Ads
ఇటీవల కాలంలో విడుదలైన హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు కూడా అలాంటి కంటెంట్ ని అందించడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నాయి. అలా అమెజాన్ ప్రైమ్ వేదికపైకి ది విలేజ్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఆర్య కథానాయకుడిగా నటించిన భారీ సిరీస్ ఇది.
సీజన్ 1లో భాగంగా 6 ఎపిసోడ్స్ ను వదిలారు. ఈ సిరీస్ కి మిలింద్ రావు దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ స్ట్రీమింగ్ ఎలా ఉంది? కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లాలోని కట్టియల్’ గ్రామంలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయని అటువైపు వెళ్లినవారు తిరిగి వచ్చిన దాఖలాలు లేవని అంతా చెప్పుకుంటూ ఉంటారు.
ఒక మహిళకు పురిటి నొప్పులు మొదలవుతాయి. రాత్రివేళ జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ వానలోనే ఆమెను తీసుకుని కుటుంబ సభ్యులు వ్యానులో బయల్దేరతారు. కట్టియల్ ఊరు దగ్గరికి వచ్చిన ఆ వ్యాన్ ఏమైందనేది ఎవరికీ తెలియదు. అయితే డాక్టర్ గా పనిచేస్తున్న గౌతమ్ (ఆర్య) అతని భార్య నేహ (దివ్య పిళ్లై) కూతురు మాయ (బేబి ఆగ్జియా) కలిసి సరదాగా రోడ్ ట్రిప్ వేస్తారు.
వాళ్లతో పెంపుడు కుక్క హెక్టిక్ కూడా ఉంటుంది. అలా హైవేపై వెళుతున్నవారు, ఒకచోట ట్రాఫిక్ జామ్ కావడంతో కారును కట్టియల్ దిశగా మళ్లిస్తారు. శిధిలమై పోయిన కట్టియల్ గ్రామంలోకి కారు ప్రవేశించగానే కారు రెండు టైర్లు పంక్చర్ అవుతాయి. అయితే అప్పటికే బాగా చీకటి పడుతుంది. దానికి ఫోన్ లో సిగ్నల్స్ కూడా ఉండవు.
దాంతో భార్య బిడ్డలను కారులోనే కూర్చోమని చెప్పి, సహాయం కోసం గౌతమ్ కొంత దూరం నడుస్తూ వెళతాడు. నవమలై అనే గ్రామంలోని ఒక హోటల్లో పీటర్ (జార్జ్ మరియన్) శక్తి (ఆడుకాలం నరేన్) ఒక మెకానిక్ మాట్లాడుకుంటూ ఉండగా, అక్కడికి గౌతమ్ వచ్చి సాయం అడుగుతాడు. అయితే కట్టియల్ చాలా ప్రమాదకరమైన ప్రదేశం కావడంతో సహాయం చేయడానికి ఎవరూ రారని వాళ్లు చెబుతారు. కానీ అతను ఎలా గోలా వాళ్లను బ్రతిమలాడి వెంటతీసుకుని వెళ్లేలోగా అక్కడ కారు,భార్య బిడ్డ కనిపించరు.
Ads
మరొకవైపు సింగపూర్ లోని శ్రీమంతులలో జీఎస్ఆర్ (జయప్రకాశ్) ఒకరు. ఆయన ఒక్కగానొక్క కొడుకు ప్రకాశ్ (అర్జున్ చిదంబరం). అతను చాలా కాలంగా వీల్ చైర్ కి పరిమితమై ఉంటాడు. చివరిదశలో ఉన్న జీఎస్ఆర్ కొడుకు దగ్గర గతాన్ని గురించి ప్రస్తావిస్తాడు. అతనిని నడిపించడానికి అవసరమైన ఔషధం కోసం కట్టియల్ ప్రాంతంలో తాను ఎన్నో ప్రయోగాలు చేశాననీ, ఆ ప్రయోగాలు వికటించడం వలన అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతాడు.
ఎలాంటి పరిస్థితుల్లోను అక్కడ తాను నెలకొల్పిన ప్రయోగశాలకు వెళ్లొద్దని చెబుతాడు. అయితే తండ్రి పరిశోధనకి సంబంధించిన శాంపిల్స్ అక్కడ ఉన్నాయని తెలుసుకున్న ప్రకాశ్, ఆ ఔషధం తనని నడిపించగలదని నమ్మి, ఆ శాంపిల్స్ ను అక్కడి నుంచి తీసుకుని వచ్చే బాధ్యతను ఫర్హాన్ (జాన్ కొక్కెన్)టీమ్ కి అప్పగిస్తాడు. అప్పుడు గతంలో తండ్రి దగ్గర పనిచేసిన జగన్ (తలైవాసల్ విజయ్) ను కూడా వాళ్లతో పంపిస్తాడు.
ఆయుధ సామాగ్రితో హెలికాఫ్టర్ లో అక్కడికి వాళ్లు చేరుకుంటారు. అయితే కట్టియల్ గత చరిత్ర ఏమిటి? గతంలో అక్కడ ఏం జరిగింది? ఎందుకు అక్కడికి వెళ్లిన వారు తిరిగిరావడం లేదు? అక్కడ అసలు ఏం జరుగుతోంది. భార్యా బిడ్డలను వెతకడానికి వెళ్లిన గౌతమ్ కి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? ప్రకాశ్ కి కావలసిన శాంపిల్స్ కోసం వెళ్లిన టీమ్ కి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది ఈ కథలో చోటుచేసుకున్న ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి.
ALSO READ : మంగళవారం సినిమా చూసి గూగుల్లో దాని గురించి వెతుకుతున్న నెటిజెన్స్.. అదేంటో తెలుసా?