Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు వస్తూ ఉంటారు. కొంత మంది దర్శకులు ఒక సినిమాతో ఫేమస్ అయితే, మరి కొంత మంది దర్శకులకి గుర్తింపు సంపాదించుకోవడానికి సమయం పడుతుంది. అయితే ఎన్నాళ్ళైనా సరే గొప్ప కంటెంట్ ఉంటే కానీ వారు ఇండస్ట్రీలో కొనసాగలేరు. చాలా గొప్ప కంటెంట్ ఉంటే కానీ వారి సినిమాలు చేయడం ఆపేసినా కూడా వారికి ఇండస్ట్రీలో ఒక స్థానం ఉండిపోతుంది.
అలా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని, ఇప్పటికీ కూడా ప్రేక్షకులకి గుర్తుండిపోయిన దర్శకుడు ఇవివి సత్యనారాయణ. తనదైన మార్క్ కామెడీతో, తనదైన మార్క్ పంచ్ లైన్స్ తో ఎన్నో హిట్ సినిమాలు తీశారు. యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు ఎంతో మంది హీరోలకి వారి జీవితంలో గుర్తుండిపోయే హిట్ సినిమాలని ఇవివి సత్యనారాయణ ఇచ్చారు.
కానీ తన సినిమాలతో హాస్యం అందించడంతో పాటు, సమాజానికి ఒక సందేశాన్ని కూడా అందించారు. అప్పట్లో ఇళ్లలో కూడా మాట్లాడడానికి ఆలోచించే ఎన్నో విషయాలని తన సినిమాల ద్వారా చూపించారు. ఎన్నో అపోహలని బ్రేక్ చేశారు. నిజంగా ఒక మధ్య తరగతి కుటుంబం ఎలా ఉంటుందో, చాలా మంది సమాజంలో ఎదుర్కొనే విషయాలు ఏంటో తన సినిమాల ద్వారా తన స్టైల్ హాస్యాన్ని జోడించి చూపించారు.
అప్పటి సినిమాల్లో పొరపాటున ఒక హీరో హీరోయిన్ మెడలో ఒక పసుపు తాడు వేస్తే వాళ్ళిద్దరికీ పెళ్లి అయిపోయింది అని, ఇంక అతనే తన భర్త అని హీరోయిన్ నమ్మి హీరోని అభిమానించడం మొదలు పెడుతుంది. ఎవరైనా అలా ఎందుకు చేస్తున్నావు అని హీరోయిన్ ని అడిగితే, “అతను నా మెడలో తాళి కట్టాడు. కాబట్టి అతను నా భర్త” అని హీరోయిన్ ధైర్యంగా సమాధానం చెప్పేది. అలాంటి సీన్స్ ఉన్న సినిమాలు వచ్చే సమయంలో, ఇష్టం లేకుండా పసుపుతాడు కడితే అసలు ఆ పెళ్లి చెల్లదు అని చూపించారు.
Ads
అదే ఆమె సినిమా. భర్త లేని ఒక స్త్రీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో, అలాంటి ఆడదాన్ని తన కుటుంబ సభ్యులు ఎలా చూస్తారో, కొంత మంది ఆమె పరిస్థితిని అవకాశంగా ఎలా ఉపయోగించుకుంటారో ఈ సినిమా ద్వారా చూపించారు. తనికెళ్ళ భరణి పాత్ర హీరోయిన్ కి ఇష్టం లేకుండా ఆమె మెడలో తాళి కడతాడు. ఆమె తన భార్య అని సంతోషపడతాడు. కానీ వెంటనే హీరోయిన్ తన మెడలోని తాళి తీసేసి తనకి పెళ్లి ఇష్టం లేదు అని ధైర్యంగా చెప్తుంది. అప్పట్లో ఇలాంటి సీన్ చూపించడం అంటే చిన్న విషయం కాదు.
ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం ఎలా ఉంటుంది? నెల తిరిగే లోపు ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు వస్తాయి? ఈ విషయాలు అన్ని అమ్మో ఒకటో తారీకు సినిమాలో కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. సినిమాలో కొన్ని సీన్స్ లో అయితే ఏడిపించారు కూడా. కితకితలు సినిమా కామెడీ సినిమా అయినా కూడా, బరువు ఎక్కువగా ఉండే మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? వారు ఎంత బాధ పడతారు అనేది ఒక పక్క కామెడీగా చూపిస్తూనే, మరొక పక్క ఇలాంటి సందేశం కూడా ఇచ్చారు.
ఎవడి గోల వాడిదే సినిమాలో కూడా ఒక హోటల్ లో కొంత మంది జీవితాలు ఎలా మారాయి అని చూపిస్తూ ఇష్టం లేని పెళ్లిలో ఉన్న కృష్ణ భగవాన్, ఎన్నో సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని ప్రేమించి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తెలంగాణ శకుంతల జీవితాలని, తర్వాత వాళ్లు నిజమైన ప్రేమని వెతుక్కోవడం అనే ఒక సున్నితమైన విషయాన్ని కూడా చూపించారు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.
ఆరుగురు పతివ్రతలు అనే ఒక సినిమాతో ఏ డైరెక్టర్ కూడా చేయని సాహసాన్ని, అది కూడా తాను స్టార్ డైరెక్టర్ అయ్యాక చేయని ఒక సాహసాన్ని ఇవివి సత్యనారాయణ చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఎలా అర్థం అయ్యిందో కానీ, ఎవరూ మాట్లాడుకోవడానికి కూడా ధైర్యం చేయని విషయాలని అంత పెద్ద స్టార్ డైరెక్టర్ తెర మీద చూపించడం అనేది ఎంతో అభినందించాల్సిన దగ్గ విషయం.
ఇలా ఒక పక్క కామెడీ, మరొక పక్క సందేశం హ్యాండిల్ చేయడం అనేది కేవలం ఇవివి సత్యనారాయణకి మాత్రమే వచ్చిన విద్య ఏమో. ఆయన సినిమాల్లో కామెడీ చాలా ఉంటుంది. కానీ ఆ కామెడీ వెనక ఇలాంటి ఏదో ఒక సందేశం కూడా ఉంటుంది. ఇది ఆయన సినిమాలు బాగా ఇష్టపడే వారికి, అందులో ఉన్న కథని బాగా పరిశీలించే వారికి మాత్రమే అర్థం అవుతుంది ఏమో. అందుకే ఇవివి సత్యనారాయణని ట్రెండ్ సెట్టర్ అనాలి. ఇలాంటి దర్శకుడు ఇప్పటి వరకు లేరు. ఇక ముందు కూడా రారు ఏమో.