Ads
ప్రపంచం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చంద్రమండలాన్ని అందుకుంది. ఇంకా ఎన్నో విధాలుగా ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. ఈ విజయంలో మగవాళ్ళ పాత్ర ఎంత ఉందో ఆడవాళ్ళ పాత్ర కూడా అంతే ఉంది. ఇంత అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ఇంకా చాలామందికి లింగ వివక్ష పోలేదు. ఆడవాళ్ళంటే చులకన భావం పోలేదు. అలాంటి ఒక చులకన భావంతోనే ఒక భర్త ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని కోపంతో భార్యని వదిలేసి వెళ్ళిపోయాడుఒక భర్త.
అయితే ఆ ముగ్గురు పిల్లలని ముగ్గురు సరస్వతులుగా మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది ఆ తల్లి. ఆ కధేమిటో ఇప్పుడు చూద్దాం.సాక్షి కథనం ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లోని శృంగవరపు కోట పట్టణంలో శ్రీనివాస కాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్లకి సరస్వతి, రేవతి, పావని అని పేర్లు పెట్టుకుంది.
అయితే ముగ్గురు ఆడపిల్లల్ని కన్న తండ్రి వీళ్ళని వదిలి వెళ్ళిపోయాడు. తల్లి బంగారం మాత్రం వీళ్ళని కంటికి రెప్పలాగా సాకింది. భవన నిర్మాణ పనులు చేస్తూ వచ్చిన కూలీ డబ్బులతో చదువులు చెప్పించింది. ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ వరకు చదివిన రెండవ కుమార్తె రేవతిని ఆర్థిక ఇబ్బందులతో ఒక దశలో చదువు మాన్పించాలి అనుకుంది. టెన్త్ లో అత్యంత ప్రతిభ చూపిన రేవతికే స్థానిక పుణ్యగిరి విద్యాసంస్థల అధినేత ఎల్ సత్యనారాయణ తన కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్ లో ప్రవేశం కల్పించారు.
Ads
ఇంటర్ లో ఎక్కువ మార్కులు వస్తే నచ్చిన చదువు చదివిస్తానంటూ రేవతికి భరోసా ఇచ్చారు. అయితే ఇంటర్లో 984 మార్కులు సాధించిన రేవతి ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించి గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేసిన సచివాలయ ఉద్యోగాల్లో ధర్మవరం సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పోస్ట్ సాధించింది. అంతటితో వదిలేయకుండా ఏపీపీఎస్సీ పరీక్షలను కూడా అటెంప్ట్ చేసింది.
2023 ఆగస్టులో పరీక్ష రాసింది, అందులో విజయం సాధించి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఫిబ్రవరి 6వ తేదీన ఉత్తర్వులు అందుకుంది. ఇంకా ఆనందించదగ్గ విషయం ఏమిటంటే ఈమె చెల్లెలు పిహెచ్డి చదువుతూ ఉండగా అక్క ఏలూరు సచివాలయం ఉద్యోగిగా పనిచేస్తుంది. పిల్లల అభివృద్ధిని చూసిన ఆ తల్లి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ఇది ఒక తల్లి విజయం.