Ads
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలకు సీన్ రివర్స్ అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ, వారికి కంటి మీద కునుకు దూరం చేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో ఉంటూనే పలువురు నేతలు కాంగ్రెస్ లోకి టచ్ లోకి వస్తున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇదే ప్రయత్నం చేసారు. తనతో పాటుగా తన మద్దతుదారులకు సీట్ల గురించి మంతనాలు చేసారు. హమీ పొందరు. ఇంతలో ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. హామీలు గుప్పించారు. అక్కడ జీ హుజూర్ అన్నారు. తన స్వలాభం కోసం బీఆర్ఎస్ వైపు ఉండాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు అనుచర వర్గానికి ఇది రుచించటం లేదు. ఇక్కడే సీన్ రివర్స్ అయింది. అనుచరుల తాజా వ్యూహాల్లో మహేందర్ రెడ్డి గేమ్ బూమ్ రాంగ్ అయింది.
బీఆర్ఎస్ తొలి విడత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తాండూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని.. పార్టీ హైకమాండ్.. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తాండూర్ నియోజకవర్గంలో పోటీ చేసి, గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆయన పార్టీలో క్రియాశీలకంగా మారారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే.. పట్నం మహేందర్ రెడ్డికి ఛాన్స్ లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరేందుకు పట్నం రూట్ క్లియర్ చేసుకున్నారు.
Ads
తనతో పాటుగా తన మద్దతు వర్గానికి సీట్ల పైన కాంగ్రెస్ లో చర్చించారు. అదే సమయంలో కొందరి సీట్ల ఖరరు అంటూ ఒక జాబితా బయట పెట్టారు. అందులో వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కు జహీరాబాద్, తీగల అనితకు మహేశ్వరం, కేఎస్ రత్నం కు చేవెళ్ళ, తాండూరు నుంచి మహేందర్ రెడ్డికి ఇవ్వాలని..మహేందర్ రెడ్డి సతీమణి సునీతకు చేవెళ్ల లోక్ సభ ఇస్తారంటూ వ్యూహాత్మక లీకులు వచ్చాయి. స్పష్టమైన హామీ తీసుకున్నారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో రంగారెడ్డి జిల్లాలోని ఒక ఎమ్మెల్సీ ప్రగతి భవన్ కు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఫోన్ రావటంతో పరుగున వెళ్లిన మహేందర్ రెడ్డికి ఆయన పాత చిట్టా బయట పెట్టారు. పార్టీ వీడితే జరిగేది ఏంటో సున్నిత హెచ్చరికలతో స్పష్టత ఇచ్చారు. అంతే..మహేందర్ రెడ్డి జీ హుజూర్ అంటూ గులాబీ తోట లోనే పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్లో తగిన గుర్తింపు లేదు. తాండూరు ఈ సారి పైలెట్ కు ఖాయం చేస్తూనే మహేందర్ రెడ్డికి ఆశ పెంచారు. అనుచరులు, సన్నిహిత నేతలకు కాంగ్రెస్ లోకి వెళ్దామని చెప్పి..ఇప్పుడు నో అంటూ వారందరికీ మహేందర్ రెడ్డి సమాచారం ఇచ్చారు. కానీ, వారంతా బీఆర్ఎస్ నాయకత్వాన్ని, మహేందర్ రెడ్డి మాటలను నమ్మేందుకు సిద్ధంగా లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. ఎవరికి వారు కంగ్రెస్ నేతలతో మంతనాలు ప్రారంభించారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మహేందర్ రెడ్డిని బేఖాతర్ అంటున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు ఊహించని మహేందర్ రెడ్డి వ్యూహం బెడిసి కొట్టింది. ఆయన ప్లాన్స్ అన్నీ బూమ్ రాంగ్ అయ్యాయి. ఒంటరి వాడయ్యాడు. ఇప్పుడు బీఆర్ఎస్ లోనూ ఇచ్చిన హామీ అమలు అవుతుందా లేదా అనేది సందేహమే!