Ads
మనిషికి అన్నీ ఉన్నా ప్రశాంతత మాత్రం ఉండదు. అందుకే ఎప్పుడూ ఏదో ఒక గొడవలు అవుతూనే ఉంటాయి. అసలు మనం మన ప్రశాంతత ఎప్పుడు కోల్పోతామో తెలుసా? మనం పక్కవారితో మనల్ని పోల్చుకున్నప్పుడు. వాళ్ల దగ్గర అన్ని ఉన్నాయి మన దగ్గర ఏమీ లేవు అని అనుకున్నప్పుడు. అప్పుడే ప్రశాంతత, మనశ్శాంతి దూరమైపోతాయి. కానీ అలా పక్క వాళ్లతో పోల్చుకోవడం వల్ల ఒక మనిషి తన చుట్టూ ఉన్న వాటిని గుర్తించడం మానేస్తాడు. ఇప్పుడు చెప్పబోయే కథ చదివితే ఈ విషయం మీకే అర్థమవుతుంది.
ఒక భార్య, ఒక భర్త ఉండేవారు. భర్త ఒక మామూలు ఉద్యోగి. ఇంట్లో ఖర్చులకు పోగా తర్వాత ఎక్కువ డబ్బులు మిగలవు. భార్య కి వాళ్ళు మంచి ఇంట్లో ఉండాలి, కార్ కొనుక్కోవాలి, ఏదైనా కొనాలంటే ఆలోచించకుండా కొనే అంత స్థాయికి రావాలి అని ఉండేది. తన స్నేహితులు అందరూ వాళ్లు అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం అని చెప్పిన ప్రతిసారి ఇంటికి వచ్చి వాళ్ళ స్నేహితులు అందరూ పైకి ఎదుగుతున్నారని కానీ తాము మాత్రం అక్కడే ఉన్నాం అని బాధపడేది.
ఒకరోజు చుట్టాల ఇంట్లో ఒక పెళ్ళికి వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ తను పట్టు చీర కట్టుకొని వెళ్లకపోతే అందరూ ఏమనుకుంటారో అని ఎప్పుడో కొన్న ఒక పట్టు చీర ఉంటే అదే కట్టుకుంది. భార్య భర్త ఇద్దరూ కలిసి పెళ్లికి వెళ్లారు. అక్కడ ఎవరితో మాట్లాడితే ఏం అడుగుతారో అని ఇద్దరు ఎవరితోనూ మాట్లాడకుండా ఒకచోట కూర్చున్నారు. అప్పుడు సడన్ గా అక్కడ ఉన్న భార్య భర్తలు అందరూ ఒక గేమ్ ఆడాలి అని పిలిచారు. దాంతో వీళ్ళిద్దరూ కూడా వెళ్లారు.
ఆ గేమ్ ఏంటంటే. ఒక కుర్చీ ఉంటుంది ఆ కుర్చీలో భర్త భార్యను కూర్చోబెట్టాలి. తర్వాత కుర్చీ మీద ఇంకొక కుర్చీ పెడతారు. అలా కుర్చీల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సంఖ్యతో పాటు గా ఎత్తు కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. భర్త భార్యని కుర్చీ ఎంత ఎత్తులో ఉంటే అంత ఎత్తులో కూర్చోబెట్టాలి. ఈ గేమ్ లో గెలిచిన వాళ్ళకి 20 వేల బహుమతి ప్రకటించారు.
Ads
భార్య భర్తలు ఇద్దరూ గేమ్ ఆడటం మొదలుపెట్టారు. వీళ్లతో పాటు ఇంకా కొంత మంది భార్య భర్తలు కూడా ఈ గేమ్ ఆడుతున్నారు. కుర్చీల సంఖ్య పెరుగుతూ ఉంది. కుర్చీ ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు ఎత్తి భార్యను కూర్చోపెడుతున్నాడు భర్త. మిగిలిన వాళ్ళందరూ తమ భార్యలను అంత పైకి ఎత్తలేక గేమ్ ఆపేశారు. కానీ వీళ్లిద్దరు మాత్రం ఇంకా గేమ్ ఆడుతూనే ఉన్నారు. ఎంత కష్టమైనా సరే తన భార్యను ఎత్తి కూర్చోపెడుతున్నాడు భర్త. దాంతో వీళ్ళిద్దరూ గేమ్ లో గెలిచారు అంత కష్టపడిన భర్త ని చూసి భార్యకి బాధగా అనిపించింది. దాంతో భర్తని వెళ్లి ఎందుకు అంత కష్టపడ్డాడు అని అడిగింది.
దానికి ఆ భర్త ఇప్పటివరకు తన భార్యకు ఏమి ఇవ్వలేకపోయాను అని, అందుకే బహుమతి గా వచ్చిన 20000 రూపాయల తో తనకు ఏమైనా కొనిద్దామని అనుకున్నాడు అని చెప్పాడు. భర్త మాటలు విన్న ఆ భార్య ఇప్పటివరకు తన భర్త ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని బాధపడింది. తనకి బహుమతిగా వచ్చిన డబ్బులు వద్దు అని, తన భర్త మంచితనాన్ని తెలుసుకున్నాను అని, అదే తనకి పెద్ద బహుమతి అని చెప్పింది.
అప్పటినుండి తను ఎప్పుడూ వాళ్ల దగ్గర అది లేదు, ఇది లేదు అని బాధ పడలేదు. ఉన్నవాటిలోనే ఆనందాన్ని వెతుక్కోవడం మొదలు పెట్టింది, అలాగే పక్క వాళ్లతో పోల్చుకోవడం ఆపేసింది. ఇది ఉదాహరణకు చెప్పిన కథ మాత్రమే అయినా కూడా నిజం జీవితంలో ఇలా పక్క వాళ్లతో పోలిస్తే తాము చాలా తక్కువ లో ఉన్నాము అని బాధ పడే వ్యక్తులు ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు.
మనం ఏదైనా సాధించాలి అంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. అంతే గాని వాళ్లతో పోల్చుకోకూడదు. ఎందుకంటే ఎవరి ప్రయాణం కూడా ఒకే లాగ ఉండదు. ఎవరి కష్టం వారిది. కాబట్టి ఎప్పుడైనా ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మనం ఏం చేస్తే ముందుకు వెళ్లగలం అనే దానిపై శ్రద్ధ పెడితే, అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం.
Note: all the images used in this article are just for representative purpose. But not the actual characters