Ads
రామ జన్మభూమి అయోధ్యలో ఎటు చూసినా రామనామ స్మరణతో మోగిపోతోంది. బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగి మూడు రోజులైనా సరే రాముని దర్శించుకోడానికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయోధ్య వీధులన్నీ జైశ్రీరామ్ అంటూ పులకించిపోతున్నాయి.
ఆ సుందర మనోహరమైన ఆ బాలరాముడి రూపం చూసి భక్తులు తరించిపోతున్నారు. అయోధ్య ప్రాంతం అంతా రామ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంత మంది జనం ఆ బాలరాముడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి అయోధ్యకు చేరుకొంటున్నారు.
అయితే రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్టించేందుకు రామ జన్మ భూమి ట్రస్ట్ మూడు విగ్రహాలను తయారు చేయించారు. రామాయణంలో రాముడు రూపం ముదురు రంగుతో వర్ణించారు. ఈ కారణంగా రామాలయంలోని గర్భగుడిలో నలుపు రంగు రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదే సమయంలో తెల్లరాతితో మరో విగ్రహాన్ని కూడా తయారు చేయించారు. అయితే ఆ తెల్లరాతి రాంలాలా విగ్రహం ఏమైందన్న ప్రశ్నలు జనాల్లో తలెత్తుతున్నాయి.
Ads
రాజస్థాన్ శిల్పి సత్య నారాయణ్ పాండే ఈ రాంలాలా విగ్రహాన్ని తెల్లని రాతితో తయారు చేశారు. ఈ విగ్రహాన్ని మందిరం మొదటి అంతస్తులో ఉంచుతారన్న ప్రచారం జరుగుతోంది. తెల్లటి రంగులో ఉన్న రాంలాలా విగ్రహం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రామభక్తుడు హనుమంతుడు రాంలాలా విగ్రహం పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు. విగ్రహం చుట్టూ శ్రీహరి దశావతారాలను చిత్రీకరించారు. ఇది విష్ణువు అవరాల్లోని మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలను సూచిస్తుంది.
ఇక మూడో విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన గణేష్ భట్ తయారు చేశారు. ఈ విగ్రహం కూడా ఆలయం వద్ద సిద్ధంగా ఉంది. అయితే దీని ఇంకా బయటకి విడుదల చెయ్యలేదు. ఈ విగ్రహాన్ని కూడా రామ మందిరంలో ప్రతిష్టించవచ్చని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ మూడు విగ్రహాలు కూడా చూడటానికి మనసును ఆకర్షించే విధంగా ఉన్నాయని అంటున్నారు.