ఏపీలో ఆ ఛానళ్లకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన!

Ads

 

ఏపీలో ఈ నెల 6 నుంచి నిలిచిపోయిన టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్టీవీ న్యూస్ ఛానెల్‌ల ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది. ఈ మేరకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆ ప్రకటన ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్‌లో వార్తా ఛానళ్ల ప్రసారాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిలిపివేతను న్యాయస్థానం ఖండించింది. తద్వారా న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య సమాజానికి మూలస్తంభాలైన వాక్ స్వాతంత్రం, భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక సూత్రాలను బలోపేతం చేస్తుందని ఫెడరేషన్ సభ్యులు ప్రకటించారు.

జూన్ 6 నుంచి టీవీ9 తెలుగు, సాక్షి టీవీ,  ఎన్టీవీ సహా పలు న్యూస్ ఛానెల్‌ల ప్రసారాలు ఆంధ్రప్రేదేశ్‌లో బ్లాక్‌ఔట్ కావడం పత్రికా స్వేచ్ఛపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించిందని, రాష్ట్రంలో రాజకీయ నాయకత్వంలో మార్పు కారణంగా ఈ వార్తాఛానళ్లను బ్లాక్ఔట్ చేయాలని కేబుల్ ఆపరేటర్లందరిపై ఒత్తిడి తీసుకురావడం తగదన్నారు. టెలివిజన్ వినియోగదారుల పరంగా ఏపీ అతిపెద్ద మార్కెట్. ఇక్కడ సెట్ టాప్ బాక్స్ ద్వారా దాదాపు 65 లక్షల మంది వార్తలను వీక్షిస్తారని అంచనా. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వార్తాఛానెల్‌లు కనీసం 62 లక్షల బాక్స్‌ల నుంచి తప్పించి, ప్రేక్షకులకు సమాచార హక్కును నిరాకరించే ప్రయత్నం జరగడం దురదృష్టకరమన్నారు.

Ads

ట్రాయ్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం. ఛానెల్స్‌ను డిస్‌కనెక్ట్ చేయడం చట్టవిరుద్ధమని, పంపిణీ సంస్థలతో కుదుర్చుకున్న ఇంటర్ కనెక్షన్ ఒప్పందానికి విరుద్ధంగా ఉందని ఢిల్లీ హైకోర్టులో టీవీ9 పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో హైకోర్టు జోక్యం ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఏపీ ప్రజలు తమకు ఆసక్తి ఉన్న వార్తా చానెళ్లను వీక్షించే హక్కును కొనసాగుతుందని నిర్ధారిస్తూ అనధికారికంగా నిలిపివేయబడ్డ వార్తా చానెళ్లను పునరుద్దరించాలని ఈ ఉత్తర్వుల ద్వారా ఆదేశించింది.

న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ఈ నిర్ణయానికి మద్దతునిస్తూ, కోర్టు ఆదేశాలను తక్షణమే పాటించాలని సంబంధిత అధికారులందరికీ విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను , జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడానికి ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని మేం నమ్ముతున్నామని తెలిపింది. రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో, స్వేచ్ఛ, స్వతంత్ర మీడియాను ప్రోత్సహించడంలో ఢిల్లీ హైకోర్టు నిబద్ధతను అభినందిస్తున్నాం. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి ఒక విజయం, మన ప్రాథమిక స్వేచ్ఛలను పరిరక్షించడంలో న్యాయ వ్యవస్థ పోషించే కీలకపాత్రను గుర్తుచేస్తుంది. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ జర్నలిస్టుల హక్కులు, సమాచార స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు అవసరమైన న్యాయ పోరాటం చేస్తూనే ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి బ్లాక్ ఔట్‌లను నివారించడానికి , మీడియా ఛానెల్‌లు అనవసరమైన జోక్యం లేకుండా పనిచేసేలా చూసుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, నియంత్రణ సంస్థలను కోరుతున్నామని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ పేర్కొంది.

Previous articleఈ స్టార్ హీరో కొడుకు సినిమా మీద ఇన్ని వివాదాలు ఎందుకు వస్తున్నాయి..? అసలు ఏం ఉంది ఇందులో..?
Next articleహీరోయిన్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది… కానీ అంతలోపు..? ఈ సినిమా చూశారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.