Ads
మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు పోదాం, పోదాం పైపైకి. ఎముకులు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా. చావండి. నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా. రారండి. ఇది చెప్పిన వ్యక్తి శ్రీ శ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు. మహాకవి అనే బిరుదు పొందిన మహానుభావులు. శ్రీరంగం శ్రీనివాసరావు గారిని శ్రీ శ్రీ అని అంటారు. అదే పేరుతో ఆయన గుర్తింపు పొందారు.
ఏప్రిల్ 30వ తేదీ, 1910 లో ఆంధ్రప్రదేశ్ లోని, విశాఖపట్నంలో శ్రీ శ్రీ జన్మించారు. శ్రీ శ్రీ తల్లిదండ్రులు పూడిపెద్ది వెంకట్రమణయ్య మరియు ఆటప్పకొండ. ఆ తర్వాత శ్రీ శ్రీని శ్రీరంగం సూర్యనారాయణ గారు దత్తత తీసుకున్నారు. విశాఖపట్నంలో ప్రైమరీ విద్యాభ్యాసం చేసిన తర్వాత 1931 లో మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లో బిఎ ఆనర్స్‌లో పట్టా పొందారు. 1935 లో విశాఖపట్నంలోని ఎస్ వి ఎస్ కాలేజ్ లో డెమోన్స్ట్రేటర్ గా కెరీర్ మొదలుపెట్టి, 1938లో ఆంధ్రప్రభ దినపత్రికలో సబ్ ఎడిటర్ అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ ఆకాశవాణిలో, హైదరాబాద్ లో, ఆంధ్ర వాణి అనే ఒక డైలీ పత్రికలో కూడా పనిచేశారు.
Ads
శ్రీశ్రీ కి సరోజినీ గారితో పెళ్లి జరిగింది. వారికి మాల శ్రీనివాసరావు, మంజుల శ్రీనివాసరావు, మంగళ శ్రీనివాసరావు అనే కూతుళ్ళతో పాటు, వెంకట్ శ్రీనివాసరావు అనే కొడుకు కూడా ఉన్నారు. శ్రీ శ్రీ ఎంత పెద్ద సాహితీవేత్త అనే విషయం అందరికీ తెలిసిందే. శ్రీశ్రీ నాస్తికులు. అలాంటి శ్రీశ్రీ కేవలం ఒక్క సెంటిమెంట్ మాత్రం ఫాలో అయ్యేవారట.
ఈ విషయం గురించి శ్రీశ్రీ కూతురు ఒక సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీశ్రీ చిన్న కూతురు పేరు నిడుమోలు మాల. నిడుమోలు మాల చెన్నై హైకోర్టు న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. ఒక సమయంలో ఒక పేపర్ ఇంటర్వ్యూలో మాల మాట్లాడుతూ శ్రీశ్రీ పాటించే ఒకే ఒక్క సెంటిమెంట్ గురించి చెప్పారు. శ్రీశ్రీ బయటికి వెళ్లేటప్పుడు మాలని పిలిచి, “అమ్మా ఇవాళ నాకు డబ్బులు బాగా వస్తాయా?” అని అడిగితే, అప్పుడు మాల, “వస్తాయి” అన్నప్పుడు డబ్బులు బాగా వచ్చేవట. “నీకు ఈరోజు డబ్బులు రావు” అన్న రోజు డబ్బులు సరిగ్గా వచ్చేవి కావట. ఈ విషయాన్ని మాల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.