Ads
మామూలుగా ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొన్ని కొన్ని సార్లు ఆసక్తికర విషయాలు సంతరించుకుంటూ ఉంటాయి. ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి కొడుకులు కానీ భార్యాభర్తలు కానీ అన్న తమ్ముళ్లు కానీ పోటీ పడుతూ ఉంటారు.
కానీ ఒకే ప్రత్యర్థిపై ఒకే కుటుంబానికి చెందిన వారు వరుసగా పోటీ చేయడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కాగా ప్రస్తుతం మెదక్ నియోజకవర్గం లో అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే పద్మ పై మైనంపల్లి కుటుంబీకులు చాలా ఏళ్లుగా పోటీ చేస్తూనే ఉన్నారు.
మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో2004 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి ప్రస్తుత మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సతీమణి మైనంపల్లి వాణి పోటీ చేసి ఓటమి పాలయింది. తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రామాయం పేట ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
Ads
ఈ క్రమంలో 2008లో జరిగిన రామాయం పేట ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మళ్లీ పద్మాదేవేందర్ రెడ్డి పోటీ చేయగా ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మైనంపల్లి హన్మంత రావు బరిలో నిలిచి గెలిచారు.ఆ తర్వాత నియోజకవర్గాల పునర్ విభజనలో రామాయం పేట నియోజకవర్గాన్ని రద్దుచేసి చిన్నశంకరం పేట, రామాయం పేట మండలాలను మెదక్ నియోజకవర్గంలో కలిపారు.
ఈ నేపథ్యంలో 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్‌ఎస్ పొత్తులో భాగంగా మెదక్ టికెట్‌ను మైనంపల్లి హన్మంతరావుకు కేటాయించడంతో పద్మాదేవేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మైనంపల్లి హన్మంతరావు చేతిలో మరోసారి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014, 2018 లో వరుసగా పద్మాదేవేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ వ్యక్తిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. అయితే తాజాగా మూడోసారి సైతం పద్మారెడ్డికి బీఆర్‌ఎస్ హైకమాండ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
కాగా గతంలో మైనంపల్లి హన్మంతరావు దంపతులు పద్మాదేవేందర్ రెడ్డిపై పోటీ పడగా, ప్రస్తుతం వారి కుమారుడు రోహిత్‌రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మకు పోటీగా బరిలో నిలిచారు. ఆరోజు తల్లీదండ్రులు, నేడు కొడుకు పోటీపడుతుండడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 19 ఏళ్లుగా రాజకీయ వైరం వీరి మధ్యలోనే జరుగుతుండడం విశేషం. మరి ఈసారైనా గెలుస్తారో లేదో చూడాలి మరి.