Ads
సాధారణంగా ఏదైనా ఒక ఇండస్ట్రీలో స్టార్ అని గుర్తింపు సంపాదించుకున్న తర్వాత, ఆ ఇండస్ట్రీని వదిలి ఇతర ఇండస్ట్రీలలో సినిమాలు చేయాలి అంటే చాలా మంది హీరోలు ఆలోచిస్తారు. స్టార్ హీరోలు మాత్రమే కాదు. యంగ్ హీరోలు కూడా ఈ విషయం మీద ఆలోచిస్తారు. తమ సినిమాలని తమ సొంత భాషల్లో తీసి, ఇతర భాషల్లోకి డబ్ చేయాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇతర భాషల్లోకి వెళ్లి నటించాలి అని అనుకునే హీరోలు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అందుకు చాలా కారణాలు ఉంటాయి.
ఒకటి ఏంటంటే, ఒకసారి తమ సొంత ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న తర్వాత ఇతర ఇండస్ట్రీలో సినిమాలు చేస్తే వాళ్లు ఎలా స్వీకరిస్తారు అనేది ఆలోచించాల్సిన విషయంగా మారుతుంది. ఒక ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యాక, ఇతర ఇండస్ట్రీలో మళ్లీ మొదటి నుండి మొదలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు వారు ఒక కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన నటుడు ఎంచుకునే సినిమాలని ఎంచుకోవాల్సి వస్తుంది. కానీ మలయాళం ఇండస్ట్రీ హీరోలు మాత్రం ఇలా చేయరు. మలయాళంలో పేరు తెచ్చుకున్న హీరోలు కూడా ఇతర ఇండస్ట్రీలో నటిస్తున్నారు. అందుకు ఉదాహరణ, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్. వీళ్లు మాత్రమే కాదు. ఇంకా చాలా మంది మలయాళం హీరోలు ఇతర ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తున్నారు.
మోహన్ లాల్, మమ్ముట్టి వంటి నటులు తెలుగులో, తమిళ్ లో సినిమాలు చేశారు. ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ కూడా తెలుగులో రెండు సినిమాలు ప్రకటించారు. వీటితో పాటు పుష్ప సినిమా కూడా చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే, తెలుగుతో పాటు, హిందీ, తమిళ్ భాషల్లో కూడా నటిస్తున్నారు. అలా అని మలయాళం సినిమాలు వదిలేయలేదు. మలయాళంలో కూడా నటిస్తున్నారు. ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకులని అలరించిన పృథ్వీరాజ్ సుకుమారన్, ఇప్పుడు మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో విలన్ పాత్ర పోషించబోతున్నారు అనే ఒక వార్త వచ్చింది.
Ads
గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ తమిళ సినిమాల్లో నటించారు. కానీ తెలుగు సినిమాల్లో కూడా ఇప్పుడు నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ అయితే మహానటి, సీతారామం సినిమాల్లో నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ సినిమాలో కూడా నటించారు. ఇటీవల కల్కి 2898 ఏడి సినిమాలో కనిపించారు. ఇప్పుడు ఇంకొక తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నారు. అభినందించాల్సిన విషయం ఏంటంటే, వీళ్లు ఏ భాషలో సినిమా చేస్తే, ఆ భాషలో డబ్బింగ్ వాళ్లే చెప్పుకుంటారు. ఏ భాషలోకి వారి సినిమా డబ్ అయినా కూడా ఆ భాషకి వాళ్లే సొంత డబ్బింగ్ చెప్పుకుంటారు.
అయితే, వీళ్ళు ఇతర భాషల సినిమాలు కూడా చేయడానికి కారణం మార్కెట్ పెంచుకోవడం అని తెలుస్తోంది. మలయాళంలో హీరోలకి పారితోషం తక్కువ. చాలా తక్కువ బడ్జెట్ తో వాళ్ళు సినిమాలు తీస్తారు. ఎప్పుడో ఒకసారి తప్ప హై బడ్జెట్ సినిమాలు రావు. అక్కడికంటే ఇతర ఇండస్ట్రీలలో పారితోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అయితే ఇతర భాషల హీరోలు అయినా కూడా ఆదరణ బాగా ఉంటుంది. మిగిలిన భాషల్లో అయితే, భాష వచ్చి, డబ్బింగ్ వాళ్లే చెప్పుకొని, నటనపరంగా ఎంతో మెరుగ్గా ఉంటే మంచి ఆదరణ లభిస్తుంది.
మలయాళం హీరోలకి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మలయాళం సినిమా ఇండస్ట్రీలో నటులు ఎంత గొప్పగా నటిస్తారో అని తెలపడానికి వీళ్లు తమ వంతు కృషి చేస్తున్నారు. దీని వల్ల మార్కెట్ పెరగడం మాత్రమే కాకుండా, హై బడ్జెట్ సినిమాలు కూడా మలయాళంలో రూపొందుతాయి. అందుకే మలయాళం హీరోలు ఇతర ఇండస్ట్రీ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. వాళ్ల సత్తా చాటుకుంటున్నారు. ఇంకా చాలా మంది మలయాళం హీరోలు కూడా ఇతర ఇండస్ట్రీలలో ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు.