Ads
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లాలోని మాచర్ల దగ్గర వరికపుడిశెల ఎత్తిపోతల స్కీమ్ పనులకు బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ పథకాన్ని రూ.340.26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చెబుతూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై విమర్శలు చేశారు.
పల్నాడు జిల్లాలో వరికపుడిశెల ఎత్తిపోతల స్కీమ్ పనులకు ప్రారంభించిన సీఎం జగన్, ఈ సందర్భంగా ప్రతిపక్షాల పై విమర్శలు చేశారు. “ఆయన 2000 లో ఉంటే 2047 గురించి చెబుతాడు. 2000 గురించి చెప్పమంటే, చెప్పడు. 2000 సంవత్సరంలో నువు ఉన్నావు, ఇప్పుడేం చేస్తాడో చెప్పమంటే చెప్పడు. యాబై ఏళ్ల విజన్ అంటడు. యాబై ఏళ్ల తరువాత ఏం జరగబోతోందనేది మాత్రం చెబుతాడు. ఎందుకనీ అంటే యాబై ఏళ్ల తర్వాత ఎవడుంటాడో, ఎవడు పోతాడో, ఎవరు చూశారో? ప్రజలకి క్యాలీఫ్లవర్లు పెట్టడం సులభం కదా అని అనుకునే మనస్తత్వం.
అదే మీ బిడ్డ పాలనలో కేవలం ఈ యాబై మూడు నెలల కాలంలోనే పల్నాడును జిల్లా చేసింది ఎవరంటే మనం, మనందరి ప్రభుత్వం. పల్నాడుకు రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మనం, మనందరి ప్రభుత్వం. పల్నాడులో కానివ్వండి, రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా, గ్రామ గ్రామాన సచివాలయాలు, గ్రామ గ్రామాన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు అంటే మనం, మనందరి ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నా. గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి.
గ్రామ గ్రామాన విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, గ్రామ గ్రామాన ఇంటింటికీ జల్లెడ పట్టి ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతోంది. గ్రామ గ్రామాన నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియం బడులు వచ్చాయి. గ్రామ గ్రామాన రూపురేఖలు మారుతున్నాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ. ఇవన్నీ ఏర్పాటు చేసింది ఎవరంటే మనం, మనందరి ప్రభుత్వం. అది కూడా ఈ యాబై మూడు నెలల కాలంలోనే చేశామని చెప్పడానికి ఇంకా గర్వపడుతున్నా” అని అన్నారు.
Ads
Also Read: తెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్స్ లో 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఎవరు..?