ఆత్మీయ‌త ప‌రుచుకున్న ‘కాలాన్ని నిద్ర‌పోనివ్వ‌ను!’

Ads

ఎన్.గోపి ర‌చించిన ‘కాలాన్ని నిద్రపోనివ్వ‌ను’ అనే వ‌చ‌న‌క‌విత్వానికి 2000సంవ‌త్స‌రానికి గాను కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు ల‌భించింది. యాభై క‌విత‌లున్న ఈ సంపుటిలో క‌వి త‌న ఆత్మీయ‌త‌ను ఉద‌య‌మే అమ్మ చేసే రొట్టెతో, ఇంటిముంద‌టి వాకిలితో, చ‌చ్చిపోతున్న ఉత్త‌రంతో పంచుకున్నాడు. సామాన్యుల ఆర్తిని ఇలాంటి స‌హ‌జ‌మైన వ‌స్తువుల‌ను ప్ర‌తీక‌లుగా చేసి వ్య‌క్త‌ప‌రిచాడు కాబ‌ట్టే కాలాన్ని నిద్ర‌పోనివ్వ‌ను ఇర‌వై భాష‌ల్లోకి అనువాద‌మైంది.

రొట్టు ఆకాశం నుంచి ఊడిప‌డ‌దు
భూగ‌ర్భ‌సారంలోంచి
చెమ‌ట బిందువులు మోసుకొచ్చిన ఆక‌లి స్వ‌ప్నం రొట్టే! అంటూ రొట్టె పుట్టుక వెనుక చెమ‌ట‌బిందువులున్నాయ‌ని శ్ర‌మ‌విలువ‌ను గుర్తుచేశాడు. సూర్యుడు చీక‌టిని తొల‌గించేవాడైతే , అమ్మ‌చేతిలోని రొట్టె ఆక‌లిని తొల‌గించేదిగా చెప్తూ రొట్టెను సూర్యుడితో పోల్చాడు. ఇలా గోపి రొట్టెతో త‌న‌కున్న జ్ఞాప‌కాల‌ను, అమ్మ పంచిన మ‌మ‌కారాన్ని, త‌న‌ పేద‌రికాన్ని ఏక‌కాలంలో వ్య‌క్తం చేశాడు.

ఉత్త‌రాల‌తో ఉన్న అటాచ్మెంట్ ను, ఎమోష‌న్ ను చిత్రీక‌రిస్తూ…. ఉత్త‌రాలు విష‌య‌మున్న తాళ‌ప‌త్రాల‌నీ, విలువైన కోహినూర్ వ‌జ్రాల‌నీ అన్నాడు. టెక్నాల‌జీ కార‌ణంగా క‌నుమ‌రుగ‌వుతున్న ఉత్త‌రాలు కేవ‌లం స‌మాచార మార్పిడే కాకుండా ఒక ఎమోష‌న్ ను క్యారీ చేసేవ‌ని చెబుతూనే…. ఎక‌రాల్లో చ‌ల్లిన‌ట్టుకాదు / ఉన్న జాగాలోనే అక్ష‌రాలు జొన్న‌విత్తుల‌య్యేవి అంటూ ఉత్త‌రం రాయ‌డాన్ని కూడా ఒక క‌ళ‌గా అభివ‌ర్ణించాడు గోపి!
క‌మ్యూనికేష‌న్ల హోరుకు పావురాలు ఎగిరిపోతున్నాయి ప‌ట్టుకొని ఆపండి / హ‌లో అనే ఒక్క బాణంతో ర‌సార్థ్ర జీవ విన్యాస సంపుటాన్ని చంప‌కండి. ఈ క‌విత‌ను ఆత్మీయ కోణంలో చూస్తే ఇక్క‌డ పావురాలు అంటే స‌మాచారాలు. స‌మాచారాలు ఎక్కువైతే భావాలు త‌గ్గిపోతాయ‌ని అర్థం. అదే సామాజిక కోణంలో ఆలోచిస్తే క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ కార‌ణంగా పావురాలు చ‌చ్చిపోతున్నాయని అర్థం.

క‌వి వాకిలితో త‌న‌కున్న అత్మీయ‌త‌ను వ్య‌క్త‌ప‌రుస్తూ…. పొక్కిలి పొక్కిలైన మా వాకిలి / మ‌న‌స్సులా ఉంది అన్నాడు. వాకిలి లాగా మ‌న‌స్సు కూడా బాధ‌తో పొక్కిలిగా మారింద‌ని క‌వి అభిప్రాయం. దానికి కార‌ణం క‌వి అమితంగా ప్రేమించే కూతురి మ‌ర‌ణం. బొంత‌ను క‌వితావ‌స్తువుగా స్వీక‌రించ‌డ‌మే కాకుండా దానితో త‌నకున్న‌ ఆత్మీయ‌త‌ను గుర్తుచేసుకున్నాడు క‌వి. అమ్మ ఏర్ప‌రిచిన స‌మ‌న్వ‌య వ్య‌వ‌స్థ ఈ బొంత అంటూ బొంత‌ను అభ్యుద‌య వ‌స్తువుగా చూపుతూ…….
ఈ బొంత‌మీద ప‌డుకున్న‌ప్పుడ‌ల్లా
అమ్మా అమ్మమ్మా అక్కా అంద‌రి వొడిలో
ఏక‌కాలంలో సేద‌తీరిన‌ట్టుంటుంది. అంటాడు. బొంత త‌యారీలో అమ్మ‌మ్మ‌, అమ్మ‌, అక్క‌ల పాత చీర‌లనుప‌యోగించారు కాబ‌ట్టి. బొంత మీద ప‌డుకున్న‌ప్పుడు ప‌రోక్షంగా వారంద‌రి ఒడిలో సేద‌తీరుతున్నాన‌ని క‌వి ఉద్దేశం.

