Ads
కొన్ని విషయాలు మనం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. కొన్ని విషయాలు మనం ఆలోచించకుండానే మన చుట్టూ ఉన్నవాళ్లు మన కోసం ఆలోచించి చేస్తారు. ఒకవేళ అవి మనకి సరైన నిర్ణయాలు కాకపోతే తర్వాత గొడవలు అవుతాయి. నా విషయంలో కూడా అలాగే జరిగింది. నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మా అమ్మ వాళ్ళు నన్ను ఎవరో అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. తెలిసి తెలియని వయసులో, అసలు ఆ వ్యక్తి గురించి కూడా తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నాను. సమయం గడుస్తున్న కొద్ది, అతనికి, నాకు పడదు అని అర్థం అయ్యింది. కానీ అంతలోపే నాకు ముగ్గురు పిల్లలు పుట్టారు.
ఏమీ చేయలేని పరిస్థితి నాది. నాకు, నా భర్తకి ప్రతిరోజు గొడవ అయ్యేది. తాగి వచ్చేవాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవాడు. నా తల్లిదండ్రులకి కూడా ఈ విషయాలన్నీ చెప్పుకోలేని పరిస్థితి నాది. ఒకసారి నా భర్తకి వేరే అమ్మాయి అంటే ఇష్టం ఉంది అనే విషయం అర్థం అయ్యింది. ఇదే విషయం మీద నేను ఆయనని నిలదీశాను. నేనంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు. నాకు ఏం అనాలో అర్థం కాలేదు. ఈ విషయం మీద కొన్ని రోజులు గొడవ జరిగింది. ఆ తర్వాత ఒకరోజు ఇంటికి రాలేదు. ఏమయిందని భయపడ్డాను.
Ads
కానీ తర్వాత ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టు తెలిసింది. ఆ తర్వాత ఫోన్ చేసి, “మనిద్దరం విడివిడిగా ఉండటమే ఇద్దరికీ మంచిది. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది” అని చెప్పారు. ఆయనతో నాకు కూడా ఏమీ కలిసుండాలని లేదు. కాబట్టి నేను కూడా వెనక్కి రమ్మని అడగలేదు. కానీ నా పిల్లల బాగోగుల కోసం మాత్రం డబ్బులు పంపేవారు. అలా కాలం గడిచింది. నేను తిరిగి మా అమ్మానాన్నల దగ్గరికి కూడా వెళ్లలేదు. నేను పెద్దగా చదువుకోలేదు. కానీ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న నా చదువుకి ఏదైనా ఉద్యోగం వస్తుంది ఏమో అని చూశాను.
ఒక స్కూల్ లో ప్రైమరీ స్కూల్ టీచర్ లాగా చేరాను. నా పిల్లలని కూడా అదే స్కూల్ లో చేర్చాను. ఇంటి ఖర్చులు అవన్నీ కూడా నేనే చూసుకునే దాన్ని. అంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. నాకు ఇప్పుడు నా జీవితంలో ఎవరైనా తోడు కావాలి అనిపిస్తుంది. నా వయసు 42 సంవత్సరాలు. ఈ వయసులో ప్రేమించడం అనేది అవుతుందా? లేదా? అనేది నాకు తెలియదు. కానీ నాకు ఎవరైనా తోడు ఉంటే బాగుండు అనిపిస్తుంది. నా భర్త నా పిల్లలకి అవసరాలకు డబ్బులు పంపించినా కూడా, ఏనాడు ప్రేమగా మాట్లాడలేదు. అలా నా పిల్లలకి కూడా తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియజేసే వ్యక్తి కావాలి అని అనిపించింది.
ఈ విషయాన్ని భయపడుతూనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను. వాళ్లంతా నన్ను తిట్టడం మొదలుపెట్టారు. 42 ఏళ్ల వయసులో అవసరమా అన్నారు. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు. ఇంత వయసు వచ్చాక కూడా నాకు ఏం కావాలి? ఏం వద్దు? అని స్పష్టత నాకు ఉండదా? నా నిర్ణయం నాకు తీసుకునే అంత స్వేచ్ఛ కూడా లేదా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వాళ్ల మీద ఆధారపడకుండా అన్ని నేను చేసుకుంటూ కూడా ఇన్ని మాటలు పడితే బాధగా అనిపించింది. అసలు తెలిసి తెలియక వీళ్ళు చేసిన పని వల్లే ఇలా జరిగింది. అలాంటిది వీళ్ళ మాటలు ఎందుకు వినాలి అని అనిపించింది.