Ads
కోట్లాదిమంది హిందువుల కల 500 సంవత్సరాల తర్వాత రామజన్మ భూమి అయోధ్యలో సోమవారం నాడు రామ మందిరం ప్రారంభోత్సవంతో నెరవేరింది. అత్యంత అట్టహాసంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకను నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగింది. దివ్యమైన ముహూర్తంలో గర్భగుడిలో బాల రాముడు కొలువుదీరాడు. అయితే ఈ వేడుకకు ప్రధాని మోదీ రాముడి కానుక వెండి పళ్లెంలో తన చేతులతో తీసుకువచ్చారు. ఆ కానుక ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిర్ణయించిన ముహర్త సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయోధ్య రామ మందిర గర్భగుడిలో వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రారంభం అయ్యింది. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వెండి పళ్లెంలో పట్టు వస్త్రాలు మరియు వెండి ఛత్రం తీసుకువచ్చి బాల రాముడికి సమర్పించారు.
Ads
ఆ తరువాత బాల రాముడి విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలను నిర్వహించారు. మధ్యాహ్నం సరిగ్గా 12గంటల 29 నిముషాలకు అభిజిత్ లగ్నంలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ మహత్తర వేడుకను ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా చూసిన భక్తులు రామ నామ స్మరణలో జన్మ ధన్యం చేసుకున్నారు. అయితే వేడుకకు హాజరు అయిన ప్రధాని మోదీ వెండి ఛత్రంను రాముడి కానుకగా ఇచ్చారు.
అయితే వెండి గొడుగు హిందూమతంలో దేవతలు, వారి దైవిక శక్తిని సూచిస్తుంది. అంతేకాకుండా వెండి గొడుగు రఘుకుల వంశాన్ని కూడా సూచిస్తుంది. రాంలాలా విగ్రహంలోని వెండి పందిరి కూడా అతని ప్రకాశం మరియు కీర్తిని సూచిస్తుంది. పూర్వ కాలంలో రాజు సింహాసనం పైన ఈ వెండి గొడుగును ఉంచేవారు. రాముడు రఘువంశానికి చెందినవాడు మరియు రాజుగా అయోధ్యను పాలించాడు. అందువల్ల రాజుకు చిహ్నంగా మరియు గౌరవంగా వెండి ఛత్రంను సమర్పించారని తెలుస్తోంది.