Ads

‘విశ్వాస ప్ర‌స‌ర‌ణ’ అనే క‌వితలో గోపి మాన‌వ అనుబంధాలను త‌న‌దైన శిల్పంలో వ్య‌క్తీక‌రించాడు. చెట్ల‌ను కుటుంబాల‌కు, ప‌క్షుల‌ను పిల్ల‌ల‌కు ప్ర‌తీక‌లుగా చూపి ఈ రెండిటిని అనుబంధంతో ముడిపెట్టాడు. అనుబంధాల‌ను, ఆప్యాయ‌త‌ల‌ను మ‌రిచిన మ‌నిషి దేనికోస‌మో పాకులాడుతున్న తీరును చూసి…. ఇవాళ స‌ముద్ర గ‌ర్భంలో / దేని కోసం వెతుకుతున్నారు అని ప్ర‌శ్నిస్తాడు. మ‌నం అనుభ‌వించే బాధ‌లు, ఉద్వేగాలు మ‌న చుట్టూ ఎగిరే ప‌క్షుల్లాంటివి, వాటిని దూరంగా అదిలించ‌వ‌చ్చు. అంతేగాని మ‌న జుట్టులో వాటికి గూడు ఏర్పాటు చేయ‌వ‌ద్దనే విష‌యాన్ని విశ్వాస ప్ర‌స‌ర‌ణ అనే క‌విత‌లో తెలియ‌జేశాడు.

త‌న క‌విత్వానికి మనిషే కేంద్ర‌బిందువు అనే గోపి త‌న‌ను మాన‌వీయక‌విగా పేర్కొంటే సంతోషిస్తానంటాడు. అందుకే మ‌నుషుల‌కు ఆత్మీయ‌త‌కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తూ……

మ‌నిషి ప‌రిమ‌ళించ‌డ‌మే జీవితం
కాల‌ప‌త్రం మీద‌
కాలాతీత సిరాతో రాసిన‌ప్పుడు
ఏర్ప‌డిన చిత్రం పేరు మ‌నిషి అని మ‌నిషికి త‌న‌దైన నిర్వ‌చ‌నాన్నిచ్చాడు.

మ‌నుషుల మ‌ధ్య ఉండాల్సిన ప్రేమ‌, అప్యాయ‌త‌ల స్థానంలో ఈర్ష్య‌, ద్వేషాలు వ‌చ్చి మాన‌వ సంబంధాల‌ను దెబ్బ‌తీస్తున్న క్ర‌మంలో …… మ‌నుషుల్ని క‌ట్టివుంచే దారం కోసం / ఏ పత్తి పువ్వుల్ని అర్థించ‌ను అంటూ బాధ‌ప‌డ‌తాడు. డెస్క్ ఉద్యోగాల‌కు అల‌వాటు ప‌డి వాస్త‌విక జీవితానికి దూరంగా బ‌తుకీడుస్తున్న న‌వ‌త‌రాన్ని క‌వి క్రోట‌న్స్ తో పోల్చాడు. క్రోట‌న్స్ ఇంటిలోప‌ల పెరిగే మొక్క‌లు. ఇవి వాన‌ను, ఎండ‌ను త‌ట్టుకోలేవు. అలాగే కేవ‌లం నాలుగ్గోడ‌ల‌కు ప‌రిమితమౌతూ ఇత‌రుల‌కు దూరంగా ఉంటున్న వారు కూడా ఏ చిన్న క‌ష్టం వ‌చ్చినా త‌ట్టుకోలేరనేది క‌వి ఉద్దేశం. ప‌క్క‌ప‌క్క‌నే ఉండి ప‌ల‌క‌రించుకోని సిటీ ప్ర‌జ‌ల బిజీలైఫ్ నుద్దేశిస్తూ…. న‌గ‌రంలో ఎవ‌రిని ప్రేమిద్దామ‌న్నా/ వారు వారినే ప్రేమించ‌డంలో నిగ్న‌మై ఉంటార‌న్నాడు. మాన‌వ‌త్వం ఉన్న‌వాడే నిజ‌మైన మ‌నిషి అలాంటి వ్య‌క్తి కోసం వెతుకుతూ అత‌ని చిరునామా తెలిస్తే త‌ప్ప/ న‌న్ను నేను చేరుకున్న‌ట్టు కాదు అంటూ మాన‌వ‌త్వం గ‌ల మ‌నిషి కోసం త‌న అన్వేష‌ణ‌ను కొన‌సాగిస్తూనే ఉన్నాడు.

Previous articleబిగ్ బాస్ హౌస్ గడప వరకు వచ్చి…చివరి నిమిషంలో ఎంట్రీ ఇవ్వకుండా వెనక్కి తిరిగిన 6 సెలబ్రిటీస్ వీళ్లే!
Next articleపెళ్లి అయ్యాక కూతురి విషయంలో ఏ తల్లీ ఈ 5 తప్పులు చెయ్యకూడదు…అవేంటంటే.?
Sravan - Movies, offbeat, Sports & Health News Correspondent with 5 years of experience in Journalism