Ads
కోలీవుడ్ కమెడియన్ యోగి బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్. అతను లేకుండా కోలీవుడ్ లో మాక్సిమం అగ్ర హీరోల సినిమాలు ఉండవు అనడంలో అతిశయోక్తి లేదు. కమెడియన్ గా తన వంతు నవ్వుల పువ్వులు పూయించే యోగి బాబు ప్రధాన పాత్రలో అనేక చిత్రాలలో నటించారు. ఇదేవిధంగా ఇటీవల కాలంలో అతను నటించిన లక్కీ మ్యాన్ అనే చిత్రం విడుదల అయింది. సెప్టెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తెలుగు వర్షన్ సెప్టెంబర్ 29 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇంతకీ యోగి బాబు నటించిన లక్కీ మ్యాన్ స్టోరీ ఏంటో లుక్కేద్దాం పదండి…మురుగన్ ( యోగి బాబు) పై చిన్నతనం నుంచి నష్ట జాతకుడు అన్న ఒక అభిప్రాయం జనాల్లో ఏర్పడుతుంది. దీంతో అతను కూడా తనంత వరస్ట్ జాతకం మరొకరిది ఉండదు అని అభిప్రాయానికి వచ్చేస్తాడు. ఏదో చిన్నపాటి జీతంతో.. చిన్ని ఉద్యోగం చేసుకుంటూ…కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. మామూలు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ఇంటి అద్దె, కొడుకు స్కూల్ ఫీజు లాంటి కష్టాలు ఇతని జీవితంలో కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతని భార్య దేవయాని (రేచల్ రెబెక్కా) అతనిపై తీవ్రమైన అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది.
సరిగ్గా అలాంటి సమయంలో ఒక చిట్ఫండ్ కంపెనీ తీసిన లాటరీ పుణ్యమా అని ఒక కారు గిఫ్ట్ గా వస్తుంది. దీంతో తనకు అదృష్టం కలిసి వచ్చింది అని అతను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. అయితే ఆ కారు మనకెందుకు.. దాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో అవసరాలు తీర్చుకుందాం అని భార్య సలహా ఇస్తుంది. కానీ మృగం మాత్రం మొదటిసారి జీవితంలో తాను లక్కీ మ్యాన్ అని ప్రూవ్ చేసిన ఆ కారును అమ్మడం ససేమిరా కుదరదు అని తేల్చి చెప్పడంతో పాటు ఆ కారును ఎంతో అపురూపంగా చూస్తుంటాడు.
Ads
కారు విషయంలో శివకుమార్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ తో మురుగన్ కి గొడవ అవుతుంది. ఆ తర్వాత ఒకరోజు కారు మిస్ అవుతుంది. మురుగన్ అదే పోలీస్ ఆఫీసర్ కి వచ్చి ఫిర్యాదు చేస్తాడు. ఇక కారు కోసం తిరుగుతూ ఉన్న ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకొని ఇబ్బందుల్లో పడతారు. ఈ నేపథ్యంలో శివకుమార్ తనమీద కక్ష కొద్దీ ఇలా చేయించి ఉంటాడు అని అతని సుపీరియర్స్ కు మురుగన్ కంప్లైంట్ ఇస్తాడు. అయితే ఆ తరువాత ఏం జరిగింది? ఇంతకీ మురుగన్ కార్ ఏమైంది? తన పైన కంప్లైంట్ ఇచ్చిన మురుగన్ ను శివకుమార్ ఏం చేస్తాడు? అనేది మిగిలిన స్టోరీ.
చాలా సింపుల్ లైన్ తీసుకొని ఎంతో తక్కువ బడ్జెట్ తో కామెడీ తో పాటు ఎమోషనల్ గా కూడా ప్రేక్షకులను టచ్ చేసే చిత్రంగా లక్కీ మ్యాన్ ను చెప్పుకోవచ్చు. చెప్పడానికి ఇది ఏదో పెద్ద గొప్ప కథగా అనిపించక పోయినా ఎక్కడ బోర్ కొట్టకుండా ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తుంది. పెద్ద పెద్ద బడ్జెట్ పెట్టి అర్థం కాని కథలు తీసే సినిమాలు కంటే కూడా కొన్నిసార్లు ఇటువంటి చిన్న సినిమాలే మనకు ఎంతో రిలాక్సింగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చూడాలి అనుకుంటే వెంటనే ఆన్లైన్లో స్ట్రీమింగ్ అవుతున్న లక్కీ మ్యాన్ చూసేయండి