Ads
ఏ ఒక్క వ్యక్తి కూడా కష్టపడనిదే పైకి రారు. ఒక వ్యక్తి ఒక రోజు గుర్తింపు తెచ్చుకున్నారు అంటే, దాని వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుంది. కానీ అది ఎవరికీ తెలియదు. ఈ వ్యక్తి జీవితంలో కూడా అలానే ఎన్నో కష్టాలు ఉన్నాయి. వాటన్నిటినీ అధిగమించి ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆయన పేరే అమిటి హనుమంతు. ఏఎస్పీ. అనంతపురంలో విధులు నిర్వహిస్తారు. గత సంవత్సరం హనుమంతు గారు మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి. ఒక వ్యక్తి ఇన్ని కష్టాలు పడతారా అని అందరూ చలించిపోయారు. బీబీసీ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి హనుమంతు గారు తెలిపారు.
హనుమంతు గారిది అన్నమయ్య జిల్లాలోని కలికిరి మండలం, తెళ్లగుట్టపల్లి. హనుమంతు గారి తండ్రి రామయ్య గారు, తల్లి కృష్ణమ్మ గారికి మొత్తం నలుగురు సంతానం. ముగ్గురు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. హనుమంతు గారు మూడవ వారు. ఒక్కరోజు పని చేయకపోయినా కూడా ఇల్లు గడవని పరిస్థితి. హనుమంతు గారి తల్లి ఊరు తిరిగి భోజనాన్ని తీసుకొచ్చేవారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి గ్రామం హనుమంతు గారు నివసించే చోటు దగ్గరలోనే ఉండేది. పండగల లాంటివి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి గ్రామానికి వెళ్లి, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి, పాత్రలు తీసుకొని వాళ్ళ ఇంటి ముందు వరుసగా కూర్చుంటే అందరికీ భోజనాలు పెట్టేవారు.
హనుమంతు గారు, తన తల్లితో కలిసి వెళ్లేవారు. ఒకసారి అలా వెళ్లి వస్తూ ఉన్నప్పుడు హనుమంతు గారు, తల్లితో కలిసి చెట్టు కింద కూర్చున్నారు. వాళ్ళిద్దరూ తింటున్నప్పుడు అక్కడ కొంత మంది పిల్లలు స్కూల్ కి వెళ్తుంటే హనుమంతు గారు చూస్తూ కూర్చున్నారు. అప్పుడు హనుమంతు గారికి చదువు అంటే ఆసక్తి ఉంది అనే విషయాన్ని ఆయన తల్లి గమనించారు. హనుమంతు గారు ఆ ఊర్లో ఉండే వాళ్లందరికీ తెలుసు. ఈ కారణంగా ముందు స్కూల్ లో చేర్చుకోడానికి అనుమతి దొరకలేదు. తన తల్లితో పాటు, ఇళ్ళ ముందు నిలబడి అన్నం అడిగేవారు. స్కూల్ కి కూడా అందుకే వచ్చారు ఏమో అని అనుకొని, “అన్నం లేదు పో” అని పంపించేసేవారట.
Ads
దాంతో హనుమంతు గారితో, తన తల్లి, “రేపు మళ్లీ వెళ్ళు” అని చెప్పి వేరే, వాళ్ళ పలక తీసుకొచ్చి హనుమంతు గారికి ఇచ్చి పంపించారు. అప్పుడు టీచర్ స్కూల్లో కూర్చోబెట్టినా కూడా తనతో చదివేవారు దగ్గరికి రానివ్వలేదు. టీచర్ లేనప్పుడు వెనక్కి వెళ్లి కూర్చోమని బెదిరించేవాళ్లట. ఇది గమనించిన టీచర్, ఒకసారి ఆ పిల్లలందరినీ తిట్టారు. హనుమంతు గారికి టీచర్, “మంచి బట్టలు వేసుకో” అని చెప్పి, కొన్ని బట్టలు ఇప్పించేవారట. హనుమంతు గారి తల్లి కూడా వేరే చోట బట్టలు తీసుకొచ్చి ఇచ్చేవారు. హనుమంతు గారి జీవితంలో ఒక్క సంఘటన ఆయనకి అవమానకరంగా అనిపించింది. హనుమంతు గారు ఇంటర్ చదివే సమయంలో సెనగ పెరికే పనికి వెళ్లారు.
పని చేస్తున్నప్పుడు దాహం వేయడంతో, వాళ్లతో పని చేయిస్తున్న ఆవిడ దగ్గరికి వెళ్లి, నీళ్లు కావాలి అని అడిగారు. ఆవిడ ఇంటి చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. నీళ్లు అడిగిన హనుమంతు గారికి నీళ్లు ఇవ్వలేదు. దాంతో హనుమంతు గారు, “ఏమైంది?” అని అడిగితే, ఆవిడ, “చిప్ప కోసం వెతుకుతున్నాను” అని చెప్పింది. అప్పుడు హనుమంతు గారు, “మీ ఇంట్లో గ్లాసులు లేవా అమ్మా?” అని అడిగితే, “మీకు మేము గ్లాసుల్లో నీళ్లు ఇవ్వకూడదు” అని ఆమె చెప్పింది. ఈ సంఘటన హనుమంతు గారిని ఎలాగైనా సరే గొప్ప స్థాయికి వెళ్ళాలి అనే తపన పెరిగేలాగా చేసింది. ఎలాగైనా సరే మంచి స్థాయికి వెళ్లి, వీళ్ళకి సమాధానం చెప్పాలి అని హనుమంతు గారు నిర్ణయించుకున్నారట. ఆమె మీద హనుమంతు గారికి ఎటువంటి కోపం లేదట. ఈ విషయాన్ని హనుమంతు గారు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తర్వాత ఇప్పుడు హనుమంతు గారు ఎన్నో సార్లు ఆమెకి మనసులో థాంక్స్ చెప్పుకున్నారట.
watch video :
ALSO READ : జెర్సీ నెంబర్ వెనకున్న ఈ రూల్స్ తెలుసా.? రోహిత్, కోహ్లీలకు ఆ నంబర్లు ఎలా వచ్చాయంటే.?