Ads
ఏపీ రాజకీయాలలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జేడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. ముద్రగడ వైసీపీలో చేరిపోతున్నానని ఎప్పుడో చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఏపీలో ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో జాతీయ జనసేన పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు అయింది.
తెలంగాణలో బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ జనసేన 8 నియోజకవర్గాల్లో పోటీ చేసింది, అందులో కూకట్ పల్లి ఒకటి. అయితే అదే నియోజకవర్గ నుంచి జాతీయ జనసేన పార్టీ పేరుతో మరొక అభ్యర్థి కూడా పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన గుర్తు గాజు గ్లాస్, జాతీయ జనసేన గుర్తు బకెట్. వీటి రెండు సింబల్స్ ఒకేలా ఉండడం ఇప్పుడు అసలు సమస్య. కూకట్ పల్లిలో బకెట్ గుర్తుకి 800 ఓట్ల వరకు పోలయ్యాయి. ఇప్పుడు ఏపీలో ఈ పార్టీ గురించి చర్చి మొదలైంది. ఎందుకంటే ఈ జాతీయ జనసేన పార్టీ ఏపీలో కూడా పోటీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.
Ads
బకెట్ గుర్తు గెలవటం పక్కన పెడితే కనీసం రెండు మూడు వేల ఓట్లు చీలిన తమకు లబ్ధి చేకూరుతుందని వైసీపీ భావిస్తుంది. ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడు పేరు కూడా పవన్ కళ్యాణ్. ఈసారి ఎన్నికల్లో గోదావరి జిల్లాలో పవన్ ప్రభావం ఎక్కువగా ఉండేలా తెదేపా, జనసేన తొలినుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాపు ఓటింగ్ ప్రధానంగా జనసేన, తెదేపాకి మళ్ళేలా వ్యూహాలు అమలు చేస్తున్నాయి.
దీనికి కౌంటర్ గా సీఎం జగన్ కొత్త సామాజిక సమీకరణాలతో ఇన్చార్జిల మార్పు పైన కసరత్తు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో జేడి లక్ష్మీనారాయణ కూడా కొత్తగా పార్టీని ప్రకటించారు. కాంగ్రెస్ సైతం ఈసారి ఏపీలో ప్రభావం చూపించాలని లక్ష్యంతో కసరత్తులు ప్రారంభించింది. ఈ వ్యూహాలన్నీ చూస్తుంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్, చంద్రబాబుల లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.