Ads
థాయిలాండ్ కు వెళ్లాలనుకునే భారతీయులకి ఆ దేశ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వివిధ దేశాల పర్యాటకులను వారి దేశానికి వచ్చేలా ఆకర్షించడం కోసం థాయిలాండ్ రక రకాల ప్రోగ్రామ్స్ ని చేపడుతోంది.
ఇప్పటికే చైనా దేశస్థులకు థాయిలాండ్‌లో పర్యటించడానికి వీసా అవసరం లేదని గతనెలలో ప్రకటించిన థాయ్ గవర్నమెంట్ తాజాగా భారత్, తైవాన్ నుండి థాయిలాండ్ కు వీసా లేకుండానే రావచ్చని ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
విదేశీ పర్యాటకులను మరింతగా పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో థాయిలాండ్ ప్రభుత్వం గత నెలలో చైనా నుండి వచ్చేవారికి వీసాలు అవసరం లేదని ప్రకటించింది. తాజాగా భారత్, తైవాన్ నుండి వచ్చేవారు వీసా లేకుండానే థాయిలాండ్ కు రావచ్చని ప్రకటించింది. నవంబర్ 10 నుంచి థాయిలాండ్ వెళ్ళే భారతీయులకు వీసాలు అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ అవకాశం 2024 మే 10 వరకు కొనసాగుతుందంటూ ప్రకటన రిలీజ్ చేసింది. అంటే ఆరునెలల పాటు ఎలాంటి వీసా లేకుండా థాయిలాండ్‌లో పర్యటించవచ్చు. థాయిలాండ్ ముఖ్యమైన పర్యాటక వనరులలో ఇండియా కూడా ఒకటి. ప్రతి ఏడాది భారతీయులు థాయిలాండ్ లో పర్యటించడానికి భారీగా వెళ్తున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. థాయిలాండ్‌కు ఒకసారి వచ్చిన ఇండియన్స్ 30 రోజుల పాటు తమ దేశంలో పర్యటించవచ్చని వెల్లడించింది.
భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలతో పాటుగా తమ పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహించాడానికి ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేసింది. కరోనా అనంతరం థాయ్‌లాండ్ లో పర్యటించిన టూరిస్టులలో భారత్ నాలుగవ ప్లేస్ లో నిలిచింది. మొదటి మూడు స్థానాలలో మలేసియా, చైనా, సౌత్ కొరియా ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు పన్నెండు లక్షల మంది భారత పర్యాటకులు థాయ్‌లాండ్‌లో పర్యటించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలు విమానయాన సంస్థలు సైతం భారత్ నుండి థాయిలాండ్ కు వెళ్లే పర్యాటకుల కోసం వివిధ ఆఫర్స్ ను కూడా ప్రకటిస్తున్నాయి.
Ads
Also Read: వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ గెలిచిన తర్వాత భారత్ “డ్రెస్సింగ్ రూమ్”లో ఏం జరుగుతుందో తెలుసా..?