Ads
సాహిత్యంలో ఎన్నో రకాలు ఉంటాయి. సాహిత్యం అంటే కేవలం సరళంగా మాత్రమే ఉండాలి అని అనుకునేవారు. పుస్తకాలు రాసినా కూడా అందులో సాధారణమైన విషయాలు గురించి రాసేవారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తపరచడం మొదలుపెట్టారు. ఆ అభిప్రాయాలు అందరికంటే భిన్నంగా ఉండడం మాత్రమే కాకుండా, సమాజంలో జరిగే చాలా విషయాలను ప్రశ్నిస్తున్నట్టు ఉండేవి. అందుకే తన అభిప్రాయాల వల్ల, వాటిని వ్యక్త పరచడం వల్ల ఆ వ్యక్తి చాలా మాటలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. గుడిపాటి వెంకటాచలం గారు. ఈ పేరుతో ఆయన చాలా మందికి తెలుసు. చలం గారు పేరుతో ఇంకా ఎక్కువ మందికి తెలుసు.
చలం గారి రచనలు అంటే, ఎటువంటి ఫిల్టర్ లేకుండా, ధైర్యంగా ఒక మనిషి మాట్లాడుతున్నట్టు ఉంటాయి. ఆయన రాసే ఫిక్షనల్ కథలు కూడా సమాజంలో జరిగే చాలా విషయాల మీద ప్రశ్నిస్తున్నట్టు ఉంటాయి. తెలుగు సాహిత్యం మీద ఆయన ప్రభావం చాలా ఉంది. చలం గారిని స్ఫూర్తిగా తీసుకొని తర్వాత చాలా మంది ఇలాంటి రచనలు చేశారు. అప్పట్లో తెలుగు సాహిత్యానికి ఒక ఆధునికతని చలం గారు తీసుకొచ్చారు. మద్రాసులో, మే 18 వ తేదీన, 1894లో చలం గారు జన్మించారు. చలం గారి తల్లి వెంకటసుబ్బమ్మ గారు, తండ్రి కొమ్మూరి సాంబశివరావు గారు. చలం గారిని తన తాతగారు గుడిపాటి వెంకట రామయ్య గారు దత్తత తీసుకున్నారు. అందుకే చలం గారి పేరు గుడిపాటి వెంకటాచలం గా మారింది.
Ads
చలం గారు సాంప్రదాయాలు ఎక్కువగా పాటించే కుటుంబంలో పుట్టారు. అందుకే చిన్నప్పటినుండి తను కూడా సంధ్యావందనం వంటి ఆచారాలని పాటించేవారు. చిన్నప్పుడే ఇతిహాస పురాణాలని చదివారు. చలం గారి తండ్రి, చలం గారి తల్లిని ఇబ్బంది పెట్టేవారు. చలం గారి చెల్లెలు అమ్మణ్ణి పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాలన్నీ చలం గారి మీద చాలా ప్రభావం చూపాయి. ఆడవారి మీద జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించాలి అనే ఆలోచన వచ్చేలాగా చేశాయి. చలం గారికి చిన్న వయసులోనే చిట్టి రంగనాయకమ్మ గారితో పెళ్లి జరిగింది. ఆ సమయంలో చలం గారు మద్రాసులో డిగ్రీ చదువుతూ ఉండేవారు. అప్పుడు చలం గారి భార్య రంగనాయకమ్మ గారి వయసు 13 సంవత్సరాలు. అప్పుడు చలం గారు తన భార్యని కాన్వెంట్ లో చేర్చి, తాను కాలేజ్ కి వెళ్లే ముందు తన భార్యని కాన్వెంట్ లో దింపి వెళ్లేవారట.
ఇందుకు చలం గారి మామగారికి కోపం కూడా వచ్చిందట. చలం గారు అప్పట్లో ఆడవాళ్ళకి మద్దతుగా ఆడవాళ్ళని ఉద్దేశించి చాలా రచనలు చేసేవారు. కానీ ఆ సమయంలో ఉన్న ఆలోచన విధానం వల్ల చలం గారి రచనలు అందరికీ కోపాన్ని తెప్పించేవి. చలం గారు స్త్రీవాది అనే విషయాన్ని పట్టించుకోకుండా చలం గారికి స్త్రీల మీద మక్కువ ఎక్కువ అని అందరూ అనుకునేవారు. చలం గారి పుస్తకాలని బహిరంగంగా చదవడానికి కూడా చాలా మంది భయపడేవారు. 1920 లో టీచర్ ట్రైనింగ్ కోసం చలం గారు రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆయనకి ఇల్లు కూడా ఇవ్వలేదు. చలం గారు ప్రవర్తించే విధానం వల్ల ఆయన భార్య రంగనాయకమ్మ గారు విసుగెత్తిపోయి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. మానసికంగా బలహీనంగా అయిపోయారు.
చలం గారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు అనారోగ్య సమస్యల కారణంగా చిన్నతనంలో చనిపోయారు. రెండవ కొడుకు దురాలవాట్లకి బానిస అయ్యారు. ఆ తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. చలం గారి కూతురు సౌరిస్ పెళ్లి చేసుకోలేదు. ఆమె రమణ మహర్షి భక్తురాలు. విశాఖపట్నంలో ఉన్న భీమిలిలో ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నారు. చలం గారు మే 4వ తేదీ, 1979 లో మరణించారు. ఆయన అంత్యక్రియలని కూతురు జరిపించారు. చలం గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన రచనల గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. ఇప్పటికి కూడా ఆయన రచనల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆయన రచనలు సమాజం మీద అంతగా ప్రభావం చూపాయి.