Ads
అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి చాలామంది వినే ఉంటారు. ప్రస్తుతం అగ్గిపెట్టలో పట్టే చీర అంటే అందరికీ గుర్తొచ్చేది సిరిసిల్ల నేత కార్మికులే అని చెప్పవచ్చు.
ఈ చీరలను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లకు చెందిన విజయ్ చేనేత మగ్గం పై నేస్తున్నారు. అతను మాత్రమే కాకుండా గతంలో విజయ్ తండ్రి అగ్గిపెట్టలో పట్టే చీరలను నేసి, సిరిసిల్ల కీర్తిని దేశవ్యాప్తంగా చాటారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన నల్ల పరంధాములు 1990లో అగిపెట్టెలో ఇమిడిపోయే 5 గజాల చీరలను నేత మగ్గం పై నేసి, గిన్నిస్‌బుక్‌లో చోటును సంపాదించారు. ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పరంధాములు మగ్గం పై వస్త్రాల తయారీలో ఎన్నో ప్రయోగాలు చేసి, సక్సెస్ అయ్యి, ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన కుమారుడు నల్ల విజయ్ కుమార్ తండ్రి వారసత్వాన్ని, వృత్తిని కొనసాగిస్తూ పలు రకాల చీరలను మగ్గం పై తయారు చేసి, ప్రశంసలు, పలు అవార్డ్స్ అందుకున్నారు.
విజయ్ తన తండ్రి లాగే అగ్గిపెట్టలో పట్టే చీరలు నేసి, సిరిసిల్ల ఖ్యాతిని చాటుతున్నారు. ఆయన మాట్లాడుతూ, తాను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నానని తెలిపారు. దాదాపు 20 ఏళ్లుగా చేనేత వృత్తిలో కొనసాగుతున్నానని చెప్పారు. ఇప్పటివరకు సుమారు 200 రకాల చీరలను చేనేత మగ్గం మీదనే నేసానని, వివిధ రకాల చీరల కోసం ఆర్డర్స్ వస్తాయని తెలిపారు. అగ్గిపెట్టలో పట్టే చీర నేసేందుకు పదిహేను రోజులు పట్టిందని, పన్నెండు వేల వరకు ఖర్చు అయినట్టు చెప్పారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ కి అగ్గిపెట్టలో పట్టే చీరను బహుకరించగా, సీఎం కేసీఆర్ అభినందించారని తెలిపారు. అగ్గిపెట్టెలో పట్టేంత చీరను చూసి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అభినందించారని అన్నారు. ప్రతి ఏడాది తన తండ్రి లాగానే తిరుపతి అలివేలు మంగమ్మకు, వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గమ్మకు మగ్గం పై స్వయంగా తయారు చేసిన, అగ్గిపెట్టెలో పట్టే చీర మరియు వస్త్రాలను సమర్పిస్తానని చెప్పాడు.
అగ్గిపెట్టెలో పట్టే చీరను మగ్గం పై నేయడం తన ప్రత్యేకత అని విజయ్ తెలిపారు. తనకు చేనేత కళా రత్న అనే అవార్డు వచ్చినట్టు తెలిపాడు. ఈ చీరను కట్టుకున్న స్త్రీలు చాలా బాగుందని చెబుతున్నారని అన్నారు. ఇక్కడి మహిళలే కాకుండా అగ్గిపెట్టలో పట్టే చీరను కట్టుకోవడానికి విదేశీ మహిళలు సైతం ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు.
Ads
Also Read: Apple: ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ ని ఎందుకు రిలీజ్ చేస్తుంది ఆపిల్ కంపెనీ.? కారణం ఇదా.?