Ads
స్వదేశంలో వరల్డ్ కప్‌ను అందుకోవాలనుకున్న టీమిండియాకు నిరాశే ఎదురైంది. కోట్లాది మంది భారతీయుల కల చెదిరింది. ప్రపంచ కప్ 2023 టోర్నీ మొదటి నుంచి వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకొచ్చిన రోహిత్ సేన ఫైనల్ లో ఓటమి పాలయ్యింది.
ఆదివారం (నవంబర్ 19) నాడు ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ కప్ అందుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్ లో ఓటమికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయమే అని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగా లేకపోవడంతో పాటు ఆసీస్ అద్భుతమైన బౌలింగ్ వల్ల కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తప్ప మిగతావారు అంతగా రాణించలేకపోయారు. గిల్, అయ్యర్, సూర్యకుమార్ బ్యాటింగ్ లో ఘోరంగా విఫలం కావడంతో భారత జట్టు తక్కువ స్కోర్‌కు ఆలౌట్ అయ్యింది. 241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఆసీసీ ను భారత బౌలర్లు మొదట్లో భయపెట్టారు.
షమీ మొదటి ఓవర్‌లోనే వార్నర్‌ను ఔట్ చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత బౌలింగ్ చేసిన బుమ్రా 2 వికెట్లు తీసి, ఆస్ట్రేలియాను ఒత్తిడికి గురయ్యేలా చేశాడు. 47 రన్స్ కి మూడు వికెట్లు తీయడంతో అందరు ప్రపంచ కప్ భారత జట్టుదే అని భావించారు. అయితే ఆ తర్వాత అంతా మారిపోయింది. అయితే షమీ తొలి వికెట్ తీసినా, కొత్త బాల్ తో బౌలింగ్ చేయించడం వల్లే భారత్ గెలిచే అవకాశాలు తగ్గాయని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
తొలి ఓవర్లలో షమీ కన్నా సిరాజ్ ఎఫెక్టీవ్‌గా బౌలింగ్ చేసేవాడు. ఈ టోర్నీ అన్ని మ్యాచ్ లలో పాతబంతితో బౌలింగ్ చేసిన షమీ, ఫైనల్ మ్యాచ్‌లో కొత్త బాల్ ను నియంత్రించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. భారీగా పరుగులు ఇచ్చాడు. ఇక కొత్త బాల్ తో బాగా బౌలింగ్ చేసే సిరాజ్, ఈ మ్యాచ్ లో పాత బాల్ తో తేలిపోయాడు. రోహిత్ శర్మ తీసుకున్న ఈ డిసిషన్ మ్యాచ్ పై ప్రభావం చూపించింది. సెమీస్ వరకు పాటించిన పద్ధతినే ఫైనల్ మ్యాచ్ లో కొనసాగిస్తే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Ads
Also Read: ఔట్ కాకపోయినా “స్మిత్” రివ్యూ ఎందుకు కోరలేదు..? కోహ్లినే కారణమా..?