Ads
అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. అయోధ్య అంత కూడా రామ నామ స్మరణతో నిండిపోయింది. హెలికాప్టర్ లో పూల వర్షం కురిపించారు. భారతదేశమంతటా ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎంతో మంది ప్రముఖులని ఈ వేడుకకి ఆహ్వానించారు. రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు, సినీ ప్రముఖులు ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుండి చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఈ వేడుకకి హాజరు అయ్యారు.
రామ్ లల్లా విగ్రహాన్ని మైసూర్ కు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. ఈ భాగ్యం తమకు దక్కినందుకు యోగిరాజ్ కుటుంబం సంతోష పడుతున్నారు. విగ్రహం ప్రతిష్ట తర్వాత అరుణ్ యోగిరాజ్ తొలిసారి స్పందించారు. “ప్రస్తుతం ఈ భూమిపై అత్యంత అదృష్టవంతుడినని భావిస్తున్నాను… నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, ఆ భగవంతుడు శ్రీరాముడి ఆశీర్వచనాలు నాకు ఎప్పటికీ ఉంటాయి. కొన్నిసార్లు నేను కలల ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది” అని ఆయన అన్నారు.
ఈ క్రమంలో అరుణ్ యోగిరాజ్ భార్య విజేత తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె భర్త విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు అతని కంటికి గాయం అయిన విషయాన్ని వెల్లడించింది. రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కే పనిని అరుణ్ యోగిరాజ్‌కి అప్పగించినప్పుడు, విగ్రహానికి అనువైన రాయి మైసూరు సమీపంలో ఉందని తెలుసుకున్నాడు. అయితే అతను రాయి కోసం సైట్ ను సందర్శించినప్పుడు ఆ రాయి చాలా గట్టిగా ఉంది. విగ్రహాన్ని చెక్కుతున్న క్రమంలో ఒక పెచ్చు యోగిరాజ్ కంటికి గుచ్చుకుంది. దానిని తొలగించడానికి కంటి ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చింది.
విపరీతమైన నొప్పి ఉన్నప్పటికీ, దానిని భరిస్తూనే విగ్రహం చెక్కడాన్ని కొనసాగించాడని చెప్పుకొచ్చారు. చివరికి ఆయన కృషి, అంకితభావం, పనితనం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పుణ్యకార్యానని అప్పగించినందుకు తమ కుటుంబం ఆనందంలో మునిగిపోయిందని వెల్లడించింది.