Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తీసే హీరోల్లో ఒకరు సందీప్ కిషన్. ఫలితాలతో సంబంధం లేకుండా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తూ వస్తున్నారు. అలా ఇప్పుడు ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం: ఊరు పేరు భైరవకోన
- నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్.
- దర్శకుడు: విఐ ఆనంద్
- సంగీతం: శేఖర్ చంద్ర
- నిర్మాత : అనిల్ సుంకర
- రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 16, 2024
కథ:
బసవ (సందీప్ కిషన్) ఒక దొంగ. అతని స్నేహితుడు జాన్ (వైవా హర్ష) కూడా ఒక దొంగ. ఒక స్టంట్ మ్యాన్. ఎప్పటికైనా సరే ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అని కలలు కంటాడు. బసవ బాబాయ్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల అతని జీవితం మారుతుంది. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతికే వీరికి అనుకోకుండా భైరవకోన అనే ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళిద్దరితో పాటు అగ్రహారం గీత (కావ్య థాపర్) కూడా ఆ ఊరికి వెళుతుంది.
అక్కడ బసవ, భూమి (వర్ష బొల్లమ్మ) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమె కోసం, ఆ ఊరి ప్రజల కోసం ఒక అమ్మాయి పెళ్లిలో నగలు దొంగతనం చేస్తాడు. అయితే భైరవకోన అనే ఊరికి గరుడ పురాణంతో లింక్ ఉంటుంది. బసవ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? గీత ఎవరు? భైరవకోన నుండి వీళ్లంతా ఎలా బయటపడ్డారు? అసలు ఆ భైరవకోన అనే ఊరిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ సినిమాలకి ఈమధ్య డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇటీవల ఈ జోనర్ లోనే విరూపాక్ష వచ్చి హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా అదే జోనర్ కి చెందిన సినిమా అయినా కూడా, విరూపాక్ష సినిమాకి, ఈ సినిమాకి సంబంధం ఉండదు. ఈ సినిమా కథ కొత్తగా ఉంది. నిజంగానే ఇలాంటి కథలు మన ఇండస్ట్రీలో తక్కువగానే వస్తాయి. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆసక్తికరంగా సాగుతుంది. అలా వెళ్ళిపోతున్న ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సమయానికి ఒక ట్విస్ట్ పెట్టారు.
అది బాగుంది. సెకండ్ హాఫ్ కి మంచి స్టాండర్డ్ లో సీన్ పడింది. ఆసక్తికరంగా ఎండ్ అయిన ఇంటర్వెల్ తర్వాత మొదలైన సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు మాత్రం ఆసక్తి కొంచెం తగ్గుతుంది. అందుకు కారణం లాజిక్ లేని కొన్ని సీన్స్. సినిమా కథ బాగానే ఉన్నా కూడా స్క్రీన్ ప్లే విషయంలో జరిగే పొరపాట్ల వల్ల ఇలాంటివి అవుతాయి. లాజిక్స్ అక్కడక్కడ మిస్ అయ్యాయి. భైరవకోన అనే ఊరిని నిర్మించిన విధానం బాగుంది. అందులో పాత్రలని రాసుకున్న విధానం కూడా బాగుంది.
Ads
కానీ అవన్నీ తెరపై చూపించే విషయంలో మాత్రం చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, బసవ పాత్రలో సందీప్ కిషన్ చాలా బాగా నటించారు. తన పాత్రకి తాను ఎంత చేయగలరో అంత చేశారు. గీత పాత్రలో కావ్య థాపర్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. భూమి పాత్రలో వర్ష బొల్లమ్మ స్క్రీన్ టైం కొంచెం సేపే అయినా కూడా తన పాత్రకి తగ్గట్టు నటించారు. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ బాగుంది. సీనియర్ నటి వడివుక్కరసి చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో నటించారు.
డబ్బింగ్ ఇంకొంచెం గంభీరంగా ఉంటే బాగుండేది. కానీ ఆమెని తెరపై చూడడం మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. రవిశంకర్ కూడా తన పాత్రకి తగ్గట్టు నటించారు. రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విఐ ఆనంద్ అంతకుముందు దర్శకత్వం వహించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా సినిమాలు కొన్ని సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ అనే అంశం మీద నడుస్తాయి. ఇందులో కూడా అలాంటివి ఉన్నాయి. ఆ సీన్స్ వరకు కొన్ని సీన్స్ విషయంలో టేకింగ్ కూడా బాగానే ఉంటుంది.
నిర్మాణ విలువలు బాగున్నాయి. భైరవకోన అనే ఊరి సెట్టింగ్ బాగుంది. సినిమాకి మరొక ప్రధాన బలం పాటలు. శేఖర్ చంద్ర అందించిన పాటలు సినిమా విడుదలకి ముందే హిట్ అయ్యాయి. సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అందించారు. చాలా సీన్స్ ని తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేశారు. కానీ కొన్ని సీన్స్ విషయంలో మాత్రం స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బాగుంటే, లాజిక్స్ విషయంలో కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
- స్టోరీ పాయింట్
- నిర్మాణ విలువలు
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సీన్
మైనస్ పాయింట్స్:
- అక్కడక్కడ ఆసక్తికరంగా అనిపించని స్క్రీన్ ప్లే
- లాజిక్ మిస్ అయిన కొన్ని సీన్స్
రేటింగ్:
3/5
ఫైనల్ గా:
సినిమా కథ బాగుంది. కొన్ని చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. అయినా కూడా అవన్నీ పట్టించుకునే అంత పెద్దగా ఏమీ లేవు. సినిమా ట్రైలర్ చూసి అసలు ఈ భైరవకోన కథ ఏంటి అని తెలుసుకోవాలి అనుకునే వారికి, సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు ఇష్టపడే వారికి ఊరు పేరు భైరవకోన సినిమా ఒక్కసారి చూడగలిగే మంచి మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఇంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా సైలెంట్ గా విడుదల అయ్యిందా..? ఈ సినిమా స్పెషలిటీ ఏంటంటే..?