Ads
నవలల ఆధారంగా సినిమాల కథలు రూపొందించడం చాలా సినిమాలకు జరిగింది. గతంలో యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన కథలని సినిమాలుగా రూపొందించేవారు. అందులో ఎక్కువ సినిమాలు చిరంజీవి చేశారు. యద్దనపూడి సులోచనా రాణి గారు రాసిన పుస్తకాలను కూడా సినిమాలుగా రూపొందించారు. తెలుగులో ఇది కొత్త ఏం కాదు. మిగిలిన భాషల్లో కూడా ఇలాగే నవలల ఆధారంగా సినిమాలు రూపొందాయి. కాకపోతే ఈ మధ్యకాలంలో తెలుగులో మాత్రం ఇలా పుస్తకాల ఆధారంగా సినిమాలు తీయడం అనేది చాలా తగ్గిపోయింది.
ఎప్పుడో ఒకసారి ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి. అలా కొంత కాలం క్రితం ఒక నవల ఆధారంగా ఒక సినిమా వచ్చింది. నవల పేరు అదే. సినిమా పేరు కూడా అదే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. తన రెండవ సినిమాగా హీరో వైష్ణవ తేజ్ ఈ సినిమా చేశారు. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని చేసినందుకు, అది కూడా కెరీర్ మొదట్లోనే ఇలాంటి సినిమా చేసినందుకు వైష్ణవ్ తేజ్ ని అందరూ అభినందించారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్ గా నటించారు.
Ads
ఎం ఎం కీరవాణి సంగీత దర్శకత్వం అందించిన ఈ సినిమాకి, జ్ఞానశేఖర్ వి ఎస్ సినిమాటోగ్రఫీ అందించారు. కటారు రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్), ఓబులమ్మ (రకుల్ ప్రీత్ సింగ్) అనే వ్యక్తుల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. సినిమా చాలా వరకు కూడా అడవిలోనే చిత్రీకరించారు. సినిమా చిత్రీకరణ సమయంలో వాళ్ళకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనేది కూడా క్రిష్ జాగర్లమూడి చాలా ఇంటర్వ్యూలలో తెలిపారు. సాధారణ లొకేషన్ లో సినిమా కాదు కాబట్టి, కెమెరా పరికరాలను ఎలా తీసుకెళ్లేవారు, అక్కడికి వెళ్లాక సీన్ షూటింగ్ సమయంలో ఎలా అన్నిటిని ఏర్పాటు చేసుకునే వారు అనే విషయాలని చెప్పారు. ఈ సినిమాకి ధమ్ ధమ్ అనే పాట రాసినందుకు చంద్రబోస్ కి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.