్లీ గల్లీలో గిల్లీ దండాకు బదులు మూడు కర్రలు బాతి చెక్కతో బ్యాటింగ్ చేయడం షురూ అయింది. ఆ మెగాటోర్నీ సమయానికి పదేండ్ల కుర్రాడిగా ఉన్న సచిన్ టెండూల్కర్, ఆ విజయాన్ని టీవీల్లో చూసి సంబురపడిపోయాడు.
అక్కడితో ఆగిపోకుండా ఏదో ఒక రోజు తాను కూడా దేశం కోసం వరల్డ్‌కప్ నెగ్గాలని కలలు కన్నాడు. తదనంతర కాలంలో కఠోర శ్రమ, అంకుఠిత దీక్షతో తన కలను నిజం చేసుకుంటూ. 2011లో వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడాడు. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం అన్నట్లు.. 2011 మెగాటోర్నీ విజయాన్ని వీక్షించిన ఎందరో యువకులు ఆ తర్వాతి కాలంలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు.
ఇప్పుడు మరోసారి యావత్ దేశానికి స్ఫూర్తి నింపగల అద్భుత సందర్భం రోహిత్ సేన ముందుంది. పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో ఆదివారం ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. రోహిత్ సేనను విజయం వరించాలని 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా భయంగా ఎదురుచూస్తున్నారు. మరి చివరికి విజయం ఎవరిని వర్తిస్తుందో చూడాలి మరి.