Ads
కోలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ హీరో, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ కన్నుమూశారు. 71 ఏళ్ళ వయసులో ఉన్న కెప్టెన్, గత కొద్ది రోజుల నుండి అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరిన ఆయన, చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యి, ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆయన మరణించినట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి.
విజయ్‌కాంత్ భార్య ఆయన చికిత్స తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. అప్పటి నుండి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్లీ ఆయన అస్వస్థతకు గురికావడంతో డిసెంబర్ 26న హాస్పటల్ కి తరలించారు. కరోనా బారిన పడినట్టు డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ ఈ ఉదయం విజయ్‌కాంత్ తుదిశ్వాస విడిచారు.
విజయ్‌కాంత్ అసలు పేరు విజయరాజ్ అళగరస్వామి నాయుడు. ఆయన 1952లో మదురైలో ఆగస్టు 25న జన్మించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేశారు. తమిళ సినీ లెజెండ్ లలో ఒకరిగా నిలిచిపోయారు. తన సినీ జీవితంలో తమిళ భాషలో మాత్రమే నటించి, కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో కెప్టెన్ గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. ఇనిక్కుం ఇలామైతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విజయ్‌కాంత్, తన కెరీర్ లో సుమారు 150కి పైగా చిత్రాలలో నటించారు. విజయ్‌కాంత్ నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.
Ads
ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాలలో విజయ్‌కాంత్ ఎంట్రీ ఇచ్చారు. 2005లో సెప్టెంబరు 14న డిఎండికె (దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం) అనే పార్టీని స్థాపించాడు. తెలుగులో ద్రావిడ జాతీయాభివృద్ది సమాఖ్య అని అర్ధం. 2006 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డిఎండికె పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయగా, విజయ్‌కాంత్ పోటీ చేసిన స్థానం మాత్రమే విజయం సాధించింది.
2011 అసెంబ్లీ ఎలెక్షన్స్ లో ఎఐఎడిఎంకె పార్టీతో పొత్తు పెట్టుకుని, 41 స్థానాలలో పోటీ చేశారు. విజయ్‌కాంత్ పోటీ చేసిన 41 స్థానాల్లో 29 గెలుచుకోని డిఎండికె పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా డిఎంకె కన్నా ఎక్కువ స్థానాలను డిఎండికె గెలుచుకుంది. విజయ్‌కాంత్ రెండోసారి ఎమ్మెల్యే పదవిని చేపట్టాడు. ప్రతి పక్షనాయకుడిగా ఉన్నారు. ఆ తరువాత 2016లో జరిగిన ఎలెక్షన్స్ లో అపజయం పొందాడు. ఆ తరువాత అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన కన్నుమూయడంతో తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.