Ads
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ తరహా కథలకి విశేషమైన ఆదరణ లభించడమే అందుకు కారణం. అలా వచ్చిన వెబ్ సిరీస్ నే ‘వ్యూహం’.
అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు నుంచే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్, ఏ స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అయిందనేది చూద్దాం.
మైఖేల్ (కృష్ణ చైతన్య) భార్య జెస్సికా (పావని గంగిరెడ్డి) గర్భవతి. ఆమె హెల్త్ చెకప్ కోసం అతను బైక్ పై వెళ్తాడు. మార్గ మధ్యంలో ఒకదాని తరువాత ఒకటిగా మూడు బైకులు అతనికి హఠాత్తుగా అడ్డం వస్తాయి. ఎందుకు అలా జరుగుతుందా అని అతను ఆలోచన చేస్తూ ఉండగానే, వేగంగా వచ్చిన ఒక కారు వాళ్లను ఢీ కొడుతుంది. దాంతో ఇద్దరూ గాయపడటమే కాకుండా, ఇకపై తల్లి అయ్యే అవకాశాన్ని జెస్సికా కోల్పోతుంది. అర్జున్ రామచంద్ర (సాయి సుశాంత్ రెడ్డి) ఐపీఎస్ పూర్తిచేసి, కొత్తగా డ్యూటీలో జాయిన్ అవుతాడు.
ఐపీఎస్ ఆఫీసర్ గా మంచి పేరు తెచ్చుకున్న వాణి కొడుకు అతను. తన పదేళ్ల వయసులో నక్సలైట్ల తూటాలకు ఆమె తల్లి నేలకొరగడం ప్రత్యక్షంగా చూసినవాడు. తల్లి చెప్పిన మాటలే అతణ్ణి ఐపీఎస్ అయ్యేలా చేస్తాయి. నిజాయితీకి కట్టుబడి ఉండేలా చేస్తాయి. అలాంటి అతని దగ్గరికి మైఖేల్ కేసు వస్తుంది.సీసీటీవీ పుటేజ్ ఆధారంగా, మైఖేల్ చెప్పింది నిజమేనని అతను భావిస్తాడు. బైక్స్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు, కారులో వచ్చి ఢీకొట్టిన వ్యక్తిని గుర్తించిన అర్జున్ రామచంద్ర, ఆ నలుగురి ఆచూకీ తెలుసుకుని వాళ్లను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు.
ఇది కేవలం అనుకోకుండా జరిగిన ‘హిట్ అండ్ రన్’ కేసు కాదు, దీని వెనకాల చాలా విషయాలు ఉన్నాయనే విషయం అతనికి అర్థమవుతుంది. ఇక అదే సమయంలో నిర్మలా దీక్షిత్ అనే జర్నలిస్ట్ దారుణ హ-త్యకి గురవుతుంది. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజల హక్కుల కోసం, అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ పనులను వ్యతిరేకిస్తూ ఆమె పోరాటం చేస్తూ ఉంటుంది. ఇక ఆ సిటీలో తన రౌడీయిజంతో కొన్ని పనులను చేసే రెడ్డెన్న కూతురు నిహారిక (ప్రీతి అస్రాని) కిడ్నాప్ కి గురవుతుంది.
Ads
రాంజీ అనే వ్యక్తి ఈ కిడ్నాప్ కి కారకుడనే విషయం తెలుస్తుంది. ఒక వైపున నక్సలిజం, మరో వైపున టెర్రరిజం అర్జున్ రామచంద్రకి సవాలుగా మారతాయి. అప్పుడు అర్జున్ రామచంద్ర ఏం చేస్తాడు? మైఖేల్ ఫ్యామిలీ ప్రమాదానికి కారణమైన ఆ నలుగురు వ్యక్తులు ఎవరు? ఆ నలుగురు వ్యక్తుల నేపథ్యం ఏమిటి? వాళ్ల వెనక ఎవరున్నారు? అవినీతి అధికారుల వైపు నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నా, అర్జున్ రామచంద్ర ఈ కేసులను ఎలా పరిష్కరించాడు? అనే ఆసక్తికరమైన మలుపులు మనకి ఈ కథలో కనిపిస్తాయి.
దర్శకుడు శశికాంత్ శ్రీవైష్ణవ్ ఈ కథను నక్సలిజం, టెర్రరిజం,రౌడీయిజం,అవినీతి పోలీస్ అధికారుల ఆగడాలను కథలో నాలుగు వైపుల నుంచి నడిపించాడు. ఇక వీటితో పాటు ఒక సైకో ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అన్నపూర్ణ బ్యానర్ నుంచి వచ్చింది గనుక, నిర్మాణ విలువలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన భారీ వెబ్ సిరీస్ ల జాబితాలో ఈ సిరీస్ కి స్థానం దక్కుతుంది. కథా పరంగా చూసుకుంటే ఆసక్తికరమైన మలుపులు ట్విస్టులు ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. 8 ఎనిమిది ఎపిసోడ్స్ కూడా కాస్త ఎక్కువ నిడివితోనే సాగుతాయి.
అలాగే కథలో పాత్రల సంఖ్య కూడా ఎక్కువే. కథ ముందుకు వెళుతున్నా కొద్దీ కొత్త పాత్రలు వస్తూనే ఉంటాయి. దీని వల్ల ముందు జరిగిన ఎపిసోడ్స్ ను గుర్తుపెట్టుకోవడం కొంతమందికి కష్టమవుతుందని చెప్పాలి. కథ కథనాల విషయంలో ప్రేక్షకులకు అసంతృప్తి కలగదు. కానీ కథ నిదానంగా సాగడం,పోలీస్ కథల్లో ఉండవలసిన స్పీడ్ లేకపోవడం, మొదటి మూడు ఎపిసోడ్స్ లో అసలు ఏం జరుగుతుందనే ఒక అయోమయం ఏర్పడటం అసంతృప్తిని కలిగిస్తాయి. ఆ తరువాత నుంచి కథ అర్థమవుతూ ముందుకు వెళుతుంది. ఇది స్క్రీన్ ప్లే లో ఒక భాగమైనా, కొంతమందికి పెద్ద పజిల్ లా అనిపిస్తుంది.
కథలో చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కనిపిస్తారు. అలాగే టెర్రరిజం ట్రాక్ అవసరానికి మించి కనిపిస్తుంది.కొన్ని సీన్స్ ను షార్ప్ గా ట్రిమ్ చేసుకుంటే ఈ సిరీస్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండేదేమో. శ్రీరామ్ మద్దూరి నేపథ్య సంగీతం సన్నివేశాల్లో సందర్భానికి తగినట్టుగా సాగింది. సాయి మురళి ఎడిటింగ్ ఇంకొచెం క్లియర్ గా ఉంటే బాగుండేది. నిజానికి ఇది మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్,కాకపోతే మరింత టైట్ చేస్తూ చెప్పాల్సింది. ఫైనల్ గా ఓపికగా చూడగలిగితే…ఈ వీక్ కి మంచి టైం పాస్ అయ్యే కంటెంట్ ఇది.