Ads
పెళ్లి అనేది చిన్న విషయం కాదు. ఇందులో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా జీవితాంతం దీని ప్రభావం ఉంటుంది. అందుకే పెళ్లి విషయంలో చాలామంది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కావాల్సిన భాగస్వామి నుండి ఆశించే లక్షణాలు గురించి. అవన్నీ పక్కన పెడితే, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలని ఇచ్చే చోట, ముఖ్యంగా ఆడపిల్లని ఇచ్చే చోట ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఒక అంచనా వేసుకుంటారు. అలా ఉంటే మాత్రమే తమ ఆడపిల్లని ఇవ్వాలి అని అనుకుంటారు.
అందులో ముఖ్యంగా కావాల్సింది, అబ్బాయి కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబం కావడం, తమకంటే ఒక మెట్టు ఎక్కువగా ఉండడం, అబ్బాయి జీతం ఎక్కువగా ఉండడం, సొంత ఇల్లు ఉండడం. చాలా మంది అమ్మాయి తల్లిదండ్రులు ఇవన్నీ చూసుకొని తమ పిల్లని ఇస్తున్నారు. అయితే, వీటన్నిటిమీద విముఖత వ్యక్తం చేసే అబ్బాయిలు కూడా ఉంటున్నారు. “ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు ఇలాంటివన్నీ కోరుకుంటూ, తక్కువ జీతం వచ్చే అబ్బాయిల పరిస్థితి ఏంటి?” అని అంటూ ఉంటారు.
Ads
అయితే, అమ్మాయి తల్లిదండ్రులు ఇలాంటి విషయాల మీద ఎక్కువగా జాగ్రత్త పడడానికి కారణం ఉంది అని పరిశోధనలు తెలుపుతున్నాయి. అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని చిన్నప్పటినుంచి చూసి ఉంటారు. ఎలాంటి వాతావరణంలో ఆ అమ్మాయి పెరిగింది అనేది వాళ్ళకి తెలుసు. పెళ్లయ్యాక అడ్జస్ట్మెంట్ అనేది తప్పదు. కానీ పెద్ద పెద్ద వాటికి కూడా అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అమ్మాయికి రాకూడదు అని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. పెళ్లికి ముందు ఒకవేళ అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో ఏవైనా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే, పెళ్లయ్యాక కూడా అమ్మాయి అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అని అనుకుంటారు.
అందుకే, ఆర్థికంగా తమ కంటే ఒక మెట్టు ఎక్కువగా ఉన్న కుటుంబానికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వాలి అని అనుకుంటారు. అద్దె ఇంట్లో ఉంటే చాలా ఖర్చులు అవుతాయి. సొంత ఇంట్లో ఉంటే చాలా ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి, సొంత ఇల్లు ఉండడం అనేది చాలా మంది అమ్మాయి తల్లిదండ్రులు కోరుకునే ఒక లక్షణం. ఈ కారణాల వల్లే తల్లిదండ్రులు ఇలాంటి లక్షణాలు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు.