Ads
కొన్ని సినిమాలు అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కొన్ని సినిమాలు మాత్రం ఎన్ని సంవత్సరాలు అయినా ప్రేక్షకులకి గుర్తు ఉంటాయి. అలాంటి సినిమాల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమా కూడా ఒకటి.
సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలకి చాలా మంది అభిమానులు ఉంటారు. ఆయన సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చాలా బాగా రాసుకుంటారు. అంతే కాకుండా సినిమా కథ కూడా చాలా వరకు నిజజీవితంలో జరిగే సంఘటనలకి దగ్గరగా ఉంటుంది. శేఖర్ కమ్ముల మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. కానీ థియేటర్లలో విడుదల అయిన మొదటి సినిమా అయితే ఆనంద్.
ఈ సినిమాలో రాజా, కమలిని ముఖర్జీ నటించారు. హీరోయిన్ కమలిని ముఖర్జీకి తెలుగులో ఇది మొదటి సినిమా. అయినా కూడా మొదటి సినిమా అనే విషయం మర్చిపోయేలాగా, ఎంతో అనుభవం ఉన్న నటిలాగా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో రూప పాత్రలో నటించారు కమలిని ముఖర్జీ. రూప పాత్రకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఎవరి మీద ఆధారపడి బతకాలి అనుకోదు. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు చనిపోయినా కూడా, తన కాళ్ళ మీద తను నిలబడి, ఉద్యోగం చేస్తూ, సొంత సంపాదనతోనే బతుకుతుంది రూప.
అయితే రూప ఈ సినిమాలో రాహుల్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. రాహుల్ తన ఆఫీస్ లోనే పని చేస్తాడు. అతనితో పెళ్లి అయ్యాక ఉద్యోగం మానేయాలి అని, ఇంకా కొన్ని నియమాలని రాహుల్ ఇంట్లో వాళ్ళు పెడతారు. అయినా కూడా ప్రేమ కోసం వాటన్నిటినీ రూప అంగీకరిస్తుంది. ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. పెళ్లి సమయంలో జరిగిన ఒక్క సంఘటన వల్ల రూప తన పెళ్లిని రద్దు చేసుకుంటుంది. దానికి కారణం కూడా చెబుతూ వీళ్ళ కోసం తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకోలేను అని రూప అంటుంది.
Ads
అంతే కాకుండా రాహుల్ వాళ్ళ అమ్మ కూడా రూపతో ప్రవర్తించిన విధానం బాలేదు అని అంటుంది. అయితే, ఇందాక చెప్పినట్టుగా శేఖర్ కమ్ముల సినిమాలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. చాలా మంది ఆడపిల్లలు ఎదుర్కొనే సమస్య ఇది. ఒక టైంలో తనని అబ్బాయి వాళ్ళు బాగా చూసుకోలేరు అని తెలుస్తుంది. కానీ ఆ అమ్మాయి కాంప్రమైజ్ అయిపోతుంది. అందుకు కారణం తన తల్లిదండ్రులు బాధపడతారు అని.
చాలా మంది అమ్మాయిలకి విడిపోదాం అని ఉన్నా కూడా, మళ్లీ తన కుటుంబానికి తన వల్ల చెడ్డ పేరు వస్తుంది అనే కారణంగా ఈ ఆలోచనను విరమించుకుంటారు. పెళ్లికి సరిగ్గా ముందు ఇలాంటి గొడవలు చాలా పెళ్లిళ్లలో జరిగాయి. అక్కడ అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ కోపం రావడం. పెళ్లి ఆపేద్దాం అనుకోవడం వంటివి అవుతూ ఉంటాయి. కానీ వాళ్లు అలా చేయలేరు. అందుకు కారణం పెళ్లి కోసం పెట్టిన ఖర్చు. పరువు పోతుంది అనే ఒక ఆలోచన. చాలా ఉంటాయి.
అయితే రూప ఈ సినిమాలో అవన్నీ ఆలోచించకుండా సరైన నిర్ణయం తీసుకుంది. అందుకే రూప పాత్ర చాలా మందికి నచ్చుతుంది. కానీ ఒకవేళ రూపకి తల్లిదండ్రులు ఉంటే, అప్పుడు ఇలాంటి పరిస్థితి జరిగి ఉంటే, అప్పుడు కూడా రూప ఇలాగే గట్టిగా నిర్ణయం తీసుకునేదా? లేకపోతే తన తల్లిదండ్రుల మొహం చూసి కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకునేదా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి?