Ads
ప్రపంచ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత జట్టు పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ లో భారత్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సెక్యూరిటీ వైఫల్యం వల్ల ఊహించని విధంగా ఒక వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు.
ఆ వ్యక్తి ధరించిన టీషర్ట్ పై ‘ఫ్రీ పాలస్తీనా’ అని ఉంది. అయితే ఆ వ్యక్తి డైరెక్ట్ గా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అక్కడి నుంచి వెలుపలికి తీసుకెళ్లారు. ఆ వ్యక్తి ఎవరో? ఎందుకు అలా చేశాడో ఇప్పుడు చూద్దాం..
నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ కు ఆటంకం కలిగించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు జాన్సన్ వేన్ అని, ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్టుగా తెలిపాడని తెలుస్తోంది. విరాట్ కోహ్లీని కలవడానికి గ్రౌండ్ లోకి వెళ్ళినట్టుగా, పాలస్తీనా యుద్ధం పై నిరసన తెలపడానికి ఇలా చేశానని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తరువాత జాన్సన్ వేన్ మీడియాతో చెప్పాడు.
Ads
అతని టీషర్ట్ ముందు భాగంలో పాలస్తీనా పై ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడులు ఆపాలని రాసి ఉంది. జాన్సన్ వేన్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి పనులకు పాల్పడుతున్నాడని అతన్ని విచారించిన అనంతరం పోలీసులు వెల్లడించారు. ఇంటర్నేషనల్ స్థాయి సమస్యలను అడ్డుపెట్టుకుని మ్యాచ్ మధ్యలో వచ్చి ఆటంకం కలిగిస్తున్నాడని అన్నారు. పాపులర్ టిక్‌టాకర్‌గా పబ్లిసిటీ చేసుకోవడానికి ఇటువంటివి చేస్తున్నాడని వెల్లడించారు. జాన్సన్ ఇలా మ్యాచ్ మధ్యలో మైదానాల్లోకి రావడం ఇది తొలిసారి కాదు.
ఈ సంవత్సరం ఆగస్టులో వుమెన్స్ వరల్డ్ కప్ ఫుట్‌బాల్ ఫైనల్ లో స్పెయిన్, ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా జాన్సన్ సెక్యూరిటీ కళ్లు గప్పి గ్రౌండ్ లోకి దూసుకెళ్లాడు. ఆ సమయంలో ‘ఫ్రీ ఉక్రెయిన్, స్టాప్ పుట్లర్’ (హిట్లర్‌తో పుతిన్‌ని పోలుస్తూ) అని ఉన్న టీషర్ట్ ధరించి ఆ మ్యాచ్ లో నిరసన తెలిపాడు. అంతేకాకుండా 2020లో జరిగిన ఒక రగ్బీ మ్యాచ్‌కి ఆటంకం కలిగించి డ్యాన్స్ వేసాడు. అలా చేసినందుకు జాన్సన్ వేన్ కు 200 ఆస్ట్రేలియన్ డాలర్ల ఫైన్ ను విధించారు.