Ads
ఏదో అయ్యింది. ఏమైందో అర్థం అవ్వట్లేదు. హఠాత్తుగా మెలకువ వచ్చి లేచాను. చూస్తే ఉదయం అయిపోయింది. రాత్రి ఒంట్లో బాగా లేకపోవడంతో పడిపోయాను. తర్వాత నన్ను ఎవరు తీసుకొచ్చారు? ఎవరు పడుకోబెట్టారు? ఇవన్నీ ఏమి గుర్తులేదు.
ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే బుర్ర బద్దలైపోతోంది. వెంటనే లేచి ఏ టీనో, కాఫీనో తాగాలి. అసలు ఇంత పొద్దెక్కే దాకా నేను ఎప్పుడు పడుకోలేదు. ఇవాళ ఏమైందో నాకు? అర్జెంటుగా కాఫీ పడితే గాని నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వను. నా భార్య ఎక్కడ?
ఈ టైంకి పిల్లల్ని స్కూల్ కి రెడీ చేస్తూ, గట్టిగా అరుస్తూ హడావిడిలో ఉంటుంది. కానీ ఇప్పుడు శబ్దమే లేదు. సరే. నేనే మెల్లగా వెళ్లి చూస్తా. ఇదేంటి హాల్ మొత్తం జనాలు ఉన్నారు. ఇది నా ఇల్లేనా? ఏం జరిగింది? ఇంత మంది ఎందుకు వచ్చారు? ఎవరండీ మీరు? మీకు మా ఇంట్లో ఏం పని? మా చుట్టాలు కూడా ఉన్నారు. చెప్పా పెట్టకుండా వీళ్ళు ఎందుకు వచ్చారు? బాగున్నారా? ఇలా వచ్చారేంటి? ఎవరు కనీసం నా వైపు తలెత్తి కూడా చూడట్లేదు. కాస్త గట్టిగా అరిచి చెప్తే గాని వినరు.
ఏంటి? ఇంత అరుస్తున్నా ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. అందరూ ఎందుకు ఇంత బాధగా ఉన్నారు? అసలు ఏముంది ఆ గుంపు మధ్యలో? నా భార్య. తను ఎందుకు ఇంత బాధగా కూర్చుంది? అమ్మానాన్న ఎందుకు ఏడుస్తున్నారు? రవి ఎందుకు వచ్చాడు? వాడు చిన్నప్పటినుంచి నా ప్రాణ స్నేహితుడు అయినా కూడా ఒక గొడవ వల్ల ఇద్దరం మాట్లాడుకోవట్లేదు. అమ్మానాన్నలని వాడే ఓదారుస్తున్నాడు. ఎవరైనా చనిపోయారా? ఎవరో అది. సరిగ్గా కనిపించట్లేదు ఏంటి? నేనే దగ్గరికి వెళ్లి చూస్తాను.
ఎవరు అయ్యుంటారు అబ్బా? ఇదేంటి? నేను. నేను చచ్చిపోయానా? ఇది ఎప్పుడు జరిగింది? ఎలా? మరి ఇక్కడ ఉన్నది ఎవరు? నేను నించోనే ఉన్నాను కదా? నేను చచ్చిపోలేదు అని గట్టిగట్టిగా అరుస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు ఏంటి? అబ్బా నేను చచ్చిపోలేదు. ఇక్కడే మీ కళ్ళముందే ఉన్నాను. ఒకసారి నన్ను చూడండి. ఇదేంటి? అసలు ఒక్కళ్ళు కూడా తల ఎత్తి చూడట్లేదు? అంటే నేను ఆత్మనా? నేను నిజంగానే చనిపోయానా? అక్కడ వాళ్ళు బాధపడుతున్నది నా కోసమేనా? దేవుడా? ఏంటి ఇది అంతా? నేను చచ్చిపోవడం ఏంటి? నాకు ఏం అంత పెద్ద వయసు అయిపోయింది అని?
నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అమ్మానాన్నలని బాగా చూసుకోవాలి. పిల్లలు పుట్టాక ఇప్పుడిప్పుడే నా భార్య కూడా మళ్లీ ఉద్యోగంలో చేరాలి అనుకుంటుంది. ఇంటి బాధ్యతలు కూడా ఇద్దరం పంచుకుందాం అనుకున్నాం. కానీ మొత్తం తన మీద వదిలేసి నేను ఎలా వెళ్ళిపోయాను? ఈ వయసులో నా తల్లిదండ్రులు ఈ బాధని ఎలా తట్టుకోగలుగుతారు? నా పిల్లలు నా కోసం వెతుక్కుంటారు కదా? అప్పుడు రవితో నాకు గొడవ అయిన మాట నిజమే. అందులో నా తప్పు కూడా ఉంది. అహంకారంతో నేను వాడికి క్షమాపణ కూడా చెప్పలేదు.
వాడు నాతో మంచిగా మాట్లాడదామని, నా తప్పును నాకు చెబుదాము అని ప్రయత్నించినా కూడా నేనే విసుక్కుంటూ వాడితో మాట్లాడకుండా ఉన్నాను. కానీ నేను చేసిన తప్పుకి నిజంగానే వాడికి క్షమాపణ చెప్పాలి అని ఉంది. ఇప్పుడు ఆ లోటు అలాగే ఉండిపోతుంది. ఒక మంచి స్నేహితుడిని దూరం చేసుకున్నాను. నా కుటుంబం మొత్తానికి నేను దూరం అయ్యాను. ఆఫీస్ పనిలో పడి వాళ్ళతో సరిగ్గా మాట్లాడింది కూడా లేదు. ఒక్క సారి ఒక్క రోజు వాళ్లతో హాయిగా మాట్లాడాలి అని ఉంది.
Ads
వాళ్లని ఎక్కడికైనా తీసుకెళ్లాలి అని ఉంది. వాళ్లతో ఇంకా కొంచెం సమయం గడపాలి అని ఉంది. అలాగే ఆఫీసులో కూడా ఇంకా బాగా పని చేసి ఇంకా మంచి పొజిషన్ కి వెళ్లాలి. ఇవన్నీ అవ్వకుండానే నేను చనిపోయాను. దేవుడా? నేను చాలా తప్పులు చేశాను. నన్ను క్షమించు దేవుడా. ఇంకెప్పుడూ ఇలాంటివి చేయను. ఒక్క అవకాశం ఇవ్వవా దేవుడా? ప్లీజ్ దేవుడా? ప్లీజ్. ఒక్క సారిగా ఎవరో కుదిపినట్టు మెలకువ వచ్చింది. లేచి చూస్తే నా పక్కన నా భార్య నిలబడి ఏమీ అర్థం కానట్టు చూస్తోంది. నాకు కూడా ఏమీ అర్థం అవ్వట్లేదు. “ఏమైనా కలగన్నావా?” అని అడిగింది. ఒక సారి చుట్టూ చూశాను.
అప్పుడు నాకు అర్థం అయ్యింది. ఇది కల. నేను చచ్చిపోలేదు. బతికే ఉన్నాను. కానీ నాకు దీంతో నాకు లభించాల్సిన సందేశం కూడా లభించింది. ఏవో చిరాకుల్లో పడి నేను నా జీవితాన్ని సంపూర్తిగా బతకడం అనే విషయాన్ని మర్చిపోతున్నాను. ఇవన్నీ నేను ఆలోచిస్తూ ఉంటే, నా భార్య నన్ను అలాగే చూస్తూ ఉంది. “అవును కల. కాస్త కాఫీ ఇస్తావా?” అని అడిగి, నేను ఫ్రెష్ అయ్యి హాల్ లోకి వెళ్లి, అక్కడే సోఫాలో కూర్చున్న అమ్మానాన్నలతో ఒక 20 నిమిషాలు మాట్లాడాను. వాళ్ళ మొహంలో చిరునవ్వు చూస్తే ఏదో తెలియని ఆనందం.
నా పిల్లలు స్కూల్ బస్సు వచ్చి వెళుతూ ఉంటే వారికి, ” సాయంత్రం బయటికి వెళ్దాం. మీకు ఏం కావాలంటే అది కొనుక్కుందాం” అని చెప్పాను. వాళ్లు సరే నాన్న అని ఆనందంగా స్కూల్ కి వెళ్లారు. ఇదంతా గమనిస్తున్న నా భార్య మొహంలో నాలో వచ్చిన మార్పు తనకి అర్థం అయ్యి కాస్త కన్ఫ్యూజన్ తో నిల్చోని చూస్తోంది. నేను తన దగ్గరికి వెళ్లి, “నీ ఫ్రెండ్ ఏదో జాబ్ వేకెన్సీ ఉంది అని చెప్పింది అన్నావు కదా? అప్లై చేసేయి. ఇంటి బాధ్యతల గురించి ఆలోచించకు. అవి ఇద్దరం కలిసి చేద్దాం” అని చెప్పాను. తను కూడా నవ్వుతూ సరే అన్నట్టు తల ఊపింది.
ఇంక రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తూ, రవికి ఫోన్ చేసి, “ఒరేయ్… ఆ రోజు ఏదో చిరాకులో మాట్లాడేసాను. అవన్నీ మనసులో పెట్టుకోకు. సారీ రా” అని చెప్పాను. దానికి వాడు, ” ఎందుకురా ఇవన్నీ ఆలోచిస్తున్నావు? ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పు కలుద్దాం” అన్నాడు. ఇవన్నీ చేశాక ఏదో తెలియని ప్రశాంతత. పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది. ఇవాళ నేను నా ఈగో తో కాకుండా మనసుతో ఆలోచించాను. అహంకారాన్ని పక్కన పెట్టాను. అందుకేనేమో చాలా సంతృప్తిగా అనిపిస్తుంది.
మీరు కూడా నాలాగే తప్పులు చేసే ఉంటారు. నాలాగే, “నేను వాళ్లకి సారీ చెప్పేది ఏంటి? వాళ్లకి అవసరం అయితే వాళ్లే మాట్లాడతారు.” అని అనుకుని ఉంటారు. ఇలా అహంకారానికి పోకుండా మీ తప్పు ఉంటే మీరు క్షమాపణలు అడగండి. అవతల వారి బాధని అర్థం చేసుకోండి. దాని వల్ల మీరు వారికి చులకన అయిపోరు. అసలు మీరు అహంకారంగా ఉంటేనే అవతల వారికి చులకన అవుతారు. మీ తప్పు తెలుసుకొని వారితో మాట్లాడి సమస్యని పరిష్కరించుకుంటే మీరు నిజంగా వారికి ఎంత విలువ ఇస్తారు అనేది అర్థం అవుతుంది.
మీ తల్లిదండ్రులకి, కుటుంబానికి కూడా అంతే విలువ ఇవ్వండి. ఎంత బిజీగా ఉన్నా సరే కొంచెం సేపు వారితో మాట్లాడండి. వారి ఇష్టాలని తెలుసుకోండి. వారు ఏం చేయాలి అనుకుంటున్నారో అది వారిని అడగండి. దానికి మీ వంతు ఏమి చేయగలుగుతారో అది చేయండి. వారిని ప్రోత్సహించండి. అంతే కాకుండా మీ సహ ఉద్యోగులతో కూడా మంచిగా మెలగండి.
ఏదైనా మంచి పని చేయాలి అనిపిస్తే వెంటనే చేసేయండి. ఉన్నది ఒకే ఒక జీవితం. ఇది మళ్ళీ రాదు. అందుకే అహంకారాలకి, కోపాలకి పోకుండా మీ చుట్టూ ఉన్న వారితో మంచి రిలేషన్ ఏర్పరచుకోండి. మనుషులతో గొడవలు పడకుండా, వారిని వీలైనంత అర్థం చేసుకోండి. మీరు నిద్ర లేచిన ప్రతి రోజు ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకొని హాయిగా నవ్వుతూ బతకండి.