Ads
నాగ్ అశ్విన్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కిన మరొక మంచి డైరెక్టర్. తీసినవి మూడు సినిమాలు. కానీ మూడు, మూడు రకమైన సినిమాలు. మొదటి సినిమా జీవితం అంటే అర్థం తెలిపే సినిమా. రెండవ సినిమా తెలుగు సినిమా గర్వపడే ఒక నటి మీద తీసిన సినిమా. మూడవ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాని మరొకసారి నిరూపించిన సినిమా. సినిమాకి సినిమాకి మధ్యలో చాలా సమయం తీసుకుంటారు. కానీ అంతే మంచి ఆ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉంటారు. నాగ్ అశ్విన్ సినిమాల గురించి అందరికీ తెలుసు.
కానీ సినిమాల్లోకి రాకముందు నాగ్ అశ్విన్ ఏం చేసేవారు అనేది తెలియదు. సినిమాల్లోకి వచ్చాక ఏం చేశారు అనేది కూడా మొత్తం తెలియదు. నాగ్ అశ్విన్ బేగంపేట్ లో ఉన్న ద హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. రానా దగ్గుబాటి, నాగ్ అశ్విన్ క్లాస్ మేట్. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లో మాస్ కమ్యూనికేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ఫిలిం డైరెక్షన్ కోర్స్ చేశారు. నేను మీకు తెలుసా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ కెరీర్ మొదలుపెట్టారు.
Ads
ఆ తర్వాత లీడర్ సినిమాకి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఇక్కడే నాగ్ అశ్విన్ ఒక సినిమాలో నటించారు. లీడర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నాగ్ అశ్విన్ కనిపిస్తారు. హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కలిసి బైక్ మీద వెళుతూ ఉంటారు, అయితే హీరోయిన్ ని ఒక ఇద్దరు వ్యక్తులు చూస్తూ ఉంటారు. అప్పుడు హీరో హెల్మెట్ తీసి చూడంగానే వాళ్ళిద్దరూ వెళ్లిపోతారు. వారిలో ఒకరు నాగ్ అశ్విన్. ఇప్పటి వరకు ఈ సినిమా చాలా సార్లు చూసి ఉంటారు. కానీ ఇందులో నాగ్ అశ్విన్ ఉన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు.
నేను మీకు తెలుసా సినిమాలో కూడా బ్రహ్మానందం అసిస్టెంట్ గా నటించారు. నేను మీకు తెలుసా సినిమాకి అజయ్ శాస్త్రి దర్శకత్వం వహించారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో గోల్డ్ ఫేజ్ లో ఉండే ఒక వ్యక్తిగా నటించారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన మూడు సినిమాల్లో కూడా నాగ్ అశ్విన్ నటించారు. ఇప్పుడు డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అందరూ నాగ్ అశ్విన్ సినిమాలని పొగుడుతున్నారు. ఎంతో మంది అభిమానులని, ఎన్నో అవార్డులను కూడా నాగ్ అశ్విన్ సంపాదించుకున్నారు.