Ads
పెళ్లి అనేది కేవలం ఒక తంతు మాత్రం కాదు…దాని వెనక ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. గంపడంతా ఆశతో కొత్త జీవితాన్ని ఎంతో ఆహ్లాదంగా ఊహించుకొని అత్తగారింటి అడుగుపెట్టిన ఆడపిల్ల.. అక్కడ ఈమడలేక సతమతమయ్యే పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు జీవితం నరకంగా మారుతుంది. కొత్త మనుషులు ,కొత్త వాతావరణం ఎదురుపడినప్పుడు ఎవరికైనా అడ్జస్ట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. ఎందరో అమ్మాయిలు ఈ రకంగా అత్తగారింట ఎదురయ్యే సమస్యలను తట్టుకోలేక అన్యాయం అయిపోతున్నారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతుర్ని అంతే ప్రేమగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో ఇచ్చి పెళ్లి చేసే తల్లిదండ్రులు ఆ తరువాత పిల్లలు ఎదుర్కొనే బాధలు చూసి తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. అసలు కొందరి పెళ్లిళ్ల గురించి వింటే పెళ్లి అనేది జీవితంలో అవసరమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.ఊరు, పేరు తెలియని ఒక అమ్మాయి తల్లికి రాసిన ఉత్తరం ప్రస్తుతం సోషల్ మీడియాలో చదివిన వారి కంట కన్నీరు పెట్టిస్తోంది. హృదయాన్ని కదిలిస్తున్న ఆ లెటర్లో ఇంతకీ ఏముందో తెలుసుకుందామా..
అమ్మ మీ దగ్గర ఉన్నప్పుడే నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.. తొందరపడి పెళ్లి చేసుకున్నాను. నాకు చాలా బాధగా ఉంది. ఎందరో ఆడపిల్లల లాగా నేను కూడా పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను…ఒక సుఖమైన జీవితాన్ని ఆశించాను. కానీ పెళ్లి తర్వాత అర్థమైంది నేను అనుకున్న పూల పాన్పు ..నిజానికి ముళ్లబాట అని. పెళ్లయి ఇంటికి వచ్చిన కోడలు నుంచి బాధ్యతలు ,త్యాగాలు మాత్రమే ఆశిస్తారు తప్ప తను కూడా ఒక మనిషి అన్న విషయాన్ని ఇక్కడ ఎవరు గుర్తించరు.
Ads
అందరికంటే ముందు లేవాలి…వాళ్లకు నచ్చిన విధంగా ఉండాలి…నా ఇష్టాలకు ఇక్కడ గుర్తింపు లేదు…కనీసం నచ్చిన బట్ట కట్టుకునే స్వతంత్రం నాకు లేదు. సరదాగా తిరగాలన్న, నచ్చింది తినాలన్న ప్రతి నిమిషం ఎవరో పర్మిషన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఒక్కొక్కసారి ఆలోచిస్తే అసలు ఈ పెళ్లి చేసుకోవడం కంటే కూడా అలా మన ఇంట్లో పెళ్లి కాకుండా మిగిలిపోతేనే నా బతుకు ప్రశాంతంగా ఉండేదేమో అని అనిపిస్తుంది.
నీ చేత నచ్చినవన్నీ చేయించుకొని …నువ్వు తినిపిస్తుంటే తింటూ.. నీ ఒళ్ళో పడుకొని నిద్ర పోవాలని ఉందమ్మా. కానీ అలా అనుకున్న ప్రతిసారి నువ్వు కూడా నాలా పెళ్లి చేసుకుని వేరొక ఇంటి నుంచి ఇక్కడికి వచ్చిన దానివే అని గుర్తుకు వస్తుంది. నాకోసం ,నాన్న కోసం ,మన ఇంటి కోసం నువ్వు ఎన్ని త్యాగాలు చేశావో ఇప్పుడు నాకు అర్థం అవుతోంది.
అలా అనుకున్నప్పుడల్లా నువ్వు చేసిన త్యాగం గుర్తుకు వచ్చి మనస్ఫూర్తిగా నీ కాళ్లకు దండం పెట్టాలి అనిపిస్తుంది. ఇన్నాళ్లు నీ కష్టం గుర్తించక నిన్ను ఏమన్నా బాధపెట్టి ఉంటే ఈ కూతుర్ని చిరునవ్వుతో మన్నించు. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నిన్ను తలుచుకొని ధైర్యం తెచ్చుకుంటున్నాను…నీవల్ల నేను జీవితంలో ఎంతో నేర్చుకుంటున్నానమ్మా…అంటూ కన్నీరు పెడుతూ రాసిన ఆ కూతురు లేక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
లేఖ రాసింది ఎవరు అన్న విషయం తీసి పక్కన పెడితే ఇందులో ఉన్న కంటెంట్ మాత్రం ప్రతి ఇంటిలో కామన్ గా జరిగేది. తాను పెళ్లి చేసుకొని ఒక ఇంటికి కోడలిగా వచ్చి అత్త చేతిలో ఎంతో కొంత ఇబ్బంది పడిన ప్రతి ఆడపిల్లా …తాను అత్తగా మారిన మరుసటి నిమిషం హుకుం చలాయించాలని చూస్తుంది. సమాజంలో నడుస్తున్న ఈ పద్ధతి మారితే తప్ప కోడళ్ళు ,కూతుర్లు సుఖంగా ఉండలేరు. ఎవరో రాసిన లెటర్ చదివి ఎమోషనల్ అవ్వడం కాదు మీ ఇంట్లో ఇటువంటివి జరగకుండా జాగ్రత్త తీసుకోండి… ఆలోచించండి ..మార్పుకు నాంది కండి.