Ads
ప్రస్తుత రోజుల్లో గ్యాస్ సిలిండర్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం రెండు గ్యాస్ సిలిండర్లు తప్పనిసరిగా ఉంటున్నాయి. నెలకి కనీసం ఒక గ్యాస్ సిలిండర్ ఉపయోగించేవారు కూడా చాలామంది ఉన్నారు.
పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలు అనే తేడాలేకుండా అందరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ కనెక్షన్స్ ఉంటున్నాయి. దాంతో ప్రభుత్వాలు ఈ గ్యాస్ సిలండర్ లపై సబ్సిడీ లాంటివి కూడా ఇస్తున్నాయి. అయితే ఇదే అదనుగా భావించిన పార్టీల అభ్యర్థులు తెలంగాణలో మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో గ్యాస్ సిలండర్లపై పలు ఆఫర్స్ ఇస్తున్నారు.
ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు అంటూ బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీలతో పాటు పలు చిన్నా చితకా పార్టీలు కూడా ఎన్నికల బరిలో నువ్వా నేనా అన్నట్లుగా వెళుతున్నాయి. ఒక పార్టీ మించి మరొక పార్టీలు ప్రజలకు బంపర్ ఆఫర్లను ఇస్తున్నాయి. అలాగే ఎన్నికల్లో గెలవడం కోసం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారిని ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నారు.
Ads
ఇందులో భాగంగానే కేవలం 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగా, 400కే ఇస్తామంటూ బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేసింది. కానీ నేను మాత్రం ఒక్క రూపాయికే నాలుగు గ్యాస్ సిలండర్లు ఇస్తా అంటూ సంచలన ప్రకటన చేశాడు సనత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న కుమ్మరి వెంకటేష్ యాదవ్.
ఆయన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీకి దిగారు. అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే కేవలం ఒక్క రూపాయికే ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తాము అంటూ భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అలాగే రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలు ఇస్తాను అంటూ హామీలు ఇస్తున్నారు. అలాగే ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాము.
70 ఏళ్లు దాటిన వారు ఎమర్జెన్సీ పానిక్ బటన్ నొక్కగానే వాలంటీర్లు వచ్చి సాయం అందించేలా ఏర్పాట్లు చేస్తాము అంటూ వెంకటేష్ యాదవ్ తన ప్రచారంలో చెబుతూ ప్రజలకు ఒకదాని నుంచి మరొకటి బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. ఇలా ఒకరిని మించి ఒక పార్టీ ఆఫర్లను ప్రకటిస్తుండడంతో తెలంగాణ రాజకీయాలు ఊహించిన విధంగా వేడెక్కాయి